పేరిణి తాండవం. ఇది
వీరులు చేసే వీర నాట్యం. యుద్ధానికి
సన్నద్ధం చేసే నృత్యం. శత్రువు ముందు తలదించకూడదని ధైర్యం నూరిపోసే నాట్యం. పాదాల
కదలిక శత్రు సైన్యం మీదికి ఉరికినట్టుంది. చేతుల ఆడుతున్న తీరు కత్తి విన్యాసాన్ని
తలపిస్తుంది. విప్పారిన కళ్లు అవతలి వాడిని భయకంపితుల్ని చేస్తుంది. ఎగురుతున్న
కనుబొమ్మలు ఎదుటివాడి గుండెలో దడపుట్టిస్తాయి. మెలితిరిగిన మీసం వీరత్వాన్ని
సూచిస్తుంది. ఈ నృత్యం చేసే ప్రతి వ్యక్తీ శివుణ్ణి ఆవహించుకుని ఆవేశంతో తాండివిస్తాడు. పేరిణి నృత్యకారుడు రూప సంపన్నుడుగా ఉంటాడు. రసానుభవంగలవాడిగా
కనిపిస్తాడు. పేరిణి నాట్యం తాండవ శైలికి
సంబంధించింది. తాండవం అంటే తనలో తాను లయం చేసుకోవడం. పేరిణికి
గురించి పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్రలోనూ, శ్రీనాధుని కాశీఖండంలోనూ, భీమఖండంలోనూ కనిపిస్తుంది. గణపతి
చక్రవర్తికి సేనా నాయకుడైన జయప సేనాని నృత్యరత్నావళిలో పేరిణి గురించి చాలా అద్భుతంగా వర్ణించాడు.
ఇది కేవలం పురుషులు మాత్రమే ఆడే నాట్యం. అందుకే
యోధుల నృత్యం అంటారు. యుద్ధరంగానికి వెళ్ళబోయే
ముందు శివుడి
ముందు ఈ నాట్యాన్ని భక్తి
శ్రద్ధలతో ప్రదర్శించేవారు. నాట్యం చేస్తూ ఆ ముక్కంటిని తమ దేహంలోకి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందుతారు. కాకతీయుల కాలంలో ఈ కళ పరిఢవిల్లింది. వారి శకం
ముగిసిన తర్వాత ఈ కళ దాదాపుగా కనుమరుగైపోయింది.
మళ్ళీ ఆచార్య నటరాజ రామకృష్ణ కృషితో వెలుగులోకి వచ్చింది. శివతాండవం
మీద జయప సేనాపతి రాసిన నృత్య రత్నావళి గ్రంధాన్ని రామకృష్ణ ఔపోసన
పట్టారు. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఆలయాలనూ
సందర్శించారు. ఆలయ ప్రాకారాల మీద
చిత్రీకరించిన పేరిణి
శివతాండవం నృత్య రీతులను అధ్యయనం చేస్తూ,
వాటికి అనుగుణంగా పేరిణి
శివతాండవం నృత్యాన్ని సృష్టించారు. కేవలం ఈ ఒక్క ఊహతోనే నటరాజ రామకృష్ణ చిరస్మరణీయమైన తాండవ నృత్యాన్ని ఎంతో శ్రమించి తీర్చిదిద్దారు.
No comments:
Post a Comment