Wednesday 28 November 2012

మల్లినాథ సూరి గురించి...


భక్త పోతన భాగవత పద్యసరసం. పాల్కుర్కి సోమన బసవపురాణం. కాకతి రుద్రుని కాలంలో వెల్లివిరిసిన మల్లినాథుని వ్యాఖ్యానం. సాహిత్య మాగాణం.. మన తెలంగాణం. ఏం తక్కువ ఈ గడ్డకు.  అయినా వలసాంధ్ర ప్రభుత్వాలు ఈ చరిత మీద మన్నుగప్పాయి. తెలంగాణ ఆత్మగౌరవానికి సాహితీ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలబడ్డ మల్లినాథ సూరి పేరిట కాశీలో విద్యాపీఠం ఉన్నా.. పరాయి పాలకులకు ఆయన గొప్పదనం కనిపించదు. కనీసం విగ్రహం పెట్టడానికి కూడా మనసు రాదు.   

ఎవరైనా  పుస్తకం మీద మంచి వ్యాఖ్యానం రాస్తే అది మల్లినాథ సూరి మార్కులా వుందనడం లోకోక్తి. వ్యాఖ్యానాలకు ఆయన పెట్టింది పేరు. మల్లినాథుడే లేకపోతే కాళిదాసు మహాకవి సహా ఎందరో సంస్కృత కవుల గురించి తెలుగు ప్రజలకు తెలిసేదే కాదు. మెతుకు సీమ మెదకు జిల్లాలో పుట్టిన సూరి.. సంస్కృతీ మెతుకును , సంస్కృత సాహిత్యపు ఓగిరాన్ని కలిపి అన్నప్రాసనగా పెట్టిన మహానుభావుడు. తెలంగాణ సాహితీ వైభవాన్ని ఖండంతరాలు దాటించిన మొనగాడు. వ్యాఖ్యానం అంటే మల్లినాధ సూరి.. మల్లినాథ సూరి అంటే వ్యాఖ్యానం అన్నంతగా పర్యాయపదం మారిపోయింది. ఆయన పదవాక్య పారాయణుడు. మహా మహోపాధ్యాయుడు. సూరి వ్యాఖ్యలో విశిష్టత వుంటుంది. అందులో తర్కం.. వ్యాకరణం.. న్యాయం కలగలిసి వుంటాయి. సూరిది హృదయోల్లాస వ్యాఖ్య. మూల గ్రంధానికి పూర్తి న్యాయంచేయడం మల్లినాథుడి ప్రత్యేకత. కాళిదాసు కవిత్వం కొంత.. సొంతపైత్యం కొంత అన్నట్టు ఉండదు. కవి హృదయాన్ని చక్కగా ఆవిష్కరిస్తాడు. లయకు స్థానం కల్పిస్తాడు. కాళిదాసు..  మాఘుడు.. భారవి.. శ్రీహర్షుడు రాసిన ఎన్నో కావ్యాలకు సూరి వ్యాఖ్యానం రాయకపోతే మనకు తెలిసేదే కాదంటే అతిశయోక్తికాదు. 
 ఇవికాక జ్యోతిష్య గ్రంథం, రఘువీర చరితం, వైశ్యవంశ సుధార్ణవము వంటి రచనలు చేశాడు. మెదక్ జిల్లా పలుకుబడికి, సాహిత్య సంస్కృతికి అద్దం పట్టినవాడు. 14 వ శతాబ్దం ఉత్తరార్ధానికి చెందిన మల్లినాథుడు కాకతీయ రాజుల ఆదరణతో ఓరుగల్లుకు చేరాడు. ప్రతాపరుద్రుడి ఆస్థాన కవిగా వెలుగొందాడు. వ్యాఖ్యాతృ చక్రవర్తిగా మహారాజు ఆస్థానాన్ని అలంకరించిన విద్యానాథుడు. శతావధాని. ఆయన చేతుల మీదుగా కనకాభిషేకం పొందిన గొప్పవ్యక్తి. తనది సౌజన్య జన్యమైన విదుషీత్వం అని నిగర్వంగా చెప్పుకొన్న మల్లినాథుడు దాదాపు తొంభై ఏళ్ళు జీవించాడు. జీవిత చరమాంకంలో కళ్ళు తెరిచే ఓపిక లేకపోతే కిందిరెప్పకు తాడుకట్టుకుని,  పై రెప్పకుకూడా తలపైనుంచి ఇంకో తాడు కట్టుకుని దీపంముందు కూచుని కావ్యాలు చదువుతూ వ్యాఖ్యానాలు రాశాడని చరిత్ర చెప్తున్నది. ఆయన రాసిన పంచకావ్యాల మీద ఎందరో పీహెచ్‌డీ చేశారు. జీవితమంతా సాహిత్యానికే అంకితం చేసిన మల్లినాథ సూరి తన పేరుకే సార్ధకత తెచ్చిన ధన్య జీవి. సూరి తండ్రి కపర్ది పండితుడు. యజుర్వేద శాఖకు భాష్యాలు రాసి ప్రఖ్యాత  పండితుడిగా వెలుగొందాడు. సూరి విద్యా సంపన్నకుటుంబంలో పుట్టినప్పటికీ పదహారేండ్లు వచ్చేదాకా గానీ అక్షరం నేర్వలేదు. సోమరిపోతు. అల్లరి చిల్లరగా తిరిగేవాడు. అయితే ఒకసారి కోలాచలం దగ్గర్లో ఉన్న తిరుమలాయగుట్టకు ఒక సాధువు  వచ్చిండు. అతనికి అనుకోకుండా మల్లినాథుడు సేవ చేశాడు. అందుకు ఆ గురువు సూరికి సారస్వత మంత్రోపదేశం చేశాడట. అంతే.. సూరి మహా పండితుడిగా వెలుగొందాడు. కొంతకాలం వన దుర్గా క్షేత్రంలో కూడా తపస్సు చేశాడని గరుడగంగ మహత్యంలో ఉంది. తర్వాత కొద్దిరోజులు కాశీకి వెళ్లి గురు సేవ చేశాడు. అక్కడ్నే చాలా కాలం గడిపాడు. పేద వారికి సేవచేయాలని సొంతూరు కొల్చారం వచ్చాడు. ఇక్కడో పాఠశాల నెలకొల్పి పేద విద్యార్ధులకు పాఠాలు నేర్పాలని సంకల్పించాడు. సూరి 1350 -1440 వరకు జీవించి ఉన్నట్టు అతని గ్రంధాల వల్ల తెలుస్తున్నది.  

 తెలంగాణ ఆత్మగౌరవానికి సాహితీ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలబడ్డ.. మల్లినాథ సూరి పేరిట కాశీలో విద్యాపీఠం కూడా ఉంది. అంతర్జాతీయంగా ఒక వెలుగు వెలిగిన ఈ తెలంగాణ కవి పుంగవుడి చరిత్ర మీద వలస పాలకులు మన్నుగప్పారు. మెదక్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ కొల్చారం కోలాచలం మల్లినాధసూరి ఇంటిపేరుతో ప్రసిద్ధికెక్కింది. ఈ వ్యాఖ్యన చక్రవర్తి  చరిత్ర మాత్రం మండలం దాటి ఎవరికీ తెలియదంటే ఆశ్చర్యం కలగకమానదు. తెలంగాణకీర్తిని దశదిశలా చాటిన సూరి స్మృతి చిహ్నాలను ఏర్పాటు చేయడానికి వలస ప్రభుత్వాలకు మనసు రావడం లేదు. అ మహనీయుడు నడయాడిన ఇల్లు ఇప్పుడొక గొడ్లపాకలా మారింది. మొండిగోడలతో బావురుమంటోంది.  


అ మహనీయుడికి ఎక్కడో ఉత్తరాన ఉన్న కాశీ క్షేత్రంలో దక్కిన మర్యాదలో కనీసం ఒక వంతు కూడా  మనకాడ దక్కడం లేదంటే తెలంగాణ చరిత్రమీద సీమాంధ్ర పాలకులు ఎంత వివక్ష చూపుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. దేశంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో మల్లినాధ సూరిపేర గ్రంధాలు పాఠ్యాంశాలుగా మారినా.. ఆయన జన్మస్ధలం కొల్చారంలో మాత్రం చిన్న స్మారక స్థూపానికి కూడా నోచుకోలేదు. తెలంగాణకు సంబంధం లేని.. తెలంగాణ సంస్కృతికి ఏమాత్రం ముడిపెట్టలేని వారి విగ్రహాలు ట్యాంక్ బండ్ వెలుస్తాయి కానీ.. అంతర్జాతీయంగా కొనియాడబడ్డ మల్లినాధుడి విగ్రహం మాత్రం కనిపించదు. వ్యాఖ్యన చక్రవర్తిగా పేరు ఒక వెలగు వెలిగిన ఈ సత్కవి ట్యాంక్ బండ్ పై ఉండటడానికి అర్హుడు కాడా?  
                                               
(కొంత సేకరించిన సమాచారంతో...)




  

5 comments:

  1. మల్లినాథ సూరి గారి గురించి మా మాష్టారు చెప్పగా విన్నాను. సారఙ్గ అనే శబ్దానికి లేడి (సారం శీఘ్రం గచ్ఛతీతి సారఙ్గః), ఏనుగు (సారమఙ్గం యస్యాసౌ సారఙ్గః), చాతకం (సారం సలిలం గచ్ఛతీతి సారఙ్గః) మరియు తుమ్మెద (సారం మధురం గాయతీతి సారఙ్గః) అని ఎన్నో రకాలుగా వ్యుత్పత్తులు చెప్పేవారు అని. చరమాంకంలో, కళ్ళు తెరవలేని స్థితిలో కూడా వ్యాఖ్యానాలు చేశారు అంటేనే ఆయనకి సాహిత్యం మీద ఉన్న మక్కువ తెలుస్తోంది! ఒక మహా పండితుని గురించి మీ ఈ టపా ద్వారా మరింత తెలుసుకున్నాను. ధన్యవాదాలు!

    ReplyDelete
  2. అబ్బో నాకంటే మీకే బాగా తెలుసు. మల్లినాథ సూరి ముని ముని ముని ... (ఇలా చాలా మునుల తర్వాత )మనవడు (వరుసకు) నా కొలిగ్. అలా ఆయన గురించి ఇంకాస్త తెలుసుకునే అవకాశం కలిగింది.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. మేఘసందేశ కావ్యమునకు మల్లినాథ సూరి చేసిన వ్యాఖ్యను వినుటకు క్రింది లింకును కాపీ చేసి కొత్త విండోలో తెరవండి


    http://www.vedabhoomi.org/MeghaSandesha.html

    ReplyDelete
  5. చక్కని సమాచారం. అవును. మల్లినాథ సూరి వారికి, కొల్చారానికి ప్రాచుర్యం లభించాలి. ప్రభుత్వమే అందుకు పూనుకోవాలి.

    ReplyDelete