Friday 20 July 2012

సామూహిక మానభంగం


సామూహిక మానభంగం
ఆరున్నర దశాబ్దాల వసంతం
అర్ధరాత్రి
కూకటివేళ్లతో పెకిలిపోయింది
సూర్యుడు తెల్లారి భళ్లున నవ్వాడు
నెత్తుటి పుష్పంమీద ఫోటో ఫ్లాష్‌
సిరామిక్‌ నునుపులో ఎర్ర కలువలు
దండకారణ్యంలో శోకవచనం
ఎవడో పాటకట్టి లూప్‌లో పెట్టాడు
ఏకాకి కీచురాయి భీతావహ స్వప్నం
దయచేసి అందరూ వెళ్లిపోండి
కాసేపట్లో ఇక్కడ
ఎన్‌కౌంటర్‌ జరగబోతోంది
హఠ్‌.. సాలా!!
                                       

Wednesday 18 July 2012

సారూ.. జ్వరం తగ్గేటట్టు లేదు !!


కాలం గావుకేక పెట్టింది
వాన వెలసి నీరెండలో చిమ్మచీకటి
దగ్దమైన హృదయాన్ని ఆర్పే
ఒక్క బాష్పబిందువూ లేదు
తేజో వలయాలన్నీ
విద్యుదాఘాతానికి గురై
కాలిపోతూ వాలిపోతూ
సంజకెంజాయ రంగులన్నీ
కంటిపాప చుట్టూ దుఃఖఛాయలై:
కాలం ఈసారి చావుకేక పెట్టింది
చీకటి వొడిలో వెలుతురు గాఢనిద్ర
అంతర్‌ బహిర్‌ వేదనలు
ఒట్టిపోయిన రిజర్వాయర్‌లో
రెండు ఎండిపోయిన కన్నీటి చారికలు
ఒకటి నాది
ఒకటి ఆమెది
చెడిపోయిన గడియారం ముల్లుకు
గుచ్చుకున్న కాయితప్పడవ
క్షార జలధుల్ని తోడుతోంది
అసంబద్ధ కలల్ని పొడుచుకుతిన్న తీతువు పిట్ట
వేకువ జామునే ఎగిరిపోయింది
ఒత్తిగిలి పడుకున్నా
వెన్నులో నాటుకున్న తుమ్మముల్లు
ఇంకా బయటకి రాలేదు
సారూ.. లో జ్వెరం !
కాలం ఈసారి సుప్తచేతనావస్థలో పడివుంది
బిచ్చగాడి చేతిలో ఏక్‌తార
వంద సంపుటాల దుఃఖం
దమ్మిడీ రాలేదు రొఖ్ఖం
కాలం క్రమంగా నేలమాళిగలోకి జారుకుంది
తవ్వుతున్న శిలల్లో
ఖండిత మాంసపు ముద్దలు
మృత్యుపరాగ రేణువుల్లో
ఏనాటిదో మోహపు దుర్వాసన
యుద్ధంలో అలసిపోయిన ఖడ్గాలన్నీ
ఆశ్రమగీతాలు పాడుకుంటున్నాయి
ఎక్కాల్సిన రైలు వెళ్లిపోయిందని
ఫ్లాట్‌ఫారం మీద
బక్కచిక్కిన అస్తిపంజరం
కుప్పకూలిపోయింది
మూలుగులోంచి మూలుగు
సారూ.. ఈ జ్వెరం తగ్గేటట్టు లేదు
కాలం మళ్లీ గాడిన పడేదెన్నడో!


Monday 16 July 2012

ఒరేయ్‌ కొలంబస్‌ ఎక్కడున్నావురా..?


క్షణాల్లో మారిపోతుంటే
నిమిషాల్లో ఎందుకు
డూ ద న్యూ ఫర్‌ లైఫ్‌
జీవితమే ఓ గాలిబుడగ
ఈ లైఫ్‌ టైం ఫ్రీలూ
లాంగ్‌ టర్మ్‌ ప్రీమియంలూ
ఈ హిడెన్‌ చార్జీలూ
హిపోక్రసీలూ ఈగోలూ
ఎందుకు బాస్‌
సిర్ఫ్ ఏక్‌ రూపీ మే
కబ్‌ చాహియే జబ్‌ లేలియే
కిత్నా హోనా ఉత్నా లేనా
అయ్‌ వాంట్‌ ఇన్‌స్టంట్‌
డైరెక్టుగా తేయాకు తోట నుంచే
న ప్రిజర్వేటివ్ - న యాడెడ్‌ కలర్స్‌
తరుగూ వద్దు మేకింగ్‌ చార్జీలూ వద్దు:
కిడ్డీ బ్యాంకుల నుంచీ
టెడ్డీబేర్‌ల నుంచీ
ఈ టెక్నోల నుంచీ
ఈ సేవాల నుంచీ
ఇంటద్దె నుంచీ
న్షూరెన్స్‌ పాలసీల నుంచీ
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచీ
ఏటీఎం సెంటర్ల నుంచీ
కార్యాలయాల నుంచీ
కరెన్సీ ఫెళఫెళల్నుంచీ
దూరంగా
దూరం దూరంగా
ఏంటదీ..
అంతరిక్షం అంత లాంగ్
లైఫ్‌లాంగ్‌
ఇన్‌స్టంట్‌ లైఫ్‌లోకి
సెకన్‌ పల్స్‌ రేటులోకి
ఏ ప్యాకేజీల్లేని ప్రపంచంలోకి
ఏ గ్యారెంటీ వారంటీల్లేని
ఏ అష్యూరెన్స్‌ భరోసా ప్రకటనల్లేని లోకంలోకి
ఏ కండీషన్స్‌ అప్లయ్‌ కాని జీవితంలోకి
నేరుగా ఏ రిసెప్షనిస్టూ అడ్డుకోకుండా
ఎవరి అప్పాయింట్‌మెంట్‌ కోసమూ చూడకుండా
భూతమేదీ వెంటాడకుండా
భవిష్యత్‌ భయపెట్టకుండా
చారిత్రక తప్పిదాలేవీ
చెర్నాకోల్‌తో చెళ్లుమనిపించకుండా
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
సర్‌ ఉఠాకే
విదౌట్‌ రోమింగ్‌ చార్జెస్‌
ఒరేయ్‌ కొలంబస్‌ ఎక్కడున్నావురా బాబూ..

జలతరంగిణీ పరిమళం !!


ఝళజళంఝళ రాగాల ప్రణయ నృత్యం
గుండెల్లో ఉద్రేకాల సవ్వడికి తరంగాల రూపం
డాల్చె గబ్బానాపై క్వీన్షెబా
దేహమంతా పరుచుకున్న సౌగంధం
లహరీ సమీర భువన మోహన రాగం
అప్నే  ధున్మే రహతా హూ!
గులాం అలీ లతాజీ జుగల్బందీ
నీటి పరదాల వెనుక సంగీత కచేరీ
పియానో మెట్ల గమకాలతో
గతి తప్పని జలధారలు
బద్దకంగా వొళ్లువిరుచుకున్న
వందల కొద్దీ అమృత కలశాలు
ముఘాల్ని కత్తిరించారా..
చినుకుల్ని అతికించారా..
నిశ్శబ్ద మైదానంలో
విచ్చుకున్న ఫౌంటెయిన్తో
పార్కు గాలి స్వేచ్ఛా సంభోగం
పబ్లిగ్గా.. వేయి వాయులీనాల సాక్షిగా
ఏవేవో స్మృతులు
వందల కొద్దీ  సారంగులు
గుండెల నిండా తుఫాను వలె
నిలువెల్లా ఆవహించిన గమకాల్లో
ఘనీభవించీ ద్రవీభవించీ
క్షణక్షణాలుగా రాలిపోతూ
సరిగమల్లో కరిగిపోతూ
బాధల్లోంచి భయాల్లోంచి
కష్టాల్లోంచి ఏడుపుల్లోంచి
దూరంగా పారిపోవాలనుంది:
కళ్లు మూసుకోకున్నా కలలొస్తాయా
ఏమో దృశ్యం అలాగే ఉంది
ఎన్నెన్ని అందాల్ని కళ్లునింపుకుంటున్నాయనీ..
చెరువులో చేపపిల్లగా ఈదులాడుతున్నట్టుగా..
వెన్నెల రాత్రిలో ఇసుక తిన్నెలపై పొర్లాడుతున్నట్టుగా
మంచు కురుస్తున్న వేళ రాలుతున్న పొగడపూలని
ఏరుకున్నట్టుగా..
కనపడని కుంచే ఏదో నీటి కాన్వాసు మీద
క్షణానికో బొమ్మ గీస్తుంటే
బాల్యంలోకి జారిపోవాలనుంది
చినుకు గువ్వల్ని పట్టుకుని
సప్తసముద్రాలకావల దాచిపెట్టాలనుంది
ఎంత సౌందర్య పిపాస నీటికి
పూల గంపలోంచి వచ్చిందీ జలతరంగిణి పరిమళం
ఇంకా ఎంత దూరం లాక్కెడుతుందో కదా..
ఎవరీ ఆర్కిటెక్చర్
కనిపిస్తే పాదాభివందనం చేయాలి
సాష్టాంగ నమస్కారం చేయాలి
పవిత్ర గంగా జలంతో అభిషేకం చేయాలి
ఎలాగైనా వెతికిపట్టి సన్మానం చేయాలి

Sunday 15 July 2012

శ్రీనీలు

వినాయకచవితి
చిన్నతనంలోనే
నాయకత్వ లక్షణాలు

ఱంపపు కోత భరించలేక
చెక్కదిమ్మ యేడుస్తోంది
పొట్టుపొట్టుగా..

చందమామను చూస్తే
మల్లెచెట్టుకు యెంత సిగ్గో..
పూలకొంగు మొహాన కప్పుకుంది.

స్కూల్‌ బస్‌
యెన్ని సీతాకోకచిలుకల్ని
మోసుకెళ్తుందో..

గ్రంధాలయం
అడుగు పెట్టగానే
మస్తిష్కమంతా
విజ్ఞాన పరిమళం

మల్లెతీగ మనీప్లాంట్‌ తో
ఏం గొడవ పెట్టుకుందో
యాంటెనాతో కమిటయింది.

దర్వాజ బండమీద
పావలా బిళ్లలు..
దొంగతనం చేసినప్పుడల్లా
మా తాత చేతి కర్రే సాక్ష్యం.    

Saturday 14 July 2012

తండ్రికి చిన్న ప్రశంసాపత్రం!!


అమ్మ అమృతమైతే, దాన్ని నింపుకున్న కలశం నాన్న! అమ్మ వెలిగే దీపమైతే దాన్ని  వెలిగించే వత్తి నాన్న! ఒక్కమాటలో చెప్పాలంటే తండ్రి త్యాగాల గుర్తు! అమ్మప్రేమ కంటి  ముందుంటే.. నాన్న ప్రేమ గుండెలో ఉంటుంది! అమ్మంటే  మెరిసే మేఘం! నాన్నంటే నీలాకాశం! ! మమతల పందిరి కింద తండ్రికి ఒక చిన్న ప్రశంసాపత్రం! !
జీవితం దారి మరిచిపోయిన మార్గదర్శి! నో క్యాష్‌ బోర్డ్‌ లేని ఏటీఎం! అస్తమానం పని చేసే గానుగెద్దు!  అవసరం వస్తే అడుక్కోవడం కూడా చేతగానోడు!  భార్య సంతోషం కోసం తపనపడేవాడు!  పిల్లల ఆనందం కోసం తాపత్రయపడేవాడు! కూతరంటే హడలి చచ్చేవాడు! కొడుకంటే బెదిరిపోయేటోడు! అన్నింటికి కలిపి ఒక్కటే పేరు తండ్రి!  మనకందరికీ నాణానికి ఒకవైపు మాత్రమే కనిపిస్తాడు! మరోవైపు అర్ధం చేసుకోవాలంటే కొంచెం మనసు కూడా కావాలి!
ప్రకృతి అమ్మైతే, దానికి జీవం పోసే విధాత నాన్న! అమ్మకు నిర్వచనాన్ని గుండెనడిగితే  తెలిసిపోతుంది!  కానీ నాన్నకు అర్ధం వెతకాలంటే  విశ్వం మొత్తాన్ని శోధించాలి! ఆయన మనసు అర్ధంకాని అంతరిక్షం! ఆయన హృదయం తేల్చుకోలేని పాతాళం! విషాన్ని, అమృతాన్ని తాగిన సర్వేశ్వరుడు! ! చూడలేనికి వారికి అణుమాత్రంగా గోచరిస్తే.. చూడగలిగినవారికి అండపిండ బ్రహ్మాండాలను దాటి పోయే విశ్వరూపం సాక్షాత్కరిస్తుంది! !
నాన్న అర్ధంకాని జీవి!. కష్టాన్ని కళ్లకింద దాచి పెడతాడు!. సంతోషాన్ని చేతులతో పంచుతాడు!. షర్టు లేకుండా నాన్నని చూడు!. ఆయన ఛాతీ ఎండిపోయిన నాగార్జున సాగర్‌ డామ్‌లా కనిపిస్తుంది!. ఎంత ఒత్తిడిని తట్టుకోవాలి!. ఎంతెంత నీటిని కాచుకోవాలి.  అందుకే ఆయన్ని చూస్తే అట్టగుడుకు జారిపోయిన ధైర్యం గుండెలోకి ఎగదన్నుకొస్తుంది!  ఆయన స్పర్శ కరుకుగానే ఉండొచ్చు! కానీ తాకిచూడు! ఎదో సాధించాలన్న కసి నరనరాల్లోకి సర్రున పాకుతుంది!  
నాన్న ఒక వెన్నెల రేడు! భగభగమండే ఎండలను దాచుకుని మలయ మారుతాల్ని పంచేవాడు!. విషం తాగి అమృతం ఇచ్చేవాడు!. తనకోసం ఏమీ దాచుకోనివాడు! అందరి బరువుల్నీ మోసేవాడు!దుఃఖమొస్తే రెప్పల మాటున గుంభనంగా దాచుకునేవాడు! అమ్మతనం వెనుక ఎంత పెయిన్‌ ఉందో.. నాన్న కావడం వెనుకా అంతే బాధుంది! అమ్మ మనసు బంగారమే! కానీ నాన్న మనసు కూడా!! కన్నీళ్లూ కష్టాలూ ఒక్కసారిగా ముసిరినప్పుడు, భద్ర గుండె బరువెక్కినప్పుడు నాన్న గుర్తొస్తాడు! ఆయన పోరాట పటిమ గుర్తొస్తుంది!తండ్రి ప్రయాణించిన వేల మైళ్లు గుర్తొస్తాయి! ఆ త్యాగాల ప్రతిరూపానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం! ! రెక్కలు ముక్కలు చేసి బతుకునంతా ధారవోసి బిడ్డల్ని పెంచే నాన్నలంతా వర్ధిల్లాలి! ! !