Wednesday, 28 November 2012

సంగీత సాహిత్య సమలంకృతుడు.....


ఏడు భాషా ప్రవాహాలకు ఏతమెత్తిన వాడు!అలుపెరుగని అక్షర సైన్యాధ్యక్షుడు! సంగీత సాహిత్య సమలంకృతుడు!స్వరరాగ పదయోగ సమ భూషితుడు! సంగీత కళామాతల్లుల నిత్యార్చకుడు!   తెలంగాణ సాహితీ మాగాణంలో మేరునగధీరుడు!! సామల సదాశివుడు. ఇప్పుడా తెలంగాణ సాహితీ మొగురం కూలిపోయింది. సంగీత సాహిత్యరంగాలకు ఎనలేని కృషి చేసిన అక్షరయోధుడు.

అతని కలం నుండి అక్షరాల నది ప్రవహిస్తుంది. అతని గళం నుండి భాష ఏడు వర్ణాల సింగిడై విరబూస్తుంది. అతని పాఠాల జడిలో జ్ఞానం వేయి రేకుల వసంతమై చిగురిస్తుంది. అడవి బిడ్డల అమ్మఒడి ఆదిలాబాద్‌ నుదుటన సిందూరమై వెలిగిన ధృవతార.  అరవయేండ్లకు పైగా సాహిత్యానికే ధారపోసిన అక్షర దళపతి. ఆదిలాబాద్‌కు రెండు సరస్వతులు. అందులో ఒకరు బాసర సరస్వతి అయితే, మరొకటి పురుషుడి రూపంలో ఉన్న సామల సదాశివుడు. తెలంగాణ మాగాణంలో నిరంతర సాహితీ సేద్యం చేసిన హలికుడు. ఆయన అక్షర కోవెల. సంగీతాన్ని సాహిత్యాన్ని కలిపి మంగళ ప్రదమైన స్థానానికి తీసికెళ్లిన స్వరకోకిల. పంచెకట్టు, లాల్చిలో మేరునగధీరుడిగా ఉండే సదాశివ మాస్టర్ సాహితీవనంలో పరిచయం అక్కరలేని ప్రతిభాశాలి.

తొలితరం తెలంగాణ సాహిత్యకారుల్లో సదాశివది శాశ్వత చిరునామా. కవిగా మొదలయి, అనువాదకునిగా మారి, విమర్శకునిగా సరికొత్త విషయాలకు ఊపిరిపోసి భాషల మధ్య సయోధ్య కోసం వారధిని నిర్మించిన మహాశిఖరం. అతని సాహిత్య సేవకు అరుదైన గౌరవాలు అందివచ్చాయి. యూనివర్సిటీల నుంచి ఢిల్లీ ఎర్రకోట దాకా అవార్డులు అతని సాహిత్య సేవకు సలాం చేస్తూ క్యూకట్టాయి. ఎల్లలు లేని సంగీతానికి, సరికొత్త సొబగులు అద్దిన సాహితీయోధుడు. ఒక్కమాటలో చెప్పలాంటే తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక నిలువెత్తు సంతకం సదాశివుడు.

ఆదిలాబాద్‌ జిల్లా తెనుగు పల్లెలో 1928లో జన్మించిన సదాశివ మాస్టారు తండ్రి నాగయ్య. తల్లి చిన్నమ్మ. జిల్లాలోనే విధ్యాబ్యాసం పూర్తి చేశారు. ఎంఎ.,బీఈడీ., డీలిట్ చదివాడు. కాగజ్ నగర్ లో ఉపాధ్యాయ వృత్తిలో చేరి భద్రాచాలంలో ప్రిన్సిపాల్ గా పదవీవిరమణ చేశారు. బోధించింది హిందీ సబ్జెక్టే అయిన తేనేలూరే తెలంగాణ భాష మీద ఆకాశమంత ప్రేమ. ఒక్క కవిత్వమే కాదు, చిత్రలేఖనంతో పాటు, సంగీత, సాహిత్య, సాంస్కృత రంగాల్లో సదాశివ గారిది అందెవేసిన చెయ్యి. ఈ విలక్షణమైన నేపథ్యమే సదాశివ గారి స్థానాన్ని ఇటు సాహిత్యంలోనూ, అటు సంగీతంలోనూ హిమాలయాలంత ఎత్తున నిలబెట్టాయి. సదాశివ గారి విద్యాభ్యాసం నిజాం ఏలిన తెలంగాణాలో జరిగింది. కాబట్టి చదివింది ఉర్దూ మాధ్యమం. ఇవి కాక మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వల్ల మరాఠీ భాష అబ్బింది. ఈ బహుభాషా ప్రావీణ్యమే సదాశివగారు రెండు వారధులు నిర్మించేందుకు కారణమయింది. ఒకటి రూమీ మస్నవీకి  తెలుగులో అంజద్ రుబాయీలకు. ఇంకొకటి సియాసత్ ఉర్దూ పాఠకులకు. కవిగా, రచయితగా పేరున్నా, సంగీతంలో అభినివేశం ఉన్నా.. చిత్రలేఖనం తెలిసినా తనను తాను బడిపంతులుగా గుర్తింపు పొందడానికే ఇష్టపడతారు. చదువు చెప్పడం నా స్వభావం. మిగిలినవన్నీ వ్యాపకాలేనంటారాయన.

కాంచనమాల అందగత్తె కాదు. మంచిగ పాడుతుండె అని శ్రీశ్రీని నిర్భయంగా విమర్శించిన వాడు. తెలుగు వారందరూ కేవలం కళ్లకు పని చెప్పిన వేళ చెవులకూ పని చెప్పిన కవి సదాశివ. ఆయన స్వగ్రామం తెనుగుపల్లె వింధ్యకు దక్షిణాన తొలి గ్రామం. తెలుగువారికి చివరి ఉత్తరగ్రామం. వినే చెవిని అన్వేషిస్తూ సంగీతం వాయు మార్గంలో ప్రయాణిస్తుందిట. అలా ఉత్తరం నుంచి హిందుస్తానీ, దక్షిణం నుంచి కర్ణాటక సంగీతం సదాశివలో సంగమించాయి. ఆ ఆనంద పారవశ్యాన్ని ఆయన అనుభవించి పలవరించకుండా ఉండలేకపోయారు. అందుకే భవిష్యత్ తరాలకు తరిగిపోని సంగీత సారస్వత సంపదను కానుకగా ఇచ్చారు.

సదాశివ మాస్టారు ఏడు భాషాప్రవాహాలకు ఏతమెత్తిన వాడు! తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, పార్సీ, మరాఠీ.  ప్రభాతము, నిరీక్షణము, మంచి మాటలు, ఆర్తి, సాంబశివ శతకము తదితర పద్యసాహిత్యాన్ని సృష్టించినా అవి మనకు దొరకవు. తర్వాత కాలంలో ఆయన పద్యాల జోలికి, కవిత్వం జోలికి పోలేదు. కారణం.. తెలుగునాట పద్యాలు, కవిత్వాలు రాసేవారు చాలామంది పుట్టుకొచ్చారు. మరాఠీ, పార్సీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్‌తోపాటు సంగీతమూ తెలిసిన ఒకే ఒక్కడు సదాశివ. వాటిని తెలుగు సాహిత్యానికి వాటిని పరిచయం చేయమని సురవరం ప్రతాపరెడ్డి సూచించారు. ఆయన ఆదేశాన్ని పాటించి అమ్జద్ రుబాయిలు, మౌలానా రూమీ మస్నవి, మీర్జా గాలిబ్ జీవితమూ - రచనలూ, ఉర్దూ కవుల కవితా సామగ్రి, పార్సీ కవుల ప్రసక్తి, ఉర్దూ భాషా కవితా సౌందర్యం తదితర అపూర్వ రచనలు ప్రసాదించారు. అలాగే విశ్వనాథ కవిత్వాన్ని ఉర్దూకు పరిచయం చేసిన సౌజన్యమూర్తి .

బతుకులో సంగీతం ఉండాలి! ఇదే సదాశివ మాస్టారు సూత్రం. తెనుగుపల్లెలో వేళ్లూనుకున్న సదాశివ జీవనవృక్షం అన్ని ప్రాంతాలకూ పచ్చదనాన్ని పంచింది. పండిత్ జస్రాజ్, గంగూబాయ్ హంగల్, భీమ్‌సేన్ జోషీ తదితర హిందూస్తానీ సంగీత శిఖరాల కచేరీలను నాగపూర్ వెళ్లి విని.. ఆ ఘరానాలను మనకి పరిచయం చేశారు. అందరూ సంగీతాభిలాషను పెంచుకోవాలని కోరుకునేవాడు. అందుకు సరిపడా సాహిత్యాన్ని సదాశివ అందించారు. ఉర్దూ వల్ల ప్రభావితమైనా, తెలంగాణ ప్రాంత జీవితంలో సంగీతం ఉందికానీ.. ఇంగ్లిష్ వల్ల ప్రభావితమయినా, ఆంధ్ర ప్రాంతంలో మాత్రం సంగీతం లోపిం చిందనేవారు. సాహితీ జగత్తుకే మణిదీపమైన డాక్టర్ సామల సదాశివ అవార్డుల సిగలో చేరని నగ అంటూ లేదు. 1963 నుంచి 1983 వరకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉర్దూ సలహా సంఘం సభ్యులుగా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులుగా పని చేశారు. ఆయన చేసిన అంజత్ రుబాయిలు అనువాదానికి 1964లో రాష్ర్ట ప్రభుత్వం ఉత్తమ అనువాద రచనగా గుర్తించింది. 1994లో తెలుగు యూనివర్శిటీ నుంచి ప్రతిభా పురస్కారం, 2002లో కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, 2006లో ప్రతిభా రాజీవ పురస్కారం దక్కాయి.  బహుభాషా సుమ పరిమళాలు, సుస్వరాలతో సంగీత కళామా తల్లులను అర్చించిన ఆలుపెరగని అక్షరసేనానికి 2011, డిసెంబర్ 21న అరుదైన కేంద్ర సాహితీ పురస్కారం లభించింది!

భాష ఏదైనా భావస్ఫూరకమే పరమావధిగా ప్రజ్ఞచూపి పరవశింపజేసిన మన సామల ఆదిలాబాద్ జిల్లాకే కాదు తెలంగాణ మాగాణానికి గర్వకారణం. ఉర్దూలో మూడు వందలకుపైగా , తెలుగులో 450 వరకు వ్యాసాలు రాసిన అయన కలం పత్రికా పాటకులకు సైతం సాహితీ పరిమళాలను పంచింది. ఆయన నిత్య విద్యార్ధే కాదు. నిత్య చైతన్యమూర్తి. పురస్కారాలతో పొంగిపోలేదు. రానిరోజు కుంగిపోలేదు. తెలంగాణా సాహితీ మాగాణంలో కాళోజికి సరిజోడు. యాది తో సాహితివనములో చెరగని సంతకం చేసిన ఆయన సంగీత ప్రజ్ఞుకు అవధులు లేవు. సదా గుర్తుండే సామల శివుడు. సంగీతం, చ్రిత్రలేఖనాల్లో సైతం తనదైన ముద్ర వేశారు.  సరస్వతిని సంగీత-సాహిత్య సమలంకృతిగా అభివర్ణిస్తారు. అలా సాధికారంగా ప్రకటించగల ఒకే ఒక్క ప్రతిభావంతుడు సదాశివ. తెలుగు, ఉర్దూ భాషలలో దాదాపు ఏడువందలకు పైగా వ్యాసాలు రాశారు. రెండు ఖండ కావ్యాలు, ఒక నవలిక రాశారు. మొదట్లో పద్యాలూ, కథానికలూ, నవలలూ రాసినారు. కానీ సురవరం ప్రతాపరెడ్డిగారి సలహాతో ఫారసీ, ఉర్దూ సాహిత్యాల గురించి తెలుగులో గ్రంథాలూ, వ్యాసాలూ రాశారు. దాంతోపాటు హిందుస్తానీ సంగీతం, సంగీత విద్వాంసుల గురించి కూడా. హిందీ, సంస్కృతాంధ్ర సాహిత్యాల మీద ఆయనకున్న పట్టు అనన్య సామాన్యమైనది. వందల పద్యాలు నాలుక మీదుంటాయి. సందర్భానుసారం ఓ పద్యాన్నో, ఉర్దూ షేర్‌నో తప్పనిసరిగా ఉదహరిస్తారు. చాలాకాలం పాటు సదాశివ లేకుండా ఒక్క సాహిత్య సభ కూడా జరగలేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ కవులంతా ఆయన్ని బాపు అని పిలిచేవారు.

ఎంత సంక్లిష్ట విషయాన్నైనా సుక సుకాన అర్ధమయేలా చెప్పే ఆ శైలిని అమాంతం మోహించేయాలనిపిస్తుంది. మాస్టారి ముచ్చట్లు చదువుతుంటే సంగీతం గురించి, అందునా హిందుస్తానీ గురించి ఇంత అందంగా చెప్పొచ్చా.. ఇంత సొంపుగా రాయొచ్చా అన్న నిషా కలుగుతుంది. ఒక తవాయఫ్ గోహర్జాన్ రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గుడ్డిగవ్వకు దిగజార్చిన వైనంతో మొదలుపెట్టి..  క్రమక్రమంగా చిన్నచిన్న ఘటనలు చెప్పుకుంటూ వచ్చి హిందుస్తానీ కళాకారుల జీవితాల్లోని ఘట్టాలను మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తారు. అలా ఎందరో హిందుస్తానీ విద్వాంసుల జీవితాల్లోని అపురూప ఘట్టాలను జలతారు జరీ పనితనంతో అల్లుకుంటూ వచ్చిన సదాశివ మాస్టారు అక్కడితో ఆగిపోలేదు. హిందుస్తానీ సంగీతం ఆవిర్భవించిన క్రమం, హిందుస్తానీ కర్ణాటకల భేద సామ్యాలు, సొగసరి గజళ్ళ రచనా విధానం, సూఫీ తత్వం వంటి మరెన్నో సంగతులనూ సందర్భానుసారం చెబుతారు. ఆదిలాబాదు అడవులంత సతతహరితమైన ఆయన వాక్ చిత్రాలు చదవుతుంటే మలయ మారుతాల్లో తేలినట్టు ఉంటుంది. 

(చాలాభాగం సేకరించిందే..)

No comments:

Post a Comment