Saturday 24 November 2012

శివుడితో పెట్టుకుంటే మిగిలేది బూడిదే!


శివుడి మీద సినిమాలు తీస్తే వర్కవుట్‌  కావా? భక్త కన్నప్ప తర్వాత ఆ రేంజిలో హిట్టయిన దాఖలాలు లేవా? ఆపద్బాంధవుడు దగ్గర్నుంచి రీసెంట్ డమరుకం దాకా అన్నీ ఢమాలేనా? ఎందుకిలా జరుగుతోంది? సెంటిమెంట్‌కి పెద్ద పీట వేసే టాలీవుడ్‌లో శివుడి సెంటిమెంట్ ఎందుకు అర్ధం కావడం లేదు? దర్శక నిర్మాతలు ఈ లైన్‌ ఎందుకు మిస్సయ్యారు?

ఆ కాలంలో ఎలాంటి భక్తిరస చిత్రాలు తీసినా నడిచింది. రాముడైనా కృష్ణుడైనా జనం ఆదరించారు. ఆ తర్వాత్తర్వాత డివోషనల్ సినిమాలు పెద్దగా హిట్టుకు నోచుకోలేదు. ముఖ్యంగా భక్త కన్నప్ప తర్వాత శివుడి కాన్సెప్ట్‌ తో తీసిన సినిమాలన్నీ సరాసరి కైలాసానకే వెళ్లాయి!! శివుడు కనిపించినా.. శివలింగానికి  పూజలు చేసే సీన్లు కనిపించినా సినిమాలు మటాష్‌ అవుతున్నాయి.

కళాతపస్వి కే విశ్వనాథ్‌ తీసిన ఆపద్భాందవుడులో చిరంజీవి శివుడిగా కనిపిస్తాడు. కానీ ఎందుకో ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అఫ్‌కోర్స్ ఆ మూవీకి నంది వచ్చిందనుకోండి అది వేరే సంగతి!

ఇక అదే వరుసలో వచ్చిన సినిమా అంజి! ఇది కూడా మేజర్‌ డిజాస్టర్‌! ఎన్నో రోజులు కష్టపడి తీసినా సినిమా గంగలో కలిసింది. శివలింగం కాన్సెప్టుతో అద్భుతమైన గ్రాఫిక్స్‌, గొప్ప ఆర్ట్‌ వర్క్‌, అబ్బురపరిచే విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నా సినిమా భయంకరమైన పీడకలగా మిగిలింది.  

ఈ నెగెటివ్‌ సెంటిమెంట్‌కి మరో ఉదాహరణ శ్రీమంజునాథ! ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ శివుడి మీదే సాగింది. శంకరుడిగా చిరంజీవి, భక్తుడిగా అర్జున్‌ పోటీపడి నటించారు. మహాప్రాణదీపం పాట ప్రేక్షకుల్ని భక్తిపారవశ్యంలో ముంచింది. కానీ ఎటొచ్చీ సినిమానే అట్టర్‌ ఫ్లాపై కూర్చుంది.

మోహన్‌బాబు నటించిన రాయలసీమ రామన్న చౌదరి కూడా ఇలాంటి చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. పరుచూరి పవర్‌పుల్‌ డైలాగ్స్‌ దట్టించి సురేశ్‌ కృష్ణ డైరెక్షన్‌ లో మణిశర్మ మ్యూజిక్ తో వచ్చిన ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్. ఇందులో హీరో  శివుణ్ని తూలనాడటం.. భగవంతుడంటే నమ్మకం లేకపోవడంలాంటి సీన్లున్నాయి. అయితే ఆఖరికి తప్పు తెలుసుకుని శివలింగానికి పూజచేయటం  సినిమా క్లైమాక్స్‌. ఏదేమైనా గరళకంఠుణ్ని ఇందులో వాడుకున్నారు కాబట్టి దెబ్బడిపోయారు. 
ఇక ఈ మధ్య వచ్చిన ఖలేజా కూడా శివుడితో పెట్టుకుని లేవకుండా పడిపోయింది. మనిషి రూపంలో ఉన్న శంకరుడిగా మహేశ్‌ బాబు పెద్దగా ఎంటర్‌టైన్‌ చేయలేదు. పైగా ఇందులో సదాశివుడి మీద హిట్టు సాంగున్నా సినిమా అంతవరకే పరిమితమైంది.

ఇప్పుడు మరో ఎగ్జాంపుల్‌ డమరుకం. ఇదే ఫట్టే. శివుడు సాక్షాత్తూ హీరో ఫ్రెండ్‌. స్టోరీ లైన్‌ మొత్తం శివుడి మీదే సాగుతుంది. అంధకాసురుడు అనే అసురుడి సంహారం కోసం శివుడి ఆజ్ఞతో ముడిపడి ఉన్న ఈ సినిమా థియేటర్లో కుప్పకూలింది.

అసలు చెప్పాలంటే సినిమా రిలీజ్‌ కావటానికే పిల్లిమొగ్గలేసింది.  వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. బడ్జెట్‌ భీకరంగా పెరిగిన ఈ సినిమాకు.. నిర్మాత  20కోట్లు బాకీ పడ్డాడట. అవి క్లియర్‌ అయితే కానీ బాక్సులు బైటికి రావన్నారు. ఒకవేళ బయటకొచ్చినా సినిమా బడ్జెట్‌ 40 కోట్లు వసూలు చేస్తుందా లేదా అన్నది పెద్ద డౌటొచ్చిపడింది. అనుకున్నట్టే సినిమా చాప చుట్టేసిందని ఫిలింనగర్‌ టాక్‌.  




No comments:

Post a Comment