మందు ముట్టుకోని గ్రామం గురించి మీరెప్పుడైనా
విన్నారా? పైసా పన్ను వేయకుండా మంచినీళ్లిచ్చే గ్రామ పంచాయితీ ఉందా? ఫీజు
తీసుకోకుండా చానళ్లు ప్రసారం చేసే డిష్ ఆపరేటర్ ఉన్నాడా? పోలీసులు అడుగుపెట్టని ఊరుందా? అన్ని
పదవులు మహిళలకే దక్కిన పాలక సంఘాలున్నాయా?
ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేసే రైతులున్నారా?
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి
గ్రామం. వరంగల్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో నర్సంపేట రహదారికి ఆనుకుని- పచ్చని
చెట్ల మధ్య పోకబంతిపూలన్నీ మాలకట్టినట్టుగా
ఉంటుంది ఊరు. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇక్కడ నూటికి నూరుపాళ్లు వర్ధిల్లుతుంది.
పల్లెటూరంటే ఒకటో అరో చెప్పుకోదగ్గ విశేషాలుంటాయి. కానీ ఈ ఊరికి కొన్ని వందల
ప్రత్యేకతలుంటాయి. ఆ మాటకొస్తే అంతర్జాతీయంగానూ ఈ విలేజ్ ప్రివిలేజ్‌ని
సంపాదించింది. ఒక గ్రామం ఎలా ఉండాలి అంటే.. ఇలా ఉండాలి అని చెప్పుకోవడానికి ఈ
పల్లె అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. గంగదేవిపల్లి అభివృద్ధి వెనుక 14ఏళ్ల
కృషి,13 అభివృద్ధి కమిటీల శ్రమ ఉంది. ప్రతీ విషయంలో
పారదర్శకత, పాలనలో ప్రతీ ఒక్కరికీ బాధ్యత ఈ ఊరిని ఆదర్శ
గ్రామంగా నిలిపాయి. గంగదేవిపల్లి మొదట్లో
మచ్చాపురం పంచాయతీ శివారు గ్రామంగా ఉండేది. 1994లో
ప్రత్యేక పంచాయతీగా గుర్తించారు. అప్పటికి ఊళ్లో నాటుసారా ఏరులై పారేది. ఎన్నో జీవితాలు బలయ్యాయి. సరిగ్గా
అప్పుడే గ్రామస్థుల్లో ఆలోచన మొదలైంది. మొదటి అడుగు ఎపుడూ ఒంటరిదే. కానీ రానురాను
దారులు పరుచుకున్నాయి. అడుగులు జతకలిశాయి. చేయిచేయి కలిసింది. మొట్టమొదటి
యుద్ధం నాటుసారామీద. ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులు. కానీ, గ్రామస్తుల ఉక్కు సంకల్పం ముందు
ఏదీ నిలవలేదు. సర్కారు సైతం ఊరి జనం ఆశయాన్ని కాదనలేదు. అందుకే 1982 నుంచి ఈ ఊళ్లో
సంపూర్ణ మద్యనిషేధం అమలవుతోంది. అందుకే జనం ఇక్కడ మందు ముట్టరు.
1995లో మొదటి సారి గ్రామ
పంచాయితీగా ఏర్పడినప్పుడు గ్రామస్తులంతా కలిసి రిజర్వేషన్ లేకున్నా సరే సర్పంచ్ తో
పాటు మొత్తం వార్డు మెంబర్లను మహిళలనే ఎన్నుకున్నారు. ఇలా రెండు టర్ములు మహిళలే
గ్రామాన్ని పాలించారు. గ్రామ పంచాయితీగా ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు జిల్లా స్థాయిలో
ప్రతీ సారి గంగదేవిపల్లి ఉత్తమ గ్రామ పంచాయితీగా ఎన్నికవుతోంది. వందశాతం పన్నులు
చెల్లిస్తారు. బ్యాంకు రుణాలు ఎవరూ ఎగ్గొట్టరు. ఇంటికో మరుగుదొడ్డి. ఇంటిటికీ
చెట్లు. పాడి లేని ఇల్లు లేదు. కోడి
ఎదిగితే సంసారం ఎదుగుతుందంటారు. అందుకే ఈ ఊళ్లో కోళ్లకి కొదవలేదు. ఊరంతా వందశాతం
పచ్చదనం. వందశాతం పారిశుధ్యం. వందశాతం కుటుంబ నియంత్రణ, వందశాతం అక్షరాస్యత! ఇదీ ఈ పల్లె సాధించిన ఘనత. ఏ జంటకైనా ఇద్దరికి మించిన సంతానం ఉండదిక్కడ. ప్రతీ కుటుంబం
చిన్న మొత్తాల పొదుపు సంస్థలో ఖాతాదారులే. బడి ఈడు పిల్లలంతా బడిలోనే ఉంటారు. చూద్దామన్నా బాల కార్మికుడు కనిపించడు. పెద్దలు కూడా వయోజన విద్య
ద్వారాచదువుకున్నారు. కనీసం పక్కగ్రామాల కల్చర్ కూడా గంగదేవిపల్లికి సోకలేదు. అందరూ ఎరువులు, పురుగుల మందులతో వ్యవసాయం చేస్తుంటే ఈ ఊళ్లో మాత్రం సేంద్రీయ
వ్యవసాయానికే మొగ్గు చూపుతున్నారు. ఇవన్నీ ఒక్కరోజులో జరగలేదు. 1995కు ముందు ఈ
గ్రామంలో కూడా అన్ని గ్రామాల్లో మాదిరిగానే గొడవలు, కక్షలు,కార్పణ్యాలుండేవి.
అభివృద్ధికి ఆమడదూరంలో కొట్టుమిట్టాడుతుండేది.
నిరక్షరాస్యతకు నిలయమై ఉండేది. నీటికొరతతో అల్లాడిపోయేవాళ్లు. అపరిశుభ్రతకు కేరాఫ్
అడ్రస్ గా ఉండేది. బాలవికాస లాంటి స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు, ప్రజల్లో పరివర్తన
రావడంతో గంగదేవిపల్లి రూపురేఖలే మారిపోయాయి!!
ఒకటి కాదు రెండు కాదు. అక్షరాలా 22 కమిటీలు. ఎవరు చేయాల్సిన పని వాళ్లు
చేస్తారు. పేరుకే లీడర్ షిప్. అమల్లో అందరూ పాలు పంచుకుంటారు. వర్గపోరు లేదు.
అధిపత్య పోరు అంతకన్నా లేదు. మంచినీళ్ల దగ్గర్నుంచి మరుగుదొడ్ల దాకా ఆ ఊరి
బాగోగుల్ని కమీటీలే చూసుకుంటాయి. గ్రామ పంచాయితీ కమిటీ, మంచినీటి నిర్వహణ కమిటీ,
వీధిలైట్ల నిర్వహణ కమిటీ, మద్యనిషేధ కమిటీ, డిష్ కమిటీ, ఆరోగ్య కమిటీ, లోన్స్
రికవరీ కమిటీ, సమస్యల పరిష్కార కమిటీ. ఇలా 22 కమిటీలున్నాయి. 1400 జనాభా ఉన్న ఊళ్లో
ప్రతీ వ్యక్తి ఏదో ఓ కమిటీలో మెంబర్ గా ఉంటూ బాధ్యతగా వ్యవహరిస్తారు. గ్రామస్తులు
ఉచితంగానే టీవీ ప్రసారాలు చూస్తారు. గ్రామ పంచాయితీయే స్వయంగా డిష్
నిర్వహిస్తోంది. గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మంచినీటిని
ఉచితంగానే అందిస్తున్నారు. కేవలం ఒక్క రూపాయికే 20 లీటర్ల ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తారు. గ్రామంలో
సంపూర్ణ మద్యనిషేధం అమలు కావడంతో చాలా వరకు ఘర్షణలు లేని వాతావరణాన్ని కల్పించింది.
చిన్న చిన్న గొడవలైనా గ్రామ స్థాయిలోనే పరిష్కరించుకుంటారు. భార్యాభర్తల పంచాయితీ మొదలుకుని అన్ని
రకాల గొడవలను కమిటీ పరిష్కరిస్తుంది. గ్రామస్తులు ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు.
పోలీసులు గ్రామంలో అడుగు పెట్టిందీ లేదు. పల్లెల్లో సైతం ప్రైవేటు పాఠశాలలు
పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో గంగదేవిపల్లిలో ఒక్క ప్రైవేటు స్కూలు
లేదు. పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతారు. అందుకే చిన్నపల్లె అయినా సరే
గ్రామంలో ఉన్నత పాఠశాలను తెచ్చుకోగలిగారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను సర్కారీ
స్కూల్‌కే పంపడానికి ఇష్టపడతారు.
పిల్లలు కూడా అంతే. ప్రైవేటు స్కూళ్లో చదవం అంటారు.
ఆమాటకొస్తే రాష్ట్రంలో
ఆదర్శగ్రామాలు చాలానే ఉన్నాయి. కానీ గంగదేవిపల్లి అన్నిటికంటే చెప్పుకోదగ్గది.
ఎంతగా అంటే.. దేశవిదేశాలు సైతం వచ్చి ఊరి బాగోగుల్ని పరిశీలించి
పోతారు. నిత్యం అదొక టూరిజం స్పాట్! ఇప్పటిదాకా ఆ ఊరికి 200 అవార్డులొచ్చాయంటే
నమ్మశక్యం కాదు. గ్రామంలో ఇన్ని
ప్రత్యేకతలు స్వచ్ఛంద సంస్థలనే కాదు, దేశ విదేశాలను కూడా ఆకర్షించింది. అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. అప్పట్లో చిరంజీవి
ప్రజారాజ్యం పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్న వెంటనే గంగదేవిపల్లిని సందర్శించాడు.
తాను అధాకరంలోకి వస్తే ప్రతీ గ్రామాన్ని గంగదేవిపల్లిలా తీర్చిదిద్దుతానని
చెప్పాడంటే.. ఈ పల్లె విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ప్రతిష్టాత్మకమైన జాతీయ
స్థాయి నిర్మల్ అవార్డుతో పాటు, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన కూసం రాజమౌళికి
శాంతిదూత అవార్డు కూడా వచ్చింది. గూగుల్ ఎర్త్ వాళ్లు బెస్ట్ విలేజి అవార్డు ఇచ్చారు.
గ్రామానికి బీమాగ్రాం, జాతీయ స్థాయిలో రాజీవ్ గాంధీ ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డు,
పరిశుభ్రతకు శుభ్రం అవార్డుతో పాటు 200 వరకు పురస్కారాలు లభించాయి. దాదాపు 12
దేశాలకు చెందిన ప్రతినిధులు గ్రామాన్ని సందర్శించి ఇక్కడి పరిస్థితిని తెలుసుకుని
వెళ్లారు. ప్రతీ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి ప్రతినిధులు నిత్యం
సందర్శిస్తుంటారు. అందుకే గంగదేవిపల్లి ఇప్పుడో టూరిస్టు స్పాట్. ఈసారి మీరు ఎప్పుడైనా వరంగల్ ఏరియాకు వెళ్తే తప్పకుండా గంగదేవిపల్లిని సందర్శించండి! అప్పుడు మీకు అనిపిస్తుంది.. మళ్లీ జన్మంటూ ఉంటే సూరమ్మో.. ఈ భూమ్మీదనే పుడతా అని.....!!!!!!
చాలా మంచి పోస్టు.గంగ దేవి పల్లి పౌరులందరూ అభినందనీయులు.ఎవరో రావాలని ఏదో చేయాలని ఎదురు చూడకుండా మనకు మనమే మన జీవితాల్ని ఎలా బాగు చేసుకోగలమో నిరూపించిన గ్రామమది.మీ పరిచయానికి ధన్యవాదాలు.వీలయితే ఆ గ్రామం గురించి వీడియో క్లిప్పింగు కూడా పెడితే బాగుంటుంది.
ReplyDeleteస్పందించినందుకు ధన్యవాదాలు.. వీడియో క్లిప్పింగ్ కూడా సేకరించి పెడతాను మీకోసం!!
Deleteమంచి పరిచయం. ఇంగ్లీష్‌లో యుటోపియన్ అనే విశేషణానికి పూర్తిగా సరిపోయే గ్రామం.
ReplyDeleteఅవును.మళ్లీ జన్మంటూ ఉంటే గ్రామ స్వరాజ్యం వర్ధిల్లే ఆ ఊరిలో పుట్టాలని కోరుకుంటారు ఎవరైనా..
Deleteనమ్మశక్యం కాని నిజాన్ని చెప్పారు
ReplyDeleteచదువుతుంటేనే ఇంతబాగుంది, చూస్తే ఇంకెంతబాగుంటుందో.
స్పందించినందుకు ధన్యవాదాలు!! అవును.. ఒకసారి మీరు కూడా వెళ్లిరండి ఆ ఊరికి...
Deleteఔనా!!! ఆశ్చర్యకరం.
ReplyDeleteస్పందించినందుకు ధన్యవాదాలు. ఒకసారి ఆ ఊరికి మీరూ వెళ్లిరండి.. ఇంకా డబుల్ ఆశ్చర్యపోతారు.. పద్మార్పిత గారూ....
Deletegood
ReplyDeleteధన్యాదాలు.. అందుకే కష్టే ఫలి అంటారు మీలాంటి పెద్దలు!!!!
Deleteచూస్తే ఇంకెంతబాగుంటుందో
ReplyDeleteఅవును.. ఒకసారి వెళ్లి పరిశీలించి రండి.. స్పందించినందుకు ధన్యవాదాలు!!
DeleteMI BLOG CHUSAKA NANNU NENU ADDHAMLO CHUSKUNNATTUNDHI. REAL GA PALLENU CHUSI CHALA DHINALAINDHI AVVA THATA AYYYA AMMA PEDDANNA CHINNANNA AKKA SELLI DHEVUDA NANNU MALLI PUTTINCHE MUNDHI E BLOG ANNA CHEPPINATTU OKA MANCHI PALLELLO PUTTINCHU DHEVUDA
ReplyDeleteBROTHER MIMMALNI CHUSTUNTE NAKU IRSHAGA VUNDHI.
THANKS FOR U R CONTRIBUTION.