Thursday 30 August 2012

నేనొక దిక్కుమాలిన.....


ఒకప్పుడు ఐదేళ్లకు గానీ పిల్లల్ని బడికి పంపేవాళ్లు కాదు. ఇప్పుడా సంప్రదాయం కనుమరుగైంది. రెండున్నరేళ్లకే బరబరా ఈడ్చుకెళ్లి బడిలో దిగబెట్టి వస్తున్నారు. దానికి పెట్టిన ముద్దుపేరు ప్రీ స్కూల్. ప్లే స్కూల్. అక్కడ పిల్లలకి అక్షరాలు దిద్దించరు. పుస్తకాలు ముందేసి బట్టీల్లాంటివి పట్టించరు. పిల్లలకి స్కూల్ వాతావరణం అలవాటు కావడానికి రకరకాల గారడీలు చేయిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. డీజే లాంటిది పెట్టి గంతులేయిస్తారు. వాళ్లు నవ్వితే ఫోటోలు తీస్తారు. ఏడిస్తే నోట్లో లాలీపాప్ కుక్కుతారు. ఉచ్చపోస్తే కడిగేస్తారు. మూడు నాలుగు గంటల హైరానా తర్వాత జాగ్రత్తగా ఇంటిదగ్గర దిగబెడతారు. ఈ సీన్‌ ఇక్కడ కట్ చేస్తే..
మా బుడ్డిదానికి రెండేళ్లమీద రెండు నెలలు. గొప్పలు చెప్పుకోవద్దుకానీ కొంచెం హైపర్ యాక్టివ్. గబ్బర్‌సింగ్ సినిమాలో అన్ని పాటలు తెలుసు. జులాయిలో ఓ మధూ ఓ మధూ అని హమ్మింగ్ చేస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. రాత్రి ఏడింటికి ఓ దిక్కుమాలిన సీరియల్ వస్తుంది. దాని పేరు చిన్న కోడలట. అందులో ఓ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్‌ని చంపేస్తుందట. నేను ఆఫీస్‌ నుంచి రాగానే మా పాప అర్జెంటుగా  ఆ విషయాన్ని ఎక్స్‌ ప్లయిన్ చేయడానికి నానా తంటాలు పడుతుంటే మా ఆవిడ మధ్యలో అడ్డుకుని పాప చెప్పాలనుకున్న మేటర్‌ని ట్రాన్స్ లేట్ చేసి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి షాకింగ్ న్యూస్‌ రాత్రి పదిన్నరకు మా పాప బోలెడన్ని చెప్తుంది. బుడ్డిదాని టాలెంట్ చూసి ఇరుగుపొరుగు అంతా ప్రీ స్కూల్లో వేయండి మీ పాపని అని సలహాలిచ్చారు. దాంతో మా ఆవిడ యుద్ధప్రాతిపదికన ప్రీ స్కూల్ వెతకండి అని ఆర్డరేసింది. ఇక్కడ సీన్‌ కట్ చేస్తే..
ఏదో దిక్కుమాలిన పేరు. చిత్ర విచిత్రంగా ఉంది. లోపలికెళ్లాను. యూనిఫాంలో   పిప్పళ్ల బస్తాలా ఉన్న ఓ వ్యక్తి సాబ్ బోలియే అన్నాడు. బోల్తానుగానీ ముందు రిసెప్షన్‌ ఎక్కడుందో చెప్పరా బాబూ అన్నాను. ఈసారి వాడు ఇంగ్లిష్‌లో రిగార్డింగ్ అన్నాడు. వీడు వదిలేలా లేడని విషయం చెప్పాను. సోఫా చూపించి కూచో అన్నాడు. ఐదు నిమిషాలు అటూ ఇటూ చూశాను. ఇంతలో ఒకావిడ చెవుల్దాకా నవ్వుతూ విష్‌ చేసింది. నేనూ చెంపలదాకా నవ్వి హాయ్‌ అన్నాను. విషయం అడిగింది. పాపను జాయిన్‌ చేయించాలి అని నాకున్న కొద్దిపాటి ఇంగ్లిష్‌ పరిజ్ఞానంలో కన్వే చేయబోయాను. ఆవిడకి అర్ధమైంది నా బాధ. ముందు ఒక ఫాం ఇచ్చి నింపమంది. నింపాను. తర్వాత ఫీజు డిటెయిల్స్ వివరించింది. ముందుగా 12వేలు నాన్‌ రిఫండబుల్!అంతే.. అదొక్క మాటే వినిపించింది. తర్వాత ఆవిడ అంకెలు చెప్తూ పోతునే ఉంది. నేను అప్పటికే కోమాలోకి వెళ్లాను. నాకున్న రెండు ప్లాట్లకు రెక్కలొచ్చినట్టుగా.. నేను మా ఆవిడ చెరో కిడ్నీ  అమ్ముకున్నట్టుగా.. సగం లివర్‌ అమ్మడానికి బ్రోకర్‌ని మాట్లాడుకున్నట్టుగా ఏవేవో పిచ్చి కలలు. ఐదు నిమిషాల తర్వాత ఆమె వాక్‌ధాటి ఆగిపోయింది. నావైపు చూస్తూ కృతకంగా నవ్వింది. నేను ఈసారి విరేచానాలతో బాధపడుతున్నట్టుగా మొహం పెట్టి ఆముదం తాగినట్టుగా ఎక్స్‌ ప్రెషన్‌ ఇచ్చి.. ఓకే మేడం ఆలోచించి మళ్లీ కలుస్తా! అని సుప్తచేతనావస్థలోకి జారుకుని గేటు తెరిచి బయట పడ్డాను. మూర్ఛనలు పోతూ దిక్కుమాలిన ప్లే స్కూల్ బోర్డువైపు చూస్తే గుండె స్టంట్ మార్చినట్టుగా మళ్లీ ఈసారి పీడకల వచ్చింది. వెంటనే ఒక సిగరెట్ వెలిగించి ఒక కొబ్బరి బోండాం తాగి.. బండి ఫ్లై ఓవర్‌ మీదికి ఎక్కించాను.   
   

Sunday 26 August 2012

కొంత కవిత్వం.. ఇంకొంత పైత్యం!


 జలం గలగలలు ప్రకృతి సహజ శిలాశిల్పకళ కుంభవృష్టిగా కురిసిన వడగళ్ల వానలు.  అందమైన అరణ్య గర్భ సీమలోకి మలచిన ఒక రహస్య సొరంగ మార్గాలు. శిలా జలాశయాల్లో మునిగిపోయిన గంధర్వ లోకాలు చర్మ చక్షువులకు అందని యక్షుల స్వగ్రామాలు. రస హృదయులకు మాత్రమే దర్శనమిచ్చే అప్సరసల అంతఃకోణాలు! అజ్ఞాత శిలా యజ్ఞలోకంలా అగుపించే  పెనుశిలలన్నీ ఆరిపోయిన హోమాగ్ని గుండాలు! మేఘాలు నివురుగప్పుకున్న ధూమాలు!  హరితభరిత శిఖర శిలావిలాసం ప్రకృతి రమణీయతకు దర్పణాలు. ఇది కోనా లేక రెండుగా చీలిన తుంబురుని వీణా! ఆ లోయల్లో గండశిలల గుండెలు కరిగినీరై ప్రవహిస్తుంటే నీటిఊట నోటమాట రానీయదు. ఆకాశ రహస్య రాజ మార్గమేమో అనిపించేలా భావావేశం కలుగుతుంది. అనుభవేకవేద్యమైతేగానీ సెలయేటి జలప్రవాహ రాతి వీణాతంత్రుల నాదాల్ని వర్ణించలేం. భూగర్భం నుంచి యుగయుగాల యుగళ గీతలు వినిపిస్తుంటాయి. పచ్చని శిఖరాల కలయిక ఆకాశానికి ఓ కుండలీకరణంలా ఉంటుంది. ఉలికీ శిలకూ జరిగిన ప్రణయ పరిశ్రమలో రూపొందిన వసంతుని కోటలా వనదేవతల పేటలా అలరారుతుంటుంది. శిఖర శిలా నిలయాలలో సహజ మార్మిక శిల్పాలుగా దర్శనమిస్తాయి. వనమాహినుల్లో మోహినీ అవతారం దాగిఉంది. జలదండోరా అనిపించేలా ఉంటుందీ జలపాత ఘోష. నీటి లోతుల్లో చిరుచేపల కనుపాపల కదలికలు కనిపిస్తాయి. అరణ్య మర్మ సౌందర్యాన్ని ప్రతిబింబించే ఈ జలాశయాలు కరకు శిలల్లోంచి చెరకు రసాలు స్రవించినట్టుగా ఉంటాయి. కళను శిలను కలిపి శిల్పించిన పర్వత కుడ్య చిత్రాలు ఈ అస్పష్ట కళా సృష్టి.  రాతి దోసిలి విప్పి బాలభానుడికి సమర్పించే శిలా జలాంజలి. ఏ వన కన్య స్నానం కోసమో తరలిపోతున్నట్టుగా జిలిబిలి నడకలోతో నెమ్మదిగా కదలిపోయే ఈ జలధార  నిండు సొగసుల దారి వెంబడి పసిపాపలై దారి చూపే గజ ఈతగాళ్లలా చేపలు ముందుకు పోతుంటాయి. సెలయేటి నెమలి విప్పిన నీలి పింఛంలా గగనలోక అతిథుల్లా అడుగుపెట్టే వెండి వెలుగులు శిలా ప్రపంచంలో కిరణాలు తిరునాళ్లు జరుపుకుంటాయి. జల దేవతల సమావేశ మందిరానికి నిర్మించిన శిలా సోపానాలేమో అన్నట్టుగా ఈ రాతి మలుపులు. వినిపిస్తున్న ఈ జల సవ్వడి సామవేదానిదో లేక ప్రేమ వేదానిదో తెలిస్తే ఎంత బావుంటుందో కదా!

Saturday 25 August 2012

మళ్లీ క్యాండిల్‌కి మారిపోతామా..??


పద్దెనిమిదో శతకంలో క్యాండిల్‌తో గడిపాం. నైంటీన్త్‌ సెంచురీలో థామస్ అల్వా ఎడిసన్‌ పుణ్యమాని బల్బ్‌ తో వెలుగులు నింపుకున్నాం. తర్వాత టెక్నాలజీ పెరిగింది కాంపాక్ట్‌ ఫ్లోరోసెంట్ లాంప్‌ దేదీప్యమానంగా వెలిగింది. ఆ వెలుగులు కొత్తపుంతలు తొక్కి ఎల్‌ఈడీగా మారింది. ఇంతవరకు బాగానే ఉంది. ఆ ఎల్‌ఈడీ ఇంకేదో కొత్త టెక్నాలజీతో రూపుదిద్దుకుంటుందా లేక.. మళ్లీ పద్దెనిమిదో శతకం మాదిరిగా  క్యాండిల్‌కి మారిపోతామా?

మొన్నటికి మొన్న గ్రిడ్‌ కుప్పకూలితే ముప్పావు వంతుకు పైగా దేశం చీకట్లో కూరుకుపోయింది. చేపా చేపా ఎందుకు ఎండలేదంటే లక్ష కారణాలు. అవును మరి. తినడానికి పది రొట్టెలుండి తినాల్సివాళ్లు పాతికమంది ఉంటే బలమున్నోడిదే భోజ్యం. విద్యుత్ అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉత్పత్తిలో మాత్రం పెరుగుదల లేదు. దానికి తోడు వాటాకు మించి లాక్కునే రాష్ట్రాలు. ఫలితంగా చిమ్మచీకట్లు. తెలివితో పనిచేయాల్సిన చోట కండలు ప్రదర్శిస్తే ఇట్లాగే గ్రిడ్లు కుప్పకూలుతాయి. చీకట్లు కమ్ముకుంటాయి. ఇంకా మాట్లాడితే శాశ్వత అంధకారం.

ఎందుకంటే కరెంటు వాడకం పెరిగిపోయింది. దానికితగ్గట్టుగా ఉత్పత్తి లేక కోతలు పెరిగిపోయాయి. పల్లెలన్నీ అంధకారంలో ఉన్నాయి. పట్టణాల్లోనూ ఎడా పెడా కటింగ్స్. పవర్‌ హాలీడే పుణ్యమాని పరిశ్రమలు లాకౌట్‌ దశకొచ్చాయి. చిన్నాచితకా వ్యాపారులు చితికిపోయారు. రైతులకు హామీ ఇచ్చిన కరెంటుకే దిక్కులేదు. పొలాలు ఎండిపోతున్నాయి. మోటార్లు కాలిపోతున్నాయి. రైతులు దిగాలు పడుతుంటారు. కార్మికులు పస్తులుంటున్నారు. ఇంట్లోనూ చీకటి. లైట్ వెలగదు. క్యాండిల్ అంటుకుంటుంది. జనజీవనం అతలాకుతలమై పోతోంది. పాలన మీద వ్యవస్థ మీద నమ్మకం పోతుంది.  ఇలాంటి చెత్త పాలకులు ఉంటేనేం ఊడితేనేం అన్నంత కోపం వస్తుంది.
ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి. మళ్లీ ప్రాప్తకాలజ్ఞుడిని గుర్తు చేసుకోవాలి. మూడుచేపల కథను స్ఫూర్తిగా తీసుకోవాలి. సమస్య మూలాల్ని గుర్తించాలి. పరిష్కారం కోసం ఆలోచించాలి. మరి ఏంటా సొల్యూషన్‌. ఇప్పటికీ మనం పరాన్నజీవులాగే ఉంటున్నాం. ఎవరో ఇస్తేగానీ ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా కొల్లాప్స్! దినదినగండం లాంటి ఈ సిట్యువేషన్‌లో మౌళిక వనరుల అభివృద్ధి లాంటి ఇపెద్ద పెద్ద పదాల గురించి ఆలోచించడం టైం వేస్ట్‌.
మరి ఏం చేయాలి. ఏం చేస్తే విద్యుత్‌ సంక్షోభం నుంచి గట్టెక్కుతాం. కొంత కాకపోయినా కొంతైనా పవర్‌ సేవింగ్ ఎలా చేయాలి? ఎలక్ట్రిసిటీ బిల్లు బాదుడు నుంచి ఉపశమనం పొందేదెలా? అదృష్టవశాత్తు అన్ని మంచి పనులు అంత ఈజీగా అమలుకావు. వాటికి కొంచెం చిత్తశుద్ధి కావాలి. కమిట్‌మెంట్ కావాలి. అట్లీస్ట్‌ మీ ఇంటివరకైనా పవర్‌ సేవింగ్ కాన్సెప్టు అమలైతే.. మాదీ ఎనర్జీ ఎఫీషియెంట్ హోం అని నలుగురిలో గర్వంగా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని చూసి నలుగురు ఫాలో కావొచ్చు.
పండండి కాపురానికి పది సూత్రాల టైప్‌ అనుకున్నా ఫరవాలేదు. కొన్ని కొన్ని ఏరియాల్లో పవర్‌ సేవ్‌ చేస్తే మన జేబులు భద్రంగానూ ఉంటాయి. పరోక్షంగా పర్యావరణానికీ ఎంతోకొంత మేలు చేసినవాళ్లమవుతాం.  జన్రల్‌గా అందరూ వంటకోసం ఎల్పీజీ సిలిండర్‌నే వాడుతుంటారు. కానీ దాని బదులు సోలార్‌ కుక్కర్‌ని వాడండి. దాని కాస్ట్‌ ఎంతో కాదు. జస్ట్‌ వెయ్యి రూపాయలు మాత్రమే. మీరు నమ్ముతారో నమ్మరోకానీ సోలార్‌ కుక్కర్‌ వల్ల ఏడాదికి మూడు నాలుగు సిలిండర్లు పక్కా ఆదా అవుతాయి.
ఇప్పుడు మోస్తరు ఇళ్లలోనూ గీజర్లున్నాయి. దాని వల్ల కరెంటు మీటర్ మోటర్లా తిరగడం ఖాయం. దాని బదులు సోలార్ వాటర్ హీటర్ బెటర్. రోజుకి వంద లీటర్ల నీళ్లు కాచుకోవచ్చు. సెటప్ కాస్ట్ పదిహేను వేలు. సబ్సిడీ ఆరువేలు. మొత్తం తొమ్మిది వేలల్లో సిస్టం పెట్టుకోవచ్చు. దానివల్ల బోలెడంత కరెంటు ఆదా.
ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ సిస్టం. ఎఫ్పీసీ కాస్ట్ 22వేలు. సబ్సిడీ ఆరువేల చిల్లర. దీనివల్ల ఏడాదికి 1500 యూనిట్ల కరెంటు ఆదా అవుతుంది. అంటే ఎంత లేదన్నా  యాభైవేలకు పైగా సేవ్ చేసుకోవచ్చు.
మరి వానాకాలంలో మబ్బులు ఎక్కువగా ఉన్న టైంలో సోలార్ పనిచేస్తుందా లేదా అన్న సందేహం మీకక్కర్లేదు. ఎందుకంటే క్లౌడీ డేస్లో కూడా ఇవి చక్కగా వర్క్ చేస్తాయి. మాటకొస్తే ప్రపంచంలో జర్మనీ కెనడా లాంటి చాలా దేశాలు చల్లటి ప్రదేశాలే. అక్కడ కూడా ఇవి పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. అలాంటప్పుడు మనదగ్గర ఎందుకు వర్కవుట్ కాదు. సో ఇందులో మీకు సందేహం అక్కర్లేదు.
రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం విద్యుత్ మీద ఎనభైశాతం దాకా సబ్సిడీ ఇస్తున్నాయి. ఇంత ఖర్చుపెట్టినా సుఖం లేదు. ఎందుకంటే ఇచ్చినట్టే ఇచ్చి దారుణంగా కోసేస్తున్నారు. వేళాపాళా లేని కరెంటుతో రైతు నిండా మునుగుతున్నాడు. దీనికి ఒకే ఒక సొల్యూషన్ సోలార్ పంపు.
కాసేపు సోలార్ కంజంప్షన్ పక్కన పెడితే.. సాధారణంగా ఇళ్లలో ఫిలమెంట్ బల్బులు వాడుతుంటారు. దానికంటే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు వాడితే పవర్ సేవింగ్ కలిసొస్తుంది. బుగ్గ ఖరీదు జస్ట్ వందనుంచి రెండొందలు. దానివల్ల 60శాతం కరెంటు ఆదా.
అవి కాకుండా టీ-ఫైవ్ ట్యూబ్ లైట్లు కూడా మార్కెట్లో దొరుకుతాయి. వాటినుంచి  32శాతం కరెంటు ఆదా. అవి మిగిలిన ట్యూబులకంటే కాంతివంతంగా కూడా ఉంటాయి. దాని ఖరీదు 450! ఇవి కాకుండా ఫైవ్ వాట్స్ ఎల్ఈడీ వాడినా 80శాతం కరెంటు ఆదా అవుతుంది. దాని కాస్ట్ ఆరొందలని భయపడొద్దు. కరెంటు బిల్లును తగ్గివ్వడంలో అది పెద్దన్న.
ఇక హోం అప్లయన్సెస్ విషయానికొస్తే వీలైనంత వరకు డబుల్ డోర్ ఫ్రిజ్జులు వాడకుండా ఉంటే బెటర్. ఎందకంటే వాటివల్ల విచ్చలవిడిగా కరెంటు ఖర్చవుతుంది. సింగిల్ డోర్ ఫ్రిజ్జులు అందునా ఫైవ్ స్టార్ రేటెడ్ అయితే పవర్ సేవింగ్ చాలా ఉంటుందివాషింగ్ మషీన్ ఫ్రంట్ లోడ్ కంటే టాప్లోడ్ యూజ్ చేయడం బెటర్. దానివల్ల యాభై శాతం కరెంటు సేవ్ అవుతుంది. పైగా రిన్స్ ఎక్కువగా తిరగడం వల్ల డ్రయ్యర్ మీద కూడా పెద్దగా ప్రభావం ఉండదు.  

ఇక ఏసీల విషయానికొస్తే.. వీలైనంతవరకు స్ప్లిట్ (split)ఏసీలనే వాడాలి. వాటి వల్ల కరెంటు ఖర్చు తక్కువ. ఫోర్ స్టార్ రేటెడ్ ఏసీలతో  నెలకు 84 యూనిట్ల కరెంటు ఆదా అవుతుంది. అంటే లెక్కన వెయ్యి యూనిట్లు ఏడాదికి సేవ్ అవుతాయన్నమాట. రెగ్యులర్ టీవీలకంటే ఎల్సీడీ మానిటర్ల వల్ల కూడా పవర్ సేవింగ్ చాలా  అవుతుంది.
తరాలనాటి థర్మల్ ప్లాంట్లు.. వాతావరణాన్ని పిండి పిప్పి చేస్తున్నాయి. నీళ్లుంటేనే జల విద్యుత్. విండ్ పవర్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేదు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కరెంటు అన్న మాటకు ఆమడ దూరంలో ఉన్నాం. విద్యుత్ ఉత్పత్తి లో దేశం ఐదో స్థానంలో ఉంది. అయినా తలసరి వినియోగంలోమాత్రం ఎక్కడా లేం. ఇప్పటికీ 30 కోట్ల మందికి కరెంటు అంటే ఎట్లుంటుందో తెలియదంటే నమ్మశక్యం కాదు. అందుబాటులో ఉన్నవారికి కూడా అంతంత మాత్రమే అందులోంది. ఉన్నదాంట్లో కూడా కోతలే. మాత్రం కరెంటు కోసమే ఇంత అల్లాడిపోతుంటే మరి భవిష్యత్ మాటేంటి?