చెన్నై కొడంబాకంలోని సుబ్రమణ్యనగర్ నాలుగో వీధిలో ఉంటుంది
రెహమాన్ ఇల్లు. అప్పట్లో చాలామందికి తెలియదు విశ్వ విఖ్యాత సంగీత దర్శకుడు రెహమాన్
ఉండేది ఈ స్ట్రీట్‌లోనే అని. ఎందుకంటే అంత సాదాసీదాగా ఉంటుందా ఇల్లు. గేట్ తెరిచి
లోపలకి అడుగు పెట్టగానే కుడివైపున ఒక సమాధి లాంటిది కనిపిస్తుంది. దానిమీద ఆకుపచ్చ
జెండా.. మూరెడు మల్లెపూల దండ పరిచి ఉంటుంది. కుడివైపు వసారా. పొద్దున పూట ఆ
ఇంట్లోకి అడుగు పెడితే ఓ నడివయస్సు స్త్రీ కాస్త హడావిడిగా కనిపిస్తుంది. కొంచెం
లావుగా.. పొట్టిగా.. పెద్దగా నగా నట్రా మెడలో లేకుండా.. సింపుల్‌గా కనిపిస్తుంది. ఆవిడే
రెహమాన్ తల్లి. పేరు కరీనా బేగం. రెహమాన్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోతే అన్నీ
తానై పెంచింది. పన్నెండేళ్లకే చదువు వదిలేసి అమ్మను పోషించే బాధ్యత
నెత్తికెత్తుకున్నాడు రెహమాన్. అమ్మంటే అతడికి ప్రాణం. అమ్మే ఆశ, అమ్మే శ్వాస.
అమ్మే సర్వస్వం. రెహమాన్ స్వరాలకు మొదటి విమర్శకురాలు అమ్మ కరీనాబేగమే. జింగిల్స్
చేసినా.. ట్యూన్ కట్టినా తొలిసారిగా వినేది ఆవిడే. మొదట్లో అలా కాదు ఇలా
చేయాల్సిందని సూచనలిచ్చేది. తర్వాత్తర్వాత రెహమాన్ బిజీ అయ్యాడు. కరీనా బేగానికి
కూడా కొడుకు చేసిన ట్యూన్స్ వినే ఓపిక లేకుండా పోయింది. ప్రస్తుతానికి ఆమె ఇప్పుడు
ఫుల్ టైం దైవ సన్నిధిలోనే గడుపుతుంది. రెహమాన్ ఓ ఇంటివాడయ్యేంత వరకు కరీనాబేగమే
కొడుకు ఆలనా పాలనా చూసుకుంది. పెళ్లి తర్వాత ఆ బాధ్యత కోడలికి వదిలేసింది.
రెహమాన్ ఇంట్లో బిర్యానీ బావుంటుంది. శుక్రవారం ఇంటికి
అతిథులు ఎవరు వచ్చినా బిర్యానీ తినేదాకా వాళ్లమ్మగారు వదలరు. బిర్యానీ అంటే
గుర్తొచ్చింది బాయ్స్ తమిళ్ వెర్షన్‌లో సిద్ధార్ధ ఫ్రెండ్ మణికందన్-కమెడియన్
సెంథిల్ మధ్య జరిగే కామెడీ సీన్ ఒకటి భలే ఉంటుంది. ఫలానా రోజు ఫలానా గుళ్లో ప్రసాదం దొరుకుతుంది.. తీసుకురా
అని చెప్తూ, మధ్యలో శుక్రవారం మాత్రం రెహమాన్ ఇంట్లో బిర్యానీ కంపల్సరీ పట్రా! అని
చెప్పే సీన్ ఒకటుంటుంది. అయితే తన ఇంటి ప్రస్తావన కట్ చేయమని రెహమాన్ శంకర్‌ని
చాలా రిక్వెస్ట్ చేశాడట. కానీ శంకర్ ససేమిరా అన్నాడట. దానికి రెహమాన్ హర్టయి శంకర్
సినిమాకు పనిచేయడం మానేశాడు. అయినా బాయ్స్ సినిమా పెద్దగా ఆడకపోవడంతో తగినశాస్తే
జరిగిందని రెహమాన్ తన సన్నిహితులతో సంతోషం వ్యక్తం చేశాడట. బాయ్స్ తర్వాత శంకర్-రహమాన్
కాంబినేషన్‌లో సినిమాయే లేదు. చాలా గ్యాప్ తర్వాత రోబో సినిమాకు ఒప్పుకున్నాడు.
అదికూడా రజనీకాంత్ జోక్యం చేసుకుని మాటలు కలిపిస్తేనే!
రెహమాన్ విషయంలో రాత్రి పదింటికి భళ్లున తెల్లారుతుంది. పగలు
చీకటి పడుతుంది. పని రాక్షసుడు. మిస్టర్ పర్‌ఫెక్ట్. ఇలాంటి ఎన్ని ఉపమానాలు
చెప్పినా సరిపోదు. తనకు కావాల్సిన ఔట్‌పుట్ వచ్చేదాకా రాజీపడడు. అవతల నిర్మాత ఉరిపెట్టుకున్నా,
దర్శకుడు రక్తం కక్కకుని చచ్చినా రెహమాన్ ఇచ్చేటప్పుడే ఇస్తాడు. ఎంత
తొందరపెట్టినా, వచ్చి పీకలమీద కూర్చున్నా, కుత్తుక మీద కత్తిపెట్టినా.. తొందరపడడు.
తాను హండ్రెడ్ పర్సెంట్ శాటిస్ఫై అయిన తర్వాతే టేప్స్ ఇస్తాడు.
రెహమాన్‌ని కలవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో ఓపిక
కావాలి. ఎన్నో రోజులు ఎదురు చూడాలి. ఒక్కోసారి పగలూ రాత్రి స్టూడియో గెస్ట్
రూంలోనే పడిగాపులు కాయాల్సివస్తుంది. ఆశుతోష్ గోవారికర్ లాంటి వాళ్లే పగలూ రాత్రి ఎదురు చూడాల్సి వచ్చింది!! రెహమాన్
అంతే. ఎవరైనా అతిథులొస్తే ఒకపట్టాన వాళ్లను కలవడు. ఇక తనకు నచ్చని వాళ్లు వస్తే అసలే
కనిపించడు. కలవనని చెప్పించకుండానే తప్పించుకు తిరుగుతాడు. అలాంటి వాళ్లు గెస్ట్
రూంలో ఎన్నిరోజులైనా ఉండనీ. రెహమాన్ దర్శనం మాత్రం కాదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే
ఇష్టం లేనివాళ్లు వస్తే తప్పించుకుని బెడ్‌రూంలోకి
వెళ్లిపోవడానికి రహస్య మార్గమొకటి రికార్డింగ్ థియేటర్‌కి అనుసంధానం చేసి ఉంటుంది.
ఆ మార్గం ఎవరికీ తెలియదు. అందులోంచి రెహమాన్ గప్‌చుప్‌గా ఇంట్లోకి వెళ్లిపోతాడు.
మళ్లీ ఎప్పటికి వస్తాడో తెలియదు. అసలు వస్తాడో రాడో కూడా తెలియదు.
రెహమాన్‌కి కోపం చాలా అరుదుగా వస్తుంది. వస్తే ఎవరి మీదా
అరవడు. ఇరిటేట్ కూడా అవడు. కామ్‌గా
థియేటర్ పక్కనే ఉన్న చిన్న గదిలోకి పోతాడు. ఓ పదినిమిషాల తర్వాత వచ్చి కమాన్ గెట్
రెడీ అని మ్యూజీషియన్స్ ని అలర్ట్ చేస్తాడు. అందులోకి వెళ్లి దువా చేస్తాడని రెహమాన్
స్టూడియోలో పనిచేసే బహు కొద్దిమందికి తెలుసు. కోపం వస్తే టెన్ మినిట్స్ తర్వాత
కూల్ అవుతాడు. మళ్లీ ఎప్పటిలాగే పనిలో మునిగిపోతాడు. ట్రాక్స్ క్రియేట్ చేయడంలో రెహమాన్
స్టయిలేవేరు. వన్ టూ త్రీ అని చెప్పి చేయించుకుంటే సౌండ్స్ రావనేది రెహమాన్
అభిప్రాయం. ఒకసారి ఇలాగే జరిగింది. తబలా ట్రాక్ కోసం తనకు తెలిసిన ఆర్టిస్టుకి
రెహమాన్ కబురు పెట్టాడు. ఆయన వచ్చి స్డూడియోలో శ్రుతి చేసుకుంటూ.. తాళ్లు
సవరించుకుంటూ తలపైకెత్తి రెడీ అన్నాడట. వెంటనే రెహమాన్ బయటకొచ్చేయండి
నాక్కావల్సిన సౌండ్ దొరికింది అన్నాడు. వచ్చినతను అవాక్కయ్యాడు. అసలు దరువే
వేయలేదు ఈయన సౌండ్ ఎలా తీసుకున్నాడని. దానికి రెహమాన్ అన్నాడట.. మీరు శ్రుతి
చేసుకుంటున్నప్పుడే నాకు అవసరైమన శబ్దం దొరికింది అని. ఏమీ అర్ధం కాక వచ్చినతను
ఫీజు తీసుకుని తలగోక్కుంటూ వెళ్లాడట. సౌండ్ ని నాచురల్‌గా తీసుకోడానికే ఇష్టపడతాడు
రహమాన్. దానికోసం పర్టిక్యులర్‌గా ప్రిపేర్ చేస్తే అనుకున్నది అనుకున్నట్టు
రాదంటాడు. ఇలాంటి సంఘటనలు రెహమాన్ స్టూడియలో చాలా జరిగాయి.
రెహమాన్ రికార్డింగ్ థియేటర్ కొంచెం ప్రత్యేకంగా
చెప్పుకోవాలి. అల్మరాల నిండా కీ బోర్డులే ఉంటాయి. అందులో కొన్ని రెగ్యులర్‌గా వాడేవి.
ఇంకొన్ని వాడనివి. అందులో కొన్ని తండ్రి శేఖర్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి.
వాటిమీద మాత్రం దుమ్ము పేరుకుని ఉంటుంది. ఎందుకోగానీ రెహమాన్ వాటిని సరిగా పట్టించుకోడు.
ఎందుకలా చేస్తావని ఎవరూ అడిగే సాహసం చేయలేదు. ప్రపంచంలో రెహమాన్‌లా ఎవరూ కీ బోర్డు
ప్లే చేయలేరు. మార్కెట్లోకి ఏ కొత్త కీ బోర్డు ఏది వచ్చినా సరే.. వెరీ నెక్స్‌ట్
డే అది రెహమాన్ స్టూడియోలో ఉండాల్సిందే. అంత పిచ్చి అవంటే. ఎలక్ట్రానిక్ కీ బోర్డు
నుంచి కొత్త కొత్త సౌండ్స్ పుట్టించడం రెహమాన్ తెలిసినంతగా ప్రపంచంలోనే మరెవరికీ తెలియదంటే
అతిశయోక్తి కాదు.
రికార్డింగ్ థియేటర్ మొత్తం మసక మసకగా ధవళవర్ణంలో
మెరుస్తుంటుంది. రెహమాన్ కూచునే కీ బోర్డు దగ్గర వెనకాల గోడమీద పెద్దగా 786 అని
రాసి ఉంటుంది. ఓ మూలన అగరుబత్తి నిత్యం కాలుతునే ఉంటుంది. అది ఆరిపోయేలోపు ఇంకొకటి
ముట్టిస్తాడు. థియేటర్‌లోకి అడుగుపెట్టగానే ఏదో ఆధ్యాత్మిక పరిమళం చుట్టుముడుతుంది.
తెలియని ప్రశాంతత దేహమంతా పరుచుకుంటుంది. అక్కడికి వెళ్లిన ప్రతీసారీ దివ్య
అనుభూతికి లోనవుతానని ఎస్పీ బాలసుబ్రమణ్యం అంటుంటారు.
రెహమాన్ దిలీప్‌గా ఉన్నప్పుడు దేవుడంటే నమ్మకం లేకపోయేది.
తండ్రి చనిపోయిన తర్వాత ఏదో మూల ఉన్న భక్తి మొత్తం పోయింది. పూర్తి నాస్తికుడిలా
తయారయ్యాడు. తర్వాత కొన్నాళ్లకి తన భావన తప్పు అని తెలుసుకున్నాడు. ఈ ప్రపంచంలో
మనిషిని నడిపించేది దైవశక్తే అని నమ్మాడు. ఇస్లాం స్వీకరించిన తర్వాత పూర్తిగా
దైవచింతనలోకి మారిపోయాడు. అందుకే ట్యూన్ కట్టినా.. ట్రాక్ క్రియేట్ చేసినా..
జింగిల్స్ చేసినా..ముందుగా దువా చేయందే ఏదీ మొదలుపెట్టడు. టేప్ మీద కూడా 786 అనే
స్టిక్కర్ వేయందే అవుట్ పుట్ టేప్ రిలీజ్ చేయడు.
(నేను విన్నవి, చదివినవి, సేకరించిన విషయాలు మాత్రమే మీతో
పంచుకున్నాను.
ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలు మరో టపాలో రాస్తాను...)
ధవళవర్ణం అంటే ఎ కలర్
ReplyDeletetelupu..
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteరహమాన్ గారి గురించి ఎన్నో తెలియని విషయాలు తెలిజేశారు. ధన్యవాదాలు సార్..!
ReplyDelete