ఒళ్లు
ఉడుకైతే జీరా చాయ్. మరీ సలవైతే గరం చాయ్ ! ముసుగేస్తే ములక్కాడ చాయ్. మనసు
బాలేకపోతే మసాలా చాయ్. హెడ్డేక్ ఉంటే అల్లం చాయ్. బోర్ కొడితే చాకొలేట్ చాయ్.
ఇలా చాయ్ గురించి చెప్పాలంటే పెద్ద రామకోటే అవుతుంది. ఏదో కొత్త విషయం
చెప్పినట్లు టీ గురించి ఇంత బిల్డప్ ఎందుకు అని కదా మీ సందేహం. ఎందుకంటే.. టీ కి
ఇప్పుడు జాతీయ పానీయం హోదా లభించబోతోంది.
పొద్దున
లేవగానే నాలుకకు ఇంత వేడి వేడి టీ తాకందే ఏమీ తోచదు. అలవాటనుకోండి..
వ్యసనమనుకోండి. తేనీరు తాంగదే ఏ నీరూ నోట్లోకి పోదు. ఇంతకూ టీ మంచిదా? చెడ్డదా?
అనే విషయంపై జరిగినన్ని పరిశోధనలు బహుశా ఏ అంశంపై కూడా జరగకపోయి ఉండొచ్చు. వాటి
పోస్టుమార్టం రిపోర్టు ఎలా అయినా ఉండనీ.. ఛాయ్ అంటే మస్తుగా తాగేవాళ్లున్నారు. ఎప్పుడు
ఎవరు ఎంత పోసినా తాగేవాళ్లకు కొదవేలేదు. ఒకప్పుడు పొద్దున ఒక కప్పు.. సాయంత్రం ఇంకో
కప్పుతో సరిపెట్టుకునేవాళ్లు. ఇప్పుడు ఐదు నుంచి పది చాయల వరకు తాగుతున్నారు.
కొందరికైనా అరగంటకో చాయ కడుపులో పడంది ఏమీ తోచదు. కొత్తగా ఎవరన్నా పరిచయమైనా
ముందుగా షేర్ చేసుకునేది టీ. ఫ్రెండ్ కలిసినా మాటల మధ్య టీ చప్పరించాల్సిందే. ఇంటికో,
ఆఫీసుకో గెస్ట్ వస్తే తేనీరు తప్పని సరి. ఇక సిగరెట్ తాగే వారికి టీ గొప్ప
కాంబినేషన్. సమోసాలో కూడా ఇంకా సూపర్‌గా ఉంటుంది. మీరు గమనించారో లేదో మిరపకాయ బజ్జీతో కూడా టీ కాంబో అదుర్స్. ఆఖరికి తిన్నతిండి అరగాలంటే కూడా టీ
మంచి ఔషధం! చివరికి తినడానికి
తిండిలేకపోయినా కప్పు చాయ తాగి కడుపు నింపుకునేవాళ్లు మస్తుమంది. పని వత్తిడి
నుంచి రిలీఫ్ కావాలంటే చాయ్ కంపల్సరీ. ఏ పని లేకుండా బోర్ కొడితే టీ. నలుగురు
ఫ్రెండ్స్ కలిస్తే టీ. ఒక్కరే ఉంటే తోడుండేది టీ.
ఇన్ని
కారణాలున్నాయి కాబట్టే ఈ పదేళ్లలో టీ వాడకం బాగా పెరిగింది. తాజా సర్వేల ప్రకారం
భారతదేశంలో ప్రతీ మనిషి రోజుకో కనీసం వంద మిల్లీ లీటర్లు టీ తాగుతున్నాడు. అంటే
దేశ వ్యాప్తంగా రోజుకు పన్నెండున్నర కోట్ల లీటర్ల టీ తాగేస్తున్నాం. ఒక్కో టీ
తయారీకి రెండు గ్రాముల చాయ్‌పత్త పడుతుంది. అంటే రోజుకు మనదేశంలో 25 లక్షల కిలోల
టీ పొడి వాడుతున్నాం. అందుకే భారత ప్రభుత్వం టీని జాతీయ పానీయంగా గుర్తించింది.
వచ్చే ఏడాది నుంచి మన జాతీయ పానీయం టీ. అస్సాంలో మొట్ట మొదటి తేయాకు మొక్క నాటిన
మనిరామ్ దివాన్ 212వ జయంతిని పురస్కరించుకుని వచ్చే ఏడాది ఏప్రిల్ 17న టీని జాతీయ
పానీయంగా ప్రకటించనున్నారు. ఈ హోదా రాకున్నా ఎప్పటి నుంచే టీకి మనదేశంలో
ప్రాధాన్యత ఉంది. పౌరాణిక గాధల్లో, చరిత్ర పుటల్లో, స్వాతంత్ర్య పోరాటాల్లో కూడా
టీకి ప్రముఖ స్థానమే ఉంది. మనం తాగే గుక్కెడు టీ వెనక వందల ఏళ్ల చరిత్ర ఉంది. చైనాలో జరిగిన చిన్న సంఘటన తేయాకు గతినే
మార్చేసింది. చాలా ఏళ్ల కిందట వేడి నీళ్లు తాగే అలవాటున్న చైనా రాజు షాన్ నాంగ్
తోటలో నీళ్లు వెచ్చపెట్టుకుంటుంటే తేయాకులు వచ్చి అందులో పడ్డాయట. అవి
చూసుకోకుండానే రాజు నీళ్లు తాగేశాడు. రుచి బాగా అనిపించి ఆరా తీస్తే అది తేయాకు అని
తెలిసింది. దీంతో ఆ రాజు ప్రతీ రోజు మరిగించిన నీళ్లలో తేయాకు వేసుకుని తాగడం అలవాటు చేసుకున్నాడు. అలా దేశానికి మొత్తం వ్యాపించింది. అప్పట్లో చైనాలో తేయాకు చాలా
అరుదుగా దొరికేది. అందుకే అక్కడ చాలా పెద్ద కుటుంబాల్లో ఫంక్షన్స్ జరిగితే తేయాకు
పొట్లాలను గిఫ్టులుగా ఇచ్చేవారు. చాలాకాలం చైనాలో తేయాకులను కరెన్సీకి
ప్రత్యామ్నాయంగా వాడారు. 17వ శతాబ్దంలో
చైనాతో వాణిజ్య సంబంధాలున్న డచ్, పోర్చుగీస్ దేశాలకు టీ పాకింది. ఆ దేశాల నావికులు
తరచూ చైనా రావడంతో వారికి మొదట అలవాటైంది. వారిద్వారానే బ్రిటన్, హాలాండ్ లకు టీ
అలవాటైంది. మొత్తంగా చైనా నుంచి యూరప్ కు పాకింది. బ్రిటన్ సామ్రాజ్యం కింద ఉన్న దేశాల్లోకి కూడా
టీ అదే విధంగా దూరిపోయింది. చివరికి ఆ సామ్రాజ్యం అంతం కావడానికి కూడా టీ
కారణమైంది. అమెరికా కూడా బ్రిటిష్ పాలన కింద ఉన్న సమయంలో టీ తాగే అమెరికన్లపై
పన్ను వేశారు. దీన్ని నిరసిస్తూ అమెరికన్లు బోస్టన్ నగరంలో బోస్టన్ టీ పార్టీ
పేరుతో సంఘం కట్టి బ్రిటన్ నుంచి వచ్చే నావలను ఆపి, టీ పొడిని సముద్రంలో పారబోశారు. అదే
అమెరికా విప్లవానికి నాంది అయింది. చివరికి బ్రిటన్ సామ్రాజ్యం అంతమయింది.
తేయాకు
మనదేశంలోనూ పండుతున్నా దాన్ని టీ చేసుకోవడానికి వాడతారనే విషయం బ్రిటిష్ వారివల్లే తెలిసింది. 1826లో యాండబూ ఒప్పందం ద్వారా అస్సాం రాజులు తమ ప్రాంతాన్ని
ఈస్టిండియా కంపెనీకి అప్పగించారు. అస్సాం ప్రాంతం తేయాకు తోటలకు అనువైన ప్రాంతం
కావడంతో బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ పెద్ద ఎత్తున టీ గార్డెన్స్ ఏర్పాటుకు
సిద్దపడింది. 1837లో అస్సాం ఎగువ ప్రాంతమైన చబౌలో ఇంగ్లీస్ టీ గార్డెన్ పేరుతో
మొదటి తేయాకు తోట వెలిసింది. 1840లో అస్సాం టీ కంపెనీ స్థాపన జరిగింది. అప్పటి
నుంచి టీ వాణిజ్య పంట అయింది. అది భారతదేశంలోని ఇతర ప్రాంతాలకూ పాకింది. ఇప్పుడు
టీ తాగని ఊరులేని దేశంగా మారింది. అస్సాం, డార్జిలింగ్ ప్రాంతాల్లో తేయాకు ఎక్కువ
పండినా దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంది. అందుకే తేయాకు తయారు చేసే ఉద్యోగుల సంఖ్య పది
లక్షలకు చేరింది. ప్రతీ ఏటా మనదేశంలో ఏడు లక్షల పదిహేను వేల టన్నుల టీ పొడి
ఉత్పత్తి అవుతోంది. 70 శాతం మనదేశంలోనే వినియోగమవుతున్నా 30 శాతం ఎక్స్ పోర్టు
చేసే స్థాయికి చేరాం.
నిన్న మొన్నటి దాకా టీ పొడి ఉత్పత్తిలో మనదేశమే టాప్. ఇటీవలే ఆ స్థానాన్ని చైనా ఆక్రమించింది. భారత్, చైనాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాల్లో తేయాకు ఎక్కువగా పండించి ఎగుమతి చేయడంతో అమెరికా కన్ను కుట్టింది. తేయాకు మార్కెట్లో అమెరికాకు పెద్దగా వాటా లేకపోవడంతో బయటి దేశాల నుంచి వచ్చే టీ పొడికి ఎక్కువ పన్నులు వేసి వేధించడం మొదలు పెట్టింది. అందుకే భారత్ మరికొన్ని దేశాలను కలుపుకుని అమెరికాపై డబ్ల్యుటిఓ లో వాణిజ్య యుద్దం మొదలుపెట్టింది. చివరికి అమెరికాదే తప్పు అనిపించింది. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలను, వాణిజ్యాన్ని ఆయిల్ ప్రభావితం చేస్తున్నా, దాని స్థానంలో ఎక్కువ వినిమయం ఉన్న తేయాకు చేరుకుంటుంది.
జనం
విపరీతంగా టీ తాగడంతో దేశానికి ఆదాయం తెచ్చే వనరుగా కూడా తేయాకు తయారైంది. అందుకే
ప్రభుత్వం కూడా తేయాకు పరిశ్రమ కోసం ప్రత్యేకంగా టీ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు
చేసింది. తేయాకు పంటకు, టీ పొడి తయారీకి, ఎగుమతులకు అనేక రకాల
ప్రోత్సహకాలిస్తోంది. పాకిస్తాన్, వియత్నాం, ఈజిప్టు, ఇరాన్ లాంటి దేశాలు పూర్తిగా
మన తేయాకు మీదే ఆధారపడతాయి. వాణిజ్య పరంగానే కాకుండా టీ అనేద దేశ సంప్రదాయాలు,
సంస్కృతిలో భాగమయ్యాయి.
రోజూ
టీ తాగుతూనే ఉన్నా అప్పుడప్పుడు ఈ అభిరుచిలోని రుచిని కూడా మార్చుకుంటున్నారు జనం.
గతంలో ఎక్కువగా డస్ట్ టీ తాగే వారు. కానీ డస్ట్ టీ కన్నా బ్లాక్ టీ, గ్రీన్ టీ ల
వల్ల ఎక్కువ ఉపయోగాలున్నాయని డాక్టర్లు చెప్పడంతీ ఇటీవల వీటి వాడకం కూడా
ఎక్కువయింది. ఎక్కువ సార్లు టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అని డాక్టర్లు కూడా చెబుతారు. అయితే వాస్తవంగా
టీ పొడి జీరో కొలెస్ట్రాల్. టీలో వాడే పాలు, చక్కెర వల్లే ఎక్కువ కొలెస్ట్రాల్
వస్తోంది. కాబట్టి గ్రీన్ టీ, బ్లాక్ టీ ల వల్ల కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు నరాలు
ఉత్తేజం కావడం, ఇన్ స్టంట్ రిలీఫ్ దొరకడం లాంటి కారణాలు కూడా రుచిని మార్చుకోవడానికి
కారణమవుతున్నాయి.
ప్రపంచంలో
ప్రస్తుతం 40 దేశాల్లో టీ పొడి తయారవుతోంది. ప్రతీ ఏటా 25 లక్షల టన్నుల టీ పొడి
ఉత్పత్తి అవుతోంది. మూడు బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతోంది. దేశాల మధ్య
సంబంధాలను పెంచే ద్రావకంగానే కాదు, మనిషిని మళ్లీ ప్రకృతివైపు నడిపించే మార్గంగా
కూడా టీ ఉపయోగపడుతోంది. ఆసియా దేశాల నుంచి పశ్చిమ దేశాలకు విద్య, ఉపాధి, ఉద్యోగాల
కోసం వెళ్లే వారు తొందరగా అక్కడ ఇమిడేందుకు టీ దోహదం చేస్తోందని సర్వేలు
చెబుతున్నాయి. కల్తీ లేని, రంగులేని, ఫ్లేవర్స్ కాని, ఎక్కువ ఖరీదు కూడా చేయ టీకి
మంచి పేరుంది. బాడీలోని లిక్విడ్స్ ను బ్యాలెన్స్ చేయడానికి కూడా టీ
ఉపయోగపడుతుంది. రంగు, రుచి, వాసన మాత్రమే కాదు. టీకి చారిత్రక ప్రాధాన్యం,
ప్రాపంచిక గుర్తింపు, సర్వజనీన లక్షణం ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల్లో అందరూ
ఫాలో అయ్యే ఏకైక కల్చర్ టీ మాత్రమే. ఐదువేల ఏళ్లకు పూర్వం జౌషధ మొక్కలా మనదేశానికి
ఉపయోగపడిన తేయాకు ఇప్పుడు ద్రావకం రూపంలోనూ ఆరోగ్యాన్ని కాపాడుతోంది. అలాంటి టీ ఇప్పుడు
మన జాతీయ పానీయం అవుతున్నందుకు గర్వపడదాం...
అసక్తికరమైన వివరాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
ReplyDeleteఎప్పుడన్నా కొంచెం సమయం చూసుకుని కాఫీ మీదా కూడ ఇలాంటి పోస్ట్ రాయండి.
తప్పకుండా అండీ...
ReplyDeleteచాలా విషయాలు చెప్పారండి. అయినా ఇంట్రెస్టింగ్గా ఉంది.
ReplyDeleteథాంక్యూ
Delete