Saturday, 8 December 2012

కరకు శిలల్లోంచి చెరకు రసాలు!!



జలం గలగలల తరంగాలు
కుంభవృష్టిగా కురిసిన సహజ శిల్పకళలు

అందమైన అరణ్య గర్భ సీమలోకి
మలచిన రహస్య సొరంగ మార్గాలు
శిలా జలాశయాల్లో మునిగిపోయిన గంధర్వ లోకాలు

చర్మ చక్షువులకు అందని యక్షుల స్వగ్రామాలు
రస హృదయులకు మాత్రమే దర్శనమిచ్చే
అప్సరసల అంతఃకోణాలు!

అజ్ఞాత శిలా యజ్ఞలోకంలా అగుపించే 
పెనుశిలలన్నీ ఆరిపోయిన హోమాగ్ని గుండాలు!
మేఘాలు నివురుగప్పుకున్న ధూమాలు! 

హరితభరిత శిఖర శిలావిలాసం
ప్రకృతి రమణీయతకు నిలువెత్తు దర్పణ

ఇది కోనా
లేక రెండుగా చీలిన తుంబురుని వీణా!

ఆ లోయల్లో గండశిలల గుండెలు కరిగి
నీటిఊట నోటమాట రానీయదు సుమీ!!

ఆకాశ రహస్య రాజ మార్గం 
ఏదో తెలియని భావమోహావేశం

అనుభవేకవేద్యమైతేగానీ సెలయేటి
జలప్రవాహ రాతి వీణాతంత్రుల నాదాల్ని వర్ణించలేం

భూగర్భం నుంచి యుగయుగాల యుగళ గీతాలు
పచ్చని శిఖరాల కలయిక ఆకాశానికి ఓ కుండలీకరణాలు

ఉలికీ శిలకూ జరిగిన ప్రణయ పరిశ్రమలో
రూపొందిన వసంతుని కోటలా వనదేవతల పేటలా  
శిఖర శిలా నిలయలో సహజ మార్మిక శిల్పాలు

వనమాహినుల్లో దాగిన మోహినీ అవతారం
అరణ్య మర్మ సౌందర్య ప్రతిబింబం

జలదండోరాలా వినిపించేలా జలపాత ఘోష
నీటి లోతుల్లో చిరుచేపల కనుపాపల కదలిక

కరకు శిలల్లోంచి చెరకు రసాలు స్రవించినట్టుగా
కళను శిలను కలిపి శిల్పించిన పర్వత కుడ్య చిత్రాలుగా

ఈ అస్పష్ట కళా సృష్టికి ముకుళిత హస్తాలు
రాతి దోసిలి విప్పి సమర్పించే శిల జలాంజలులు

ఏ వన కన్య స్నానం కోసమో ఈ జిలిబిలి నడకలు
నిండు సొగసుల దారి వెంబడి పసిపాపల్లా
దారి చూపే గజ ఈతగాళ్లలా చేపలు

సెలయేటి నెమలి విప్పిన నీలి పింఛంలా
గగనలోక అతిథుల్లా అడుగుపెట్టే వెండి వెలుగుల్లా

శిలా ప్రపంచంలో కిరణాల తిరునాళ్లు
జల దేవతల సమావేశ మందిరానికి నిర్మించిన
శిలా సోపానా రాతి మలుపులు

ఈ జల సవ్వడి
సామవేదానిదో లేక ప్రేమ వేదానిదో  
తెలిస్తే ఎంత బావుంటుందో కదా!

2 comments:

  1. Wow....beautiful pic with nice expressions.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మార్పిత గారూ.....:)))

      Delete