Sunday, 25 November 2012

మీ డాన్సులు తగలెట్టా!!



టీవీలో కెవ్వు కేక పాట వస్తుంటే మాటలు కూడా సరిగారాని మీ పాప ఎగిరి గంతులేస్తోందా? గబ్బర్ సింగ్ సాంగ్ వస్తుంటే మీ బాబు డొమ్మరి గడ్డలేస్తున్నాడా? మీరు వాళ్ల టాలెంట్‌ చూసి మురిసిపోతున్నారా? ఎలాగైనా పిల్లల్ని రియాలిటీ షోలో చూడాలని తహతహలాడుతున్నారా? సరిగ్గా ఇక్కడే మీరు తప్పులో కాలేస్తున్నారు. చూడ్డానికి సాదాసీదాగా కనిపిస్తున్న ఈ సరదా, గతం పునాదులు తవ్వేసి, భవిష్యత్తును చిదిమేస్తుందంటే నమ్మశక్యంగా ఉండదు.
ఒక పాపకు ఆరేళ్ళుంటాయి. ఆమె డాన్స్‌ ఆడుతుంటే హీరోయిన్‌ కూడా బలాదూర్‌. ముఖ్యంగా సెక్సప్పీల్ పలికించడంలో దిట్ట. ఆ చిన్నపిల్ల అలా బీభత్సంగా ఎగురుతుంటే స్టేజ్ కి ఎదురుగా వాళ్ళ అమ్మ ఆహా ఓహో అని చప్పట్లు కొట్టింది. ఇంకోపాప ఏడేళ్లుంటుంది. రింగరింగా పాటకు నడుం తిప్పుతూ హొయలు పోయింది. అది చూసి వాళ్లనాన్న తెగ ముచ్చటపడ్డాడు. ప్రస్తుతం రియాలిటీ షోల పేరుతో పసిపిల్లల మెదళ్లలో నాటుతున్న విషపు విత్తనాలు ఇవే! తల్లి తండ్రులకే అది తప్పు అని తెలియనప్పుడు పిల్లలకి ఏం తెలుస్తుంది?    
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటూ పలికే ఆ లేత పెదవులు... కెవ్వు కేక నా ఈడంత..  అంటూ లౌడ్ స్పీకర్లవుతున్నాయి. చిట్టి చిలకమ్మా- అమ్మ కొట్టిందా అనే చిట్టిపొట్టి పాటలు పాడే పసిమొగ్గలు.... డియ్యాలో డియ్యాలో అంటూ డించక్‌ డించక్‌ ఊగిపోతున్నారు. చుక్ చుక్ బండీ వస్తుంది. పక్కపక్కకు జరగండి అని బృందగీతం ఆలపించే చంటిపిల్లలు... నే చుక్ చుక్ బండినిరో అంటూ వగలు పోతూ చంకలు గుద్దుకుంటున్నారు. స్కూల్ డే అంటే చాలు ఒకరు దేశనాయకుడిగా... మరొకరు సైనికుడిగా... ఇంకొకరు భరతమాతగా వేషధారణ చేసుకుని పోటీపడేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఒకరు షీలాకీ జవాని, ఇంకొకరు గబ్బర్ సింగ్. రింగరింగా.. ఆడ్రాండ్ర నాక్కముక!
 డాన్సంటే నడుం తిప్పడం.. సెక్సీ హావభావాలు పలికించడం ఒక్కటేనా? డాన్సంటే జుగుప్సాకరమైన డ్రస్సులతో స్టేజీమీద గెంతడం ఒక్కటేనా? వాళ్ల కుప్పిగంతుల్ని చూసి మనం చంకలు గుద్దుకుంటే తర్వాత జరిగేదేంటి? మానసిక వికాసాసానికి డాన్స్‌ ఒక మంచి ఔషధం. కానీ అది మానసిక వికారం కాకుండా ఉన్నప్పుడే కళకు సార్ధకత.

2 comments: