Saturday 1 December 2012

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కోసం ఇప్పుడు చట్టాలా?



రాష్ట్ర జనాభాలో 25 శాతం, అంటే దాదాపు రెండు కోట్ల మంది భవిష్యత్‌ కి సంబంధించి దశాదిశా నిర్దేశం చేసే చట్టం రూపకల్పన చేస్తున్నామని సర్కారు ఆర్భాటంగా ప్రకటించింది. 52,972 దళిత వాడలు, 20వేల గిరిజన గోండు గూడేలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే 2007 బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇప్పుడు బల్లలు చరిచినట్టే ఆనాడు అధికార పక్షం కూడా బల్లలు, చంకలు ఏకకాలంలో గుద్దుకుంది. నోడల్ ఏజెన్సీలు తీసుకొచ్చి దళితుల్లో మార్పు తేబోతున్నాం అని అప్పటి ముఖ్యమంత్రి గంభీరంగా ఉపన్యాసం ఇచ్చారు. ఉన్నత స్థాయిలో 5 కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన అపెక్స్ కమిటీ, చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో హైలెవల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ, సాంఘిక సంక్షేమ మంత్రి అధ్యక్షతన నోడల్ కమిటీ, జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో డిస్ట్రిక్ట్ కమిటీ, మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మండల కమిటీ! ఇన్ని కమిటీలు వేసినా ఆచరణలో మాత్రం శూన్యం. ఎందుకంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన అపెక్స్ కమిటీ చివరి సమావేశం జరిగింది 2010 జులైలో. అంటే ఇప్పటికీ రెండు సంవత్సరాల 5 నెలలైంది. అప్పట్నుంచి సబ్‌ ప్లాన్‌ అమలవుతుందా లేదా అని రివ్యూ చేయడానికి సీఎంకి టైం దొరకలేదు. ఇక చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ చివరి మీటింగ్ మార్చి 25, 2011. అంటే దాదాపు రెండేళ్లుగా చీఫ్‌ సెక్రటరీకి కూడా సమయం లేదు. ఇకపోతే సోషల్ వెల్ఫేర్‌ మినిస్టర్ రివ్యూ చేసింది ఫిబ్రవరి 2011లో. వీళ్లే ఇలా ఉంటే జిల్లా కలెక్టర్‌ ఏపాటి! మండలాల్లో అయితే ఆ ఊసే లేదు. అంటే ఓవరాల్‌గా రెండేళ్లుగా సబ్‌ ప్లాన్‌ అమలవుతుందా లేదా అన్న విషయం గవర్నమెంటుకు పట్టింపులేదు. ఇదీ దళిత గిరిజనుల మీద సర్కారుకున్న అవ్యాజ ప్రేమ.  
   
2007లో చట్టం చేసిన తర్వాత 2007-08 సంవత్సరాల్లో డైవర్టయిన ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.1,110 కోట్లు. 2008-09లో రూ. 3,516 కోట్లు. 2009-10లో రూ. 3,170 కోట్లు. 2010-11లో రూ. 2,210కోట్లు! చట్టాలు చేసి నోడల్ ఏజెన్సీలు పెట్టి ఇన్ని కమిటీలుంటేనే సబ్‌ ప్లాన్‌ అమలు తీరు ఇంత దారుణంగా ఉంది. ఇవేవీ లేకుంటే ఇంకెంత ఘోరం జరిగిపోయేదో ఊహించుకోవచ్చు. అప్పటికీ ఆ ఖర్చయిన వివరాలు చూస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే. అవుటర్‌ రింగురోడ్డు కోసం 2010-11 సంవత్సరంలో  రూ. 80కోట్లు ఖర్చు పెట్టారు. 2011-12 సంవత్సరంలో అదే అష్టవంకర్ల రోడ్ల కోసం 155 కోట్లు ధారపోశారు. మెట్రో కోసం 45 కోట్లు, ప్రభుత్వ, ప్రైవేటు రహదారుల కోసం 325 కోట్లు, హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన కోసం 11 కోట్లు,  గీత కార్మికుల పెన్షన్ల కోసం 5 కోట్లు ఖర్చుపెట్టారు. అందులో దళితులకు కూడా ఇచ్చారట. హైదరాదబాద్ అండర్ గ్రౌండ్‌ ట్రాన్స్ కో కేబుల్స్ వేయడానికి  30 కోట్లు, పులివెందుల అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 5 కోట్లు, అక్కడే ఎమ్మార్వో కార్యాలయానికి 5.50 కోట్లు ఖర్చు పెట్టారంటే.. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. చట్టాలు చేసే సభలో మాటలు కోటలు దాటుతున్నవి. కానీ ఆచరణ మాత్రం గడప దాటడం లేదు. ఇందుకు ఏ ముఖ్యమంత్రీ అతీతుడు కాదు. అన్ని  ప్రభుత్వాలు దళిత గిరిజనులకు ఒరగబెట్టిందేమీ లేదు.

వాస్తవానికి ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ మూడు దశాబ్దాల క్రితం మాట. వాటి అమలు కోసం ఇప్పుడు చట్టాలు తీసుకురావడం దౌర్భాగ్యం కాకపోతే మరేంటి? దీన్నిబట్టి మన చట్టాలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. దళిత గిరిజనుల పట్ల సర్కార్లు ఎంత నిబద్ధతో ఉన్నాయో అవగతమవుతోంది. సబ్‌ ప్లాన్‌ అమలు కోసం చర్చలు కమిటీలు ధర్నాలు పోరాటాలు ఎన్నో అసెంబ్లీ వేదికగా జరిగాయి. కానీ అవేవీ వాళ్ల హక్కులను కాపాడలేక పోయాయి. ఏప్రిల్ 28, 2001లో అప్పటి ప్రెసిడెంట్ కేఆర్‌ నారాయణన్‌ గవర్నర్లతో ఓ కమిటీ వేస్తే ఆ కమిటీ 2006లో గైడ్‌లైన్స్ ఇచ్చింది. 2010లో జాదవ్‌ కమిటీ రిపోర్టు ఇచ్చింది. 2011 నవంబర్లో, 2012 నవంబర్లో యూపీయే ప్లానింగ్ కమిటీ రిపోర్టిచ్చింది. అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది. స్వాతంత్ర్యం వచ్చి 65 ఏళ్ల తర్వాత ఇన్ని జీవోలు ఇన్ని చట్టాలు కల్పించినా దళిత గిరిజనుల పరిస్థితి ఇంకా అట్టడుగునే ఉంది. ప్రణాళికా సంఘం ఇచ్చిన అధ్యయనం ప్రకారం ఇప్పటిదాకా రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకు ఇళ్లు లేవు. 60 శాతం దళితవాడలకు మంచినీటి సదుపాయం లేదు. 80 శాతం జనాభాకు మరుగుదొడ్లు లేవు. దళిత గిరిజన వాడల్లో ఇప్పటికీ డ్రైనేజీ లేదు రోడ్లు లేవు. ప్రతీ ఏడాది వానాకాలంలో వేల సంఖ్యలో గిరిజనులు అంటురోగాల బారిన పడి చనిపోతున్నారు. 59శాతం మందికి సెంటు భూమి కూడా లేదు. 1,185 ఎస్సీ హాస్టళ్లకు పక్కా భవనాల్లేవు. 272 ఎస్టీ హాస్టళ్లకు సొంత భవనాల్లేవు. ఓట్ల కోసం చట్టాలు చేసి పథకాలు ప్రవేశ పెడుతున్నారు. కానీ ఏం లాభం? అవి సరిగా అమలవుతున్నాయా లేదా అని  క్షేత్ర స్థాయిలో చూసే నాథుడే లేడు.

ఇప్పడున్న ఎస్సీ హాస్టళ్లు చూస్తే కన్నీళ్లొస్తాయి. అంబేద్కర్‌ మొట్టమొదటి ఆశయం దళిత గిరిజనులకు మెరుగైన చదువు. కానీ ప్రభుత్వాలు దాన్నే పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి.  హాస్టళ్లలో దరిద్రం తాండవిస్తోంది. పొద్దున నీళ్ల చారు. రాత్రి పప్పు చారు. కూర ఊసే లేదు. ఒక్కొక్కరికి ఇచ్చే మెస్‌ బిల్లు రూ.16.83 పైసలు. వాటితో మూడు పూటలా భోజనం పెట్టమంటే ఎలా సాధ్యం. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌, కేరళ, కర్నాటకలో రూ.800 నుంచి 1000 వరకు ఇస్తున్నారు. కానీ మనకాడ ముష్టి 535 రూపాయలిస్తున్నారు. జైళ్లలో అటువంటిది 50 రూపాయలిస్తున్నారు. అంతకంటే అధ్వాన్నమై పోయింది. దాని పర్యావసానమే డ్రాపవుట్ల సంఖ్య పెరిగింది. పిల్లలు హాస్టళ్లలో ఉండమని పారిపోయి వస్తున్నారు. కడుపు నిండా అన్నం లేక, కనీసం తాగడానికి నీళ్లు లేక విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. మొన్నటిదాకా 400 ఉన్న గ్యాస్ ఏకంగా 1,286 రూపాయలైంది. ఒక్కో విద్యార్ధి మీద 85 రూపాయలు అదనపు భారం పడుతోంది. దీనిపై ఎవరూ నోరు మెదపరు. 

ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయి. ఎంపీల జీతాలు పెరిగాయి. అధికారులూ పెంచుకున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రుల సాలరీ పెరిగింది. కానీ ఈ నాలుగేళ్లలో ఏ హాస్టల్  విద్యార్ధి మెస్ చార్జీ అయినా పెరిగిందా?  ఇంతకంటే బాధాకరం మరోటి లేదు. ఒక్కో విద్యార్ధి 2600 కెలరీల ఆహారం అవసరం. అప్పుడే పిల్లలు చదువు మీద దృష్టి పెట్టగలుగుతాడు. కానీ ఇవాళ 1300 కెలరీస్ కూడా దొరకడం లేదు. రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నామని గొప్పగా చెప్తున్నారు. మరి ఈ పేద విద్యార్ధులేం పాపం చేశారు. వాళ్లకు మాత్రం 4 రూపాయలకు కిలో బియ్యం. కనీసం రూపాయికైనా ఇవ్వాలన్న ధ్యాస సర్కారుకు లేదు. కేబినెట్ సబ్‌ కమిటీ అన్నీ స్టడీ చేసిందంటున్నారు. చూస్తుంటే అదేమీ కనిపించడం లేదు. ఇప్పటికైనా కేరళ, కర్నాటక, మహారాష్ట్రను చూసి నేర్చకుంటే దళిత గిరిజనులకు ఎంతోకొంత మేలు చేసినవాళ్లవుతారు.
  

1 comment:

  1. Really good piece on ST, SC , Sub plan.. thanks for sharing

    ReplyDelete