Monday 31 December 2012

2012 మరణ వాంగ్మూలం !!!!!


కాలగర్భంలో మరో ఏడాది గతించిపోయింది!
రోదనల.. వేదనల.. కొన్నెత్తుటి
మరణ వాంగ్మూలాలెన్నో రాసి
మొఖాన విసిరేసి పోయింది
త్యాగాల పునాదుల మీద
అస్థిత్వం, ఆత్మగౌరవం
ఊడలు దిగిన మర్రి చెట్టయింది
నుడికారం బుల్లెట్లా దిగింది
భాష కొత్త జవసత్వాలు సంతరించుకుంది
ఇప్పుడిక దిగ్భ్రాంతికి చోటు లేదు
కత్తి మొనమీద నెత్తురు చుక్కవోలె 
ధగధగ మెరవాలె!
కొనగోట మీసం మెలేయాలె!!
ఇదే ఏడాది తీర్మానం
అంతమాత్రం చేత గతం గతః కాదు
గతమే అన్నిటికీ మూలం!
గతకాలపు దృశ్యాలన్నీ కన్రెప్ప మీద చేసిన
తడి సంతకాలన్నీ ఇంకా పచ్చిగనే ఉన్నయి
ఏడాది వినిపించినవన్నీ జమిడిక నాదాలే
అల్లుకున్న తెలంగాణ అంటుకున్నది
కొలిమై మండుతున్నది
దగాపడ్డ గుండె గొంతుక సింహగర్జనై
అడవి నిండుగా ప్రతిధ్వనించింది
మట్టి పెళ్లగించుకుని వచ్చిన ప్రతి మొలకా
పాటై చిగురించింది..
పువ్వై పరిమళించింది..
పల్లె తల్లి పెడుతున్న కన్నీరు చూస్తుంటే
కనిపించని కుట్రలన్నీ అవగతమవుతున్నయి
సంస్కృతిని మూలం చేసుకున్న అస్థిత్వ ఉద్యమం
ఇప్పుడు ఆరుగాలం చెమట చుక్కయింది
మోటకొట్టిన రాత్రి మోగిన పాట..
కల్లమూడ్చిన అవ్వ కలలో గింజ..
సిద్ధారెడ్డన్నా దండమే!
నీ పాటిప్పుడు మదిమదిలో
డమరుక నాదమైంది
గోరటి పలుకులు..
ధూమ్ధామ్దునుకులు..
సెవెన్సీటర్ఆటో డెక్కు మోగినా
ఘల్ఘల్గజ్జెల్ల గాజుల మోతలు..
తెలంగాణ...
ఓటమి తెలవని వీరులవనం
అందులో ఉద్యమం ఒక సుదీర్ఘ  పయనం
ఆత్మగౌరవం కోసం ఎడతెగని ఆరాటం
ఆటుపోట్లు అలజడులు ఎదురుదెబ్బలు
విస్మరణలు, ప్రకటనలు, పక్కదార్లు...
మొత్తంగా ఈ నేల ఓ పడిలేచే కెరటం
గాయపడ్డ బెబ్బులి..
కొత్త సంవత్సరం వేళ
నాలుగుకోట్ల గుండెగొంతుకలు
కోటి ఆశలతో ఎదురుచూసే సమయం..
ఊరూరు ఉద్యమంలో భాగమైన వసంతం..
చిగురించిన ఆశలు చిక్కపడ్డ తరుణం..
పొద్దు పొడిసిందంటే నాలుగుబాటలు
నినాదాల ఊటలుగా మారినా..
ఒకరెనుక ఒకరు దండుకట్టి
డప్పుల సప్పుల తోటి కదంతొక్కినా...
బతుకమ్మలాడినా...బోనాలనెత్తినా...
పీరీలనెత్తి నడిబజాట్ల ఆటపాటపెట్టినా...
అదంతా గడిచిన వసంతం తోడుగా సాగిన స్నేహమే..
ఇదే జీవితం నేర్పిన పాఠం..
బతుకంటే ఆశే..
బతుకంటే రేపటిపై నమ్మకం..
ఇదే మనిషిని నడిపించే అంతస్సూత్రం
కాలం కత్తుల వంతెన కట్టినా...
పాలకుడు మెత్తని ద్రోహం చేసినా...
మడమ తిప్పని మట్టిబిడ్డలం..
ఎదరు నిలబడబోయే గుజ్జర్లం..
పడిపోయినా లేచి నిలబడే పోరాట శిఖరాలం..
గమ్యం చేరే దాకా..
వెనుతిరుగని వీరులమై కొట్లాడుదాం.
ఆత్మగౌరవ పతాకను దశదిశలా ఎగరేద్దాం..
ఇప్పుడిక దిగ్భ్రాంతికి చోటు లేదు
కత్తి మొనమీద నెత్తురు చుక్కవోలె ధగధగ మెరవాలె
కొనగోట మీసం మెలేయాలె
ఇదే ఏడాది తీర్మానం.......

No comments:

Post a Comment