కరెంటు అవసరం లేకుండానే మోట
బావితో ఎకరాలకెకరాలు సాగు చేసి, పుట్లకొద్దీ పంట తీసిన గతం మనది. రెండెడ్లు మోట
తోలితే మోట బొక్కెన నిండా నీళ్లు బైటికొచ్చి తొండం నుంచి జలజలా పారేది.
కరెంటు రంది లేదు. కోతల భయం లేదు. బిల్లుల బాధ లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా
కరెంటు మోటార్లే. బొక్కెన, తొండం మూలన పడ్డాయి.
వడ్రంగి చెక్కిన నాగళ్లు పొలాలల్ల
కలిసి నడిచేవి. నాగలి భూమిని మెత్తగ చేస్తే, బురద గొర్రు భూమిని అదునుగా మారిస్తే,
అచ్చు మొద్దు బాట సూపితే, విత్తనం గొర్రు ముందు నడిచేది. జడిగం విత్తనమేసేది. ఎడ్ల
భుజాలపై కాడి, రైతు చేతిలో నాగలి. వ్యవసాయం హాయిగా సాగేది. ఇప్పుడు అన్ని పనులు
యంత్రాలే చేయాలి. అప్పడు నాగలితో దున్నితే నేల దువ్వెనతో దువ్విన తలలా ఉండేది. కానీ
ఇప్పుడు ట్రాక్టర్లతో దున్నితే కడుపులో కత్తులు దిగినట్లు, పేగులు బయట పడ్డట్టు
నేల తల్లి విలవిల్లాడుతోంది.
ఎడ్లు, బర్లు అడవిల పోతే వాటిని
గుర్తు పట్టడానికి బుడిగెలు, గజ్జలు కట్టేవారు. ఇప్పుడా పదాలు కూడా ఎవరికి
తెలియదు. ఊళ్లో ఏ పటేల్ కో, పట్వారికో, దొరకో మాత్రమే సవ్వారి కచ్చరం బండి ఉండేది.
రైతులందరికీ ఎడ్ల బండి ఉండేది. ఎక్కడికి పోవాల్నన్నాబండ్లళ్లనే కుటుంబమంతా పోయేది.
పైస ఖర్చు లేదు. డీజిల్, పెట్రోల్ బాధ లేదు.
బండి తయారు చేయాలన్నా, నాగలికి
రూపం ఇవ్వాలన్నాఊళ్లెనే వడ్రంగి చేసేది. రంపం, బాడిష, దూగడ టకటకమని ఆడేది.
చేతినిండా పనుండేది. ఇప్పుడా పరికరాలన్నీ లేవు. అవి కూడా మ్యూజియంలోనే
చూసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. వడ్రంగి అవసరం లేకపోవడంతో ఊరి జనంతో బంధం కూడా
తెగిపోయింది.
మంచి నీళ్లు తాగాల్నన్నా, అన్నం
తినాల్నన్నా, పాయసం నోట్లేసుకోవాల్నన్నా అన్నీ మట్టి ముంతలల్లనే. దేవునికి దీపం
పెట్టాల్నన్నా కుమ్మరోళ్ల ప్రమిదల్నే. పెండ్లికైనా, సావుకైనా కుమ్మరి కుండలే. వాళ్లు
చేసిన వస్తువు లేని ఇల్లు లేకుండేది. ఇప్పుడా మట్టి పాత్రలన్నీ మట్టి
గొట్టుకుపోతున్నయి. కుమ్మరి వృత్తి కూలిపోయింది.
లెదర్ చెప్పులట. వేలకు వేలు
తగలేసి కొనుక్కుంటాం. కానీ అందులో లెదర్ పర్సంటేజ్ సగం కూడా ఉండదు. కానీ ఒకప్పుడు గ్రామీణ
ప్రాంతాల్లో గతంలో వందకు వందశాతం లెదర్ చెప్పులే వేసుకున్నారు. ఒక్కసారి కొంటే ఓ
రెండు మూడేండ్ల దాకా మన్నేవి. దొర నుంచి
పేద వరకు అందరూ అవే చెప్పులు కొనేటోళ్లు. కానీ ఇప్పుడు మాదిగ చెప్పులు అడిగెటోడు
లేడు.
ఊరందరికీ గడ్డాలు, సవరాలు చేసే
మంగలి పనిముట్లు కూడా ఇప్పుడు పాతబడ్డయి. కొత్త కొత్త లేజర్లొచ్చి మంగళి కత్తిని మటాష్
చేసినయ్. ఇల్లిల్లు తిరిగి సవురం చేసే పద్దతిపోయింది. సానరాయి లేదు. ఆకురాయి లేదు.
కరెంటుతో నడిచే కటింగ్ పరికరాలు, ఏసీ సెలూన్లు!!
గొల్ల గొంగడి, మంచినీళ్ల తిత్తి,
చేతి కర్ర, తోలు సంచి అన్ని మాయం. ఇంకా కొద్దో గొప్పో మిగిలున్నదంటే గౌండ్ల పనే.
మోకు, ముస్తాదుకు ఇంకా నూకలు చెల్లలేదు. ఇప్పటి ఈ తరం పిల్లలెవరూ తాళ్లెక్కుడు
నేర్చుకుంటలేరు! కాబట్టి ఇంకో ఇరవై ఏండ్లకు ఈ వృత్తి కూడా పక్కాగా ఉండదు. చేనేత మగ్గం కూడా చిన్నబోతోంది.
రెడిమేడ్ ఫాషన్ మోజుల నేత పని నాదాన్ అయిది. పింజరు, మగ్గం మూలన పడ్డది. పశువులకు మందు పోసే మందు గొట్టాలు
కూడా ఇప్పుడు కనబడ్తలేవు. కత్తులు, కటార్లు, పిస్తోళ్లు, నాటు తుపాకులు,
చేతికర్రలాగానే ఉండే రహస్య కత్తులు అన్నింటికి ఊళ్లెనే తయారు చేసింది. అవేవి
ఇప్పుడు లేవు. ఇవి తయారు చేయడానికి కూడా ఫ్యాక్టరీలు వచ్చాయి. రాతి చిప్పలు, అట్ల
పెనాలు, మట్టిపొయ్యిలు, ఇసుర్రాయిలు, కర్ర రోళ్లు, కంచరోళ్లు ఇనుముతో తయారు చేసిన
మామిడి పిందె తాళాలు. అవేమీ ఇప్పుడు కనబడతలేవు.
గ్రామీణ జీవనంలో వ్యవసాయం నుంచి
వంట వరకు వాడిన వస్తువులన్నీ ప్రకృతి
నుంచి వచ్చినవే. మానవ శ్రమే తప్ప యంత్రాల అవసరం లేకుండా తయారైనవే. ఒక వృత్తి మరో
వృత్తి పై ఆధారపడేది. అంటే ఒక మనిషి మనుగడ మరో మనిషి చేయూత లేకుండా సాధ్యం అయ్యేది
కాదు. అన్నింటికి ప్రకృతి అండగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రకృతి నుంచి తీసుకోవాల్సిన
వస్తువులను మార్కెట్ నుంచి పొందాల్సిన దుస్థితి రావడం మానవ సంబంధాలను
దెబ్బతీసిందంటున్నారు వరంగల్లోని గిరిజన విజ్జాన పీఠం అధిపతి భట్టు రమేష్.
తాళపత్ర గ్రంధాలు ఎప్పుడో
అంతరించాయి. వాటి ఊసే ఇప్పుడు లేదు. టైప్
మిషన్లు, పెద్ద రేడియోలు, గ్రామ్ ఫోన్ రికార్డులు కూడా మ్యూజియం వస్తువులయ్యాయి.
కంప్యూటర్, సెల్ ఫోన్ గేమ్స్ వచ్చాక ఈ ఆటలు మ్యూజియంలో ప్రదర్శించాల్సి వస్తోంది.
పచ్చీస్, ఓనగుంటల ఊసే లేదు. తరతరాలు మన్నే చల్ల కవ్వం, రోకళ్ళు, కుందెనలు, తెడ్లు,
బొట్టు పెట్టెలు, అద్దం ఆల్మరాలు ఏవీ కనిపించడం లేదు. ఆధునికత పేర అన్నింటికీ బొంద
పెట్టాం. కనీసం బియ్యం, వడ్లు దాచుకునే గాబులు కూడా లేవిప్పుడు. వడ్లు కొలిచే
సోలలు, కుంచాలు అంటే ఏంటో ఇప్పటి తరానికి కొత్తగా చెప్పాలి. వస్తు మార్పిడీ
విధానమే తప్ప మార్కెట్ లేకపోవడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా స్వయం సమృద్ధిగా
ఉండేది. ఏ కులవృత్తికీ లోటు రాకుండా ఉండేది. ఒక్కో కులం ఒక్కో పని చేసేది కాబట్టి
జీవన వైవిధ్యం కనిపించేది. కానీ అవన్నీ కూలిపోయిన తర్వాత వైవిధ్యం కరువైంది.
అప్పట్లో పెండ్లి ఊరేగింపులకు
పల్లకి ఉండేది. చివరికి శవాన్ని మోసుకుపోవడానికి కూడా పాడె ఉండేది. కానీ
ఇప్పుడన్నింటికి వాహనాలే. చీకటయిందంటే ప్రతీ ఇంట్లో కానుగ నూనెతో వెలిగే లాంతరు
వెలిగేలి. ఇప్పుడంతా నియోన్ బుగ్గల వెలుగు జిలుగులు. జౌజ, జమిడిక, తుడుం, డప్పు,
కిద్ది, తబలా, ఒగ్గుడోలు, చిడతలు, హార్మోనియం అన్నీ అటకమీద నుంచి కాలగర్భంలో
కలిసిపోయాయి. ఇప్పుడు అవే శబ్దాలను కంప్యూటర్ కీ బోర్డు ద్వారా వినాల్సిన
దౌర్భాగ్యం. ఆధునికత మోజులో సహజత్వం పోతోంది. బూరలు, కల్లు గొట్టాలు, తాటాకు
బుట్టలు.. ఒకటేమిటి గ్రామీణ ప్రాంతంలో గతంలో వాడిన వస్తువులేవీ ఇప్పుడు మనకు లేవు.
మనం ఉత్పత్తి చేసుకోదగ్గ వస్తువులను కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ప్రకృతిని
కాపాడుకుంటూ, మానవ సంబంధాలను నిర్మించుకుంటూ సాగిన ఉత్పత్తి ప్రక్రియ గ్రామీణ
ప్రాంతాల్లో ఆగిపోవడం సకల దరిద్రాలకు కారణం.
(మిత్రుడు విజయ్ కుమార్
సౌజన్యంతో!!)
nice post andi baavundi
ReplyDeleteథాంక్సండీ!!!
ReplyDelete