Monday 31 December 2012

వరంగల్ పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?



వరంగల్ పేరును ఓరుగల్లుగా ఎందుకు మార్చాలి? ఇప్పటికిప్పుడు అంత అవసరమేంటి? వరంగల్ అని అంటే వచ్చిన నొప్పేంటి? వరంగల్ పేరు పలకడానికి భయమా? వరంగల్ పేరు మార్చాలని అడిగిందెవరు? ఎవరూ అడక్కుండానే వరంగల్ పేరు ఓరుగల్లుగా మార్చడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధపడుతోంది? ఇప్పటికే హన్మకొండను నాశనం చేశారు. ఇప్పుడు వరంగల్‌కి స్పాట్ పెట్టారా?

వరంగల్. ఆ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. ఆ పేరులో పౌరుషం తొంగిచూస్తుంది. పలుకులోనే రాజసం ఉట్టిపడుతుంది. ఆ గడ్డమీద అడుగుపెడితే చాలు ఎక్కడ లేని రోషం వస్తుంది. వరంగల్ పేరు ఉచ్ఛరిస్తే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. వరంగల్ ఒక హిస్టారికల్ నేమ్. కాదుకాదు.. ఇట్స్ ఏ బ్రాండ్.  

వరంగల్‌ని గ్రేటర్ గా మార్చాలని జనం ఎప్పటినుంచో కోరుతున్నా రాజకీయ కారణాల వల్ల జాప్యం జరిగింది. ఎట్టకేలకు కాకతీయ ఉత్సవాల పుణ్యమాని గ్రేటర్ ప్రకటన చేశారు. అయితే సీఎం అలా ప్రకటించాడో లేదో ఇలా వరంగల్ పేరును ఓరుగల్లుగా మారుస్తామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య భారీ భారీ డైలాగులు చెప్పాడు. కాకతీయులు రాజ్యం ఏలినప్పుడు వరంగల్ పేరు ఓరుగల్లుగా ఉండేది కాబట్టి ఇప్పుడూ అదే పేరు పెడతారట. ఆ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా మంత్రులంతా చేయాల్సిందంతా చేస్తారట. మద్రాస్ పేరు చెన్నయ్ గా, బొంబాయి పేరు ముంబయిగా మారింది కాబట్టి వరంగల్ పేరును ఓరుగల్లుగా మారుస్తామనేది ఘనత వహించిన పొన్నాల గారి దిక్కుమాలిన లాజిక్!  అయితే ఇక్కడ అర్ధం కాని విషయం ఏంటంటే.. వరంగల్ పేరు మార్చమని ఎవరూ డిమాండ్‌ చేయలేదు. అందుకోసం సంతకాల సేకరణా జరగలేదు. అసలు ఆ ఉద్దేశమే ఎవరికీ లేదు. ఎవరూ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లనూలేదు. మరి ఉన్నట్టుండి మంత్రులకు వరంగల్ పేరు మార్చాలన్న ఐడియా ఎందుకొచ్చిందో తెలియదు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయలంటే ఇవే.  

వరంగల్ పేరు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. ఇప్పుడు పేరు మార్చాల్సిన అవసరమేంటి? వాస్తవానికి వరంగల్ కు ఓరుగల్లుకు పెద్ద తేడా కూడా ఏమీ లేదు. దేశంలోని వేరే నగరాల  పేరు మార్పుకు వరంగల్ కు ముడిపెట్టడం కూడా హేతుబద్దంగా లేదు. తమిళనాడు చెన్నయ్ అయింది కాబట్టి , బొంబాయి ముంబయ్ అయింది కాబట్టి, కలకత్తా కోల్ కతాగా మారింది కావున వరంగల్‌ని ఓరుగల్లు చేస్తామంటున్నారు. ఇంతకంటే దరిద్రపుగొట్టు వాదన మరోటి లేదు. అలా చేస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నటే ఉంటుంది.  కడపకు వైఎస్‌ పేరు, నెల్లూరుకు పొట్టి శ్రీరాములు పేరు, హైదరాబాద్‌లో ఓ ప్రాంతానికి రంగారెడ్డి పేరు పెట్టాం కాబట్టే వరంగల్ కు ఓరుగల్లు పెడతామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట పనికిమాలింది. దేశంలోని వేర్వేరు నగరాల పేరు మార్పు, మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల పేర్ల విషయంతో వరంగల్ కు ముడిపెట్టడం అంతకంటే భావ దారిద్ర్యం మరోటి లేదు. పేరు మార్పు వల్ల ఒరిగేదేమీ ఉండదు. పేరు మార్చినంత మాత్రాన దశాదిశ ఏమైనా మారుతుందా ?

వాస్తవానికి వరంగల్ పేరు వెనక చాలా చరిత్రే ఉంది. ప్రస్తతం వరంగల్ కోట ఉన్న ప్రాంతంలో పెద్ద శిల ఉండేది. దాన్ని అంతా ఏకశిల అని పిలిచే వారు. అందుకే ఆ నగరానికి ఏకశిల అనే పేరు వచ్చింది. వరంగల్ కోటలో శిల్పాలు, కాకతీయ కీర్తి తోరణం చెక్కడానికి వచ్చిన వారంతా తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారు. వారు తమ భాషలో ఏకశిలా నరగాన్ని ఓరుగల్లు అని పిలిచేవారు. ఓరు అంటే ఒకటి, గల్లు అంటే శిల. అందుకే ఏకశిలను వారు ఓరుగల్లు అని పిలిచారు. అదే పేరును వారు శాసనాల్లో కూడా రాశారు.   అయితే చాలా శాసనాల్లో ఓరుగల్లుకు ముందు ఈ నగరాన్ని ఏకశిలా నగరమని, హనుమకొండ అని పిలిచేవారు. కాకతీయులు హనుమకొండ రాజధానిగా పాలించినప్పుడు నగరం పేరు హనుమకొండ. తర్వాత వరంగల్ కు రాజధానిగా మార్చినప్పుడు దాని పేరు ఏకశిలా నగరం. అంటే చరిత్రలో ఓరుగల్లుకు ఎంత పేరుందో హనుమకొండ, ఏకశిలా నగరాలకు కూడా అంతే పేరుంది. కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడి కాలం వరకు ఓరుగల్లుగా స్థిరపడింది. తర్వాత వచ్చిన ఢిల్లీ సుల్తానులు, హైదరాబాద్ నవాబులు ఓరుగల్లును ఓర్గల్  అని పిలిచారు. తర్వాత కాలంలో ఓర్గాల్ అన్నారు. రానురాను వారాంగల్ అయింది. చివరికి వరంగల్ గా స్థిరపడింది. వాడుకలో ఓరుగల్లు కన్నా వరంగల్ అని పలకడం తేలిక కావడం వల్లే పేరు మారింది తప్ప ఎవరో ఉద్దేశపూర్వకంగా మార్చింది కాదు. కాబట్టి వరంగల్ పేరు మార్చాల్సిన అవసరం లేదన్నది చరిత్రకారుల అభిప్రాయం.  

2012 మరణ వాంగ్మూలం !!!!!


కాలగర్భంలో మరో ఏడాది గతించిపోయింది!
రోదనల.. వేదనల.. కొన్నెత్తుటి
మరణ వాంగ్మూలాలెన్నో రాసి
మొఖాన విసిరేసి పోయింది
త్యాగాల పునాదుల మీద
అస్థిత్వం, ఆత్మగౌరవం
ఊడలు దిగిన మర్రి చెట్టయింది
నుడికారం బుల్లెట్లా దిగింది
భాష కొత్త జవసత్వాలు సంతరించుకుంది
ఇప్పుడిక దిగ్భ్రాంతికి చోటు లేదు
కత్తి మొనమీద నెత్తురు చుక్కవోలె 
ధగధగ మెరవాలె!
కొనగోట మీసం మెలేయాలె!!
ఇదే ఏడాది తీర్మానం
అంతమాత్రం చేత గతం గతః కాదు
గతమే అన్నిటికీ మూలం!
గతకాలపు దృశ్యాలన్నీ కన్రెప్ప మీద చేసిన
తడి సంతకాలన్నీ ఇంకా పచ్చిగనే ఉన్నయి
ఏడాది వినిపించినవన్నీ జమిడిక నాదాలే
అల్లుకున్న తెలంగాణ అంటుకున్నది
కొలిమై మండుతున్నది
దగాపడ్డ గుండె గొంతుక సింహగర్జనై
అడవి నిండుగా ప్రతిధ్వనించింది
మట్టి పెళ్లగించుకుని వచ్చిన ప్రతి మొలకా
పాటై చిగురించింది..
పువ్వై పరిమళించింది..
పల్లె తల్లి పెడుతున్న కన్నీరు చూస్తుంటే
కనిపించని కుట్రలన్నీ అవగతమవుతున్నయి
సంస్కృతిని మూలం చేసుకున్న అస్థిత్వ ఉద్యమం
ఇప్పుడు ఆరుగాలం చెమట చుక్కయింది
మోటకొట్టిన రాత్రి మోగిన పాట..
కల్లమూడ్చిన అవ్వ కలలో గింజ..
సిద్ధారెడ్డన్నా దండమే!
నీ పాటిప్పుడు మదిమదిలో
డమరుక నాదమైంది
గోరటి పలుకులు..
ధూమ్ధామ్దునుకులు..
సెవెన్సీటర్ఆటో డెక్కు మోగినా
ఘల్ఘల్గజ్జెల్ల గాజుల మోతలు..
తెలంగాణ...
ఓటమి తెలవని వీరులవనం
అందులో ఉద్యమం ఒక సుదీర్ఘ  పయనం
ఆత్మగౌరవం కోసం ఎడతెగని ఆరాటం
ఆటుపోట్లు అలజడులు ఎదురుదెబ్బలు
విస్మరణలు, ప్రకటనలు, పక్కదార్లు...
మొత్తంగా ఈ నేల ఓ పడిలేచే కెరటం
గాయపడ్డ బెబ్బులి..
కొత్త సంవత్సరం వేళ
నాలుగుకోట్ల గుండెగొంతుకలు
కోటి ఆశలతో ఎదురుచూసే సమయం..
ఊరూరు ఉద్యమంలో భాగమైన వసంతం..
చిగురించిన ఆశలు చిక్కపడ్డ తరుణం..
పొద్దు పొడిసిందంటే నాలుగుబాటలు
నినాదాల ఊటలుగా మారినా..
ఒకరెనుక ఒకరు దండుకట్టి
డప్పుల సప్పుల తోటి కదంతొక్కినా...
బతుకమ్మలాడినా...బోనాలనెత్తినా...
పీరీలనెత్తి నడిబజాట్ల ఆటపాటపెట్టినా...
అదంతా గడిచిన వసంతం తోడుగా సాగిన స్నేహమే..
ఇదే జీవితం నేర్పిన పాఠం..
బతుకంటే ఆశే..
బతుకంటే రేపటిపై నమ్మకం..
ఇదే మనిషిని నడిపించే అంతస్సూత్రం
కాలం కత్తుల వంతెన కట్టినా...
పాలకుడు మెత్తని ద్రోహం చేసినా...
మడమ తిప్పని మట్టిబిడ్డలం..
ఎదరు నిలబడబోయే గుజ్జర్లం..
పడిపోయినా లేచి నిలబడే పోరాట శిఖరాలం..
గమ్యం చేరే దాకా..
వెనుతిరుగని వీరులమై కొట్లాడుదాం.
ఆత్మగౌరవ పతాకను దశదిశలా ఎగరేద్దాం..
ఇప్పుడిక దిగ్భ్రాంతికి చోటు లేదు
కత్తి మొనమీద నెత్తురు చుక్కవోలె ధగధగ మెరవాలె
కొనగోట మీసం మెలేయాలె
ఇదే ఏడాది తీర్మానం.......

Saturday 29 December 2012

నాగార్జున సాగర్‌ నిర్మాణం వెనుక కుట్ర.......



అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది తెలంగాణ ప్రజల పరిస్థితి.  హైదరాబాద్ ప్రజల గొంతెండబెడుతూ నాగార్జున సాగర్‌ నీళ్లను కృష్ణా డెల్టాకు కోస్తా చేపల చెరువులకు అక్రమంగా తలరిస్తున్నారు. మరోపక్క  శ్రీశైలం నీళ్లను పోతిరెడ్డిపాడు ద్వారా సోమశిల, కండలేరుకు మలుపుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద జలాశయాల్లో ఒక్కటైన నాగార్జున సాగర్‌ తెలంగాణలోనే నిర్మించినా నీళ్ళు మాత్రం దక్కడం లేదు.
కరువు కాటకాలతో ఖమ్మ, నల్లగొండ జిల్లాలు తల్లడిల్లుతున్నా.. ఈ ఆంధ్రా పాలకులకు ఏనాడూ పట్టదు. ఫ్లోరైడ్‌ నీళ్ళు తాగుతూ పసితనంలోనే ముసలివాళ్ళవుతున్నా నల్లగొండ బిడ్డలకు దోశెడు నీళ్లివ్వడానికి ఆంధ్రా పాలకులకు మనసురాదు. భవిష్యత్తులో నల్గొండ, మహబూబ్‌ నగర్ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయని ఇండియన్‌ ఇరిగేషన్‌ కమిషన్‌ 1903లోనే హెచ్చరించింది. దాన్ని సీరియస్‌గా తీసుకున్న నిజాం ప్రభుత్వం డ్యాం నిర్మించాలని అదే ఏడు నిర్ణయించింది. నల్లగొండ జిల్లా దేవరకొండ తాలూకాలోని ఏళేశ్వరం దగ్గర కృష్ణానదిపై ప్రాజెక్టు నిర్మించి ఖమ్మం జిల్లాలోని కట్టలేరు దాకా కాల్వను నిర్మిస్తే.. సుమారు 10- లక్షల ఎకారాలు సాగులోకి తేవచ్చునేది ప్రణాళిక. దీనిపై ఇంజినీర్‌ నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్ సమగ్ర సర్వే జరిపి ప్రణాళిక రూపొందించారు. అయితే రెండు ప్రాంతాలకూ ఉపయోగపడే విధంగా జాయింట్‌ ప్రాజెక్టును నిర్మించుకుందామని మద్రాసు ప్రభుత్వం నిజాంను కోరడంతో ఏళేశ్వరం ప్రతిపాదన మూలన పడింది. నిజాం సర్కార్‌ గద్దెదిగిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం తెలంగాణ కు మాత్రమే ఉపయోగపడే విధంగా ప్రాజెక్టు నిర్మాణానికై ప్రయత్నాలు మొదలు పెట్టింది. అప్పటికే మద్రాసు నుండి విడిపోయి కొత్తగా ఆంధ్రారాష్ట్రం ఏర్పడింది. అప్పటి ఆంధ్రా ఇంజనీర్‌ కెఎల్ రావు తన పలుకుబడినంతా ఉపయోగించి ఈ ప్రాజెక్టు స్థలాన్ని ఏళేశ్వరానికి దిగువనున్న నందికొండకు మార్పించాడు. అంతేగాక రెండు ప్రభుత్వాలతో జాయింట్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం కూడా కుదిర్చాడు. మొత్తమ్మీద రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నందికొండ కంట్రోల్ బోర్డు ఏర్పడింది. 1955 డిసెంబర్‌ 10న ఆనాటి ప్రధాని నెహ్రూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నందికొండ పేరును నాగార్జున సాగర్ గా మార్చివేశారు. 1956 నవంబర్ ఒకటిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటు తో జాయింట్ కంట్రోల్‌ బోర్డు రద్దయింది. నీలం సంజీవరెడ్డి ప్రభుత్వ కె.ఎల్‌.రావు జోక్యంతో ఆంధ్రకు అనుకూలంగా తెలంగాణకు నష్టం చేకూర్చే విధంగా కాల్వల డిజైన్లను, ప్రాజెక్టు డిజైన్ ను మార్చివేసింది. ఫలితంగా ఆంధ్రకు లాభం జరిగింది కానీ.. తెలంగాణకు చుక్క నీరందలేదు.
తెలంగాణకు సాగర్ నీళ్ళు దక్కకుండా ఆంధ్రాకు మళ్ళించినందుకు బహుమతిగా కె.ఎల్‌ రావు అనే పెద్దమనిషిని ఏకగ్రీవంగా గెలిపించి పార్లమెంటుకు పంపించారు విజయవాడ నాయకులు. కమ్యూనిస్టుల గుండెకాయగా పిలుచుకునే బెజవాడలో ఒక కాంగ్రెస్‌ నేతకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతివ్వడం.. ఆ పార్టీల ఆంధ్రా పక్షపాత బుద్ధికి నిదర్శనం.
కేఎల్‌ రావు. ఈ పెద్దమనిషి చేసిన ఘనకార్యానికి తెలంగాణ ఆయకట్టు ఎడారిగా మారింది. సాగర్‌ నిర్మాణంలో అడుగడుగునా జోక్యం చేసుకుని ఆంధ్రాకు లాభం చేకూరేవిధంగా డిజైన్‌ మార్పించాడు. పైగా కేఎల్‌ రావు భారత ప్రభుత్వంలో సాగునీరు, విద్యుశ్చక్తి శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.  ఖమ్మం జిల్లా కట్టలేరు దాకా కాల్వను పొడిగించాడు. నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ క్రింద లిఫ్టుల ద్వారా ఒక లక్ష ఎకరాలకు ప్రభుత్వమే సాగునీరందించాల్సి ఉండగా.. ఆ బాధ్యతను రైతులపైకే నెట్టాడు. రైతులు తమ ఖర్చుతోనే లిఫ్టులను ఏర్పాటు చేసుకుంటే నీళ్ళివ్వడానికి అభ్యంతరం లేదని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కొత్త మెలిక పెట్టారు. సాగర్‌ కుడి కాల్వపై ఉన్న 42 లిఫ్టులను మాత్రం ప్రాజెక్టు నిధులతోనే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ వీటి నిర్వణా బాధ్యత ప్రభుత్వమే చూస్తున్నది. దీన్నిబట్టి తెలంగాణ పట్ల ఆంధ్రా పాలకులకు ఎంత చిన్నచూపుందో అర్ధం చేసుకోవచ్చు.
నాగార్జున సాగర్ లో జల విద్యుత్‌ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత ఎత్తిపోతల ద్వారా ఎడమ కాల్వ నీళ్ళను లక్ష ఎకరాలకు అందించగలమని జాయింట్ ప్రాజెక్టు రిపోర్టు లో స్పంష్టంగా పేర్కొన్నారు. ఆంధ్రాలో ప్రవహించే కుడికాల్వ కింద కూడా జలవిద్యుత్తు ఏర్పాటు చేసిన తర్వాత ఎత్తి పోతల ద్వారా కొంత ఆయకట్టుకు సాగునీరిచ్చే అవకాశం ఉంటుందని ఆ రిపోర్టులో ఉంది.  కానీ చెప్పిందేదీ జరగలేదు. ఎందుకని ప్రశ్నిస్తే.. ఎడమ కాల్వ లిఫ్టులను ప్రాజెక్టు రిపోర్టులో చేర్చలేదు.. కుడి కాల్వ లిఫ్టులు మాత్రమే చేర్చారనేది ఆంధ్రా పాలకుల జవాబు. ఇదంతా కేఎల్ రావు కుట్రలో భాగం. జాయింట్ ప్రాజెక్టు రిపోర్టులోని అంశాలను బుట్టదాఖలు చేసి తెలంగాణకు నష్టం కలిగే రీతిలో ఎప్పటికప్పుడు ప్రాజెక్టు రిపోర్టులో మార్పులు చేయడంలో కేఎల్‌ రావు సక్సెస్‌ అయ్యాడు.
అది 1969. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులు. రైతుల ఒత్తిడి మేరకు ఎడమ కాల్వ లిఫ్టులను సాగర్ ప్రాజెక్టు నిధులనుంచే నిర్మిస్తామంటూ ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. కానీ ఇంతలో ఉద్యమం ఉద్యమం సద్దుమణిగింది. వెంటనే ఆ జీవో  బుట్టదాఖలైంది. నిరాశ చెందిన రైతులు  సహకార సంఘాలు పెట్టుకుని స్వంత ఖర్చుతో లిఫ్టులను ఏర్పాటు చేసుకున్నారు.
సాగర్‌ ఎడమ కాల్వ లిఫ్టుల విషయంలో ప్రభుత్వం చూపించిన వివక్ష అంతా ఇంతా కాదు. రైతులు ఎన్నోసార్లు సర్కారుకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. 69 ఉద్యమం జరుగుతున్న టైంలో రైతుల ఒత్తిడి మేరకు ఎడమ కాల్వ లిఫ్టులను సాగర్‌ప్రాజెక్టు నిధుల నుంచే నిర్మిస్తామంటూ సర్కారు జీవో జీరీ చేసింది. తీరా ఉద్యమం చల్లబడేసరికి ఆ జీవో కాస్తా అటకెక్కింది. ఈ విషయలో రైతులకూ ప్రభుత్వానికి నడుమ వివాదం రోజురోజుకీ పెరిగింది. దీంతో 1983లో ఐఏఎస్‌ అధికారి ఇ.వి. రాంరెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పడింది. లిఫ్టులు ప్రాజెక్టులో అంతర్భాగమేనని.. వీటిని ప్రభుత్వమే నిర్వహించాలని కమిటీ సూచించింది. అయితే లిఫ్టుల నిర్వహణను ఏపీఐడీసీ ద్వారా చేపట్టిన ప్రభుత్వం.. వాటికయ్యే కరెంటు చార్జీలను రైతులే చెల్లించాలని కొత్త మెలిక పెట్టింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు తానేమీ తక్కువ కాదన్నట్టు ఎకరానికి యాభై రూపాయల నీటి తీరువా చెల్లించాలని రైతులను పీక్కుతిన్నాడు. ఉద్యోగులకు జీతాలు రైతులే చెల్లించాలని కూడా ఆ మహానుభావుడు ఆదేశించాడు. లిఫ్టులపై పనిచేసే ఉద్యోగులను చాలామందిని తొలగించాడు. ఫలితంగా నిర్వాహణా లోపం. చాలా లిఫ్టులు మూతపడ్డాయి. ఆయకట్టు చాలా వరకు తగ్గింది. 2009లో సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో ఉన్న లిఫ్టులను మళ్ళీ ఏపీఐడీసీ పరిధిలోకి తెచ్చారు. లిఫ్టుల రిపేర్లను ఐడీసీ నిర్వహిస్తుంటే కరెంటు బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఆపరేటర్ల, లష్కర్ల జీతాలు రైతులే భరిస్తున్నారు. రోజూవారీ లిఫ్టుల నిర్వహణ బాధ్యత రైతులపైనే పడింది. ఒక్క గడ్డిపల్లిలోని ఎల్-27 లిఫ్టు కింద తప్ప.. ఏ లిఫ్టు కిందా పూర్తి ఆయకట్టుకు సాగునీరందడం లేదు. గడ్డిపల్లి లిఫ్టు సమర్థవంతంగా పనిజేస్తుందంటే దానికి కారణం.. అంకిత భావంతో పనిచేస్తున్న రైతు బాంధవుడు గంటా గోపాల్‌రెడ్డి. 1969 లో లిఫ్టులకు శ్రీకారం చుట్టింది కూడా ఆయనే. కుడి కాల్వ లిఫ్టులను ఏర్పాటు చేసి పూర్తి బాధ్యతలు తీసుకున్న ప్రభుత్వం ఎడమ కాల్వ లిఫ్టుల విషయంలో మాత్రం భారాన్ని రైతులపైనే వేసింది. తెలంగాణపై ఆంధ్రా పాలకులు చూపుతున్న పక్షపాతానికి ఇంతకన్నా రుజువులు ఇంకేం కావాలి..?
నీరు పల్లమెరుగు అన్నది పాత సామెత. నీరు ఆంధ్రాకు తరలు అన్నది కొత్త సామెత! నాగార్జునసాగర్ లో ప్రతీ ఏటా కావల్సినంతగా వాటర్‌ ఉన్నా తెలంగాణ ప్రాంత ఆయకట్టుకు మాత్ర రాదు. ఎందుకు రాదని ప్రశ్నిస్తే అట్నుంచి సమాధానం రాదు. సాగర్‌ నుంచి డెల్టాకు నీటి కేటాయిపులు లేకున్నా- గత యాభై ఏళ్ల నుంచి ప్రతీ ఏటా రెండు మూడు వందల టీఎంసల నీటిని అక్రమంగా తరలించారని బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్ రిపోర్టు బట్టబయలు చేసింది.
జాయింట్ ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం సాగర్‌ కింద ఉన్న  నల్గొండ, ఖమ్మ జిల్లాల ఆయకట్టంతా మాగాణి పంటలే పండించాలి. కానీ ఆంధ్రా పాలకులు గత కొన్ని దశాబ్ధాలగా ఆయరట్టులో మూడింట ఒక వంతు ఆరుతడి పంటలే పండాంచాలని రైతులపై ఆంక్షలు పెడుతున్నారు. లక్షా ఇరవై వేల ఎకరాల్లో రెండో పంట వరి పండించాలని ప్రాజెక్టు రిపోర్టులో స్పష్టంగా ఉన్నా.. రబీలో ఆరుతడి పంటలే వేసుకోవాలని వేధిస్తున్నరు. మరోవైపు ప్రాజెక్టు రిపోర్టులో లేని కృష్ణా జిల్లా నూజివీడు తిరువూరు ప్రాంతంలోని లక్షా అరవై వేల ఎకరాలకు ఎడమ కాల్వ ద్వారా నీరందుతున్నది. కట్టలేరు వరకే ఉండాల్సిన ఎడమ కాల్వను మరో 110 కి.మీ.లు అక్రమంగా పొడిగించారు. ఖమ్మం జిల్లా ఆయకట్టుకు నీరందకుండా నేరుగా కృష్ణా జిల్లాకు ప్రవహించేలా బోనకల్‌, మధిర డిస్ట్రిబ్యూటర్లను 8 ఫీట్ల ఎత్తున నిర్మించారు. కె.ఎల్‌. రావు చేసిన అత్యంత నీచమైన కుట్రలో భాగమిది. న్యాయంగా నీరందాల్సిన ఖమ్మం జిల్లా రైతులకు వారబందీ పద్ధతిలో నీళ్ళు వాడుకోవాలని ఆంక్షలు పెడుతున్నారు. ఏ హక్కూ లేని కృష్ణా జిల్లా రైతులకు మాత్రం ఎడమ కాల్వకు యథేచ్ఛగా నీళ్ళిస్తున్నారు.
ఇక ఇదంతా ఒకెత్తయతే.. నిర్వాసితులది మరో గోడు. నాగార్జున సాగర్‌ రిజర్వయర్‌ నిర్మాణం 285 చదరపు కిలోమీటర్లలో జరిగింది. దీని కోసం 44 గ్రామాల్లోని 4వేల 824 కుటుంబాలను ఖాళీ చేయించారు. 24వేల 400వమంది నిర్వాసితులయ్యారు. వీరికి సరైన పునరావాసాన్ని కల్పించలేదు. యాభై ఏళ్ళయినా  ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.  సాగర్ ముంపుకు గురైన గ్రామాలన్నీ దాదాపు తెలంగాణ ప్రాంతంలోనివే.  బాధితుల్లో ఎక్కువమంది లంబాడీలున్నారు. ఇందులో వేలాది మందికి  సమీప గ్రామల్లో కాకుండా ఆంధ్రప్రాంతంలోని గుంటూరు జిల్లాలో పునరావాసం కల్పించారు. ఆంధ్రా అధికారుల వివక్ష, నిర్లక్ష్యం ఫలితంగా ఈనాటికీ ముంపు బాధితులు  నరకయాతన పడుతున్నారు. 
వలస పాలనలో తెలంగాణ ఎట్లా దోపిడీకి గురైందో నాగార్జున సాగర్‌ని చూస్తే అర్ధమైతది. పక్కన కృష్ణమ్మ పారుతున్నా మన గొంతులు ఎండబెట్టి -మన పొలాలు పడావుబెట్టి -కృష్ణా డెల్టాకు అక్రమంగా నీళ్లను మళ్లించడం ఆనవాయితీగా మారింది. సమైక్య  రాష్ట్రంలో వుంన్నంత కాలం తెలంగాణ బిడ్డల బతుకులు బాగుపడవు.