Thursday 22 November 2012

నన్ను బతికించండి ప్లీజ్‌...!!



నాపేరు శిరీష. మాది మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం మిరాసపల్లి! ఏడో తరగతి చదువుతున్నాను. నేను పుట్టిన కొద్ది రో్జులకే నాన్న చనిపోయాడు. రెండేళ్ల క్రితం అమ్మ కూడా నాయన దగ్గరికే పోయింది. మేం మొత్తం ముగ్గురం. అన్న పెండ్లి చేసుకుని పట్నంలో సెటిలయ్యాడు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు.  దిక్కులేని పక్షుల్లా ఓ ఇంట్లో ఉంటున్నాం. మా అక్కకీ చదువుకోవాలని ఉంది. కానీ ఎలా? అందుకే తను కూలికి వెళ్తూ నన్ను చదివిస్తోంది. ఇన్ని కష్టాల్లో బతుకున్న మాపై దేవుడికి ఇసుమంతైనా జాలి చూపించలేదు. ఉన్నట్టుండి నేనొకసారి కుప్పకూలిపోయాను. రుక్కమ్మత్త హాస్పిటల్‌కి తీసుకుని పోయింది. డాక్టర్‌ గుండె పగిలే వార్త చెప్పాడు. షుగర్‌ వ్యాధి ఉందట. ఇంత చిన్నవయసులో ఈ రోగమేంటని రుక్కమ్మత్త నన్ను పట్టుకుని ఏడ్చింది. ఆమె సొంత అత్త కాదు. ఇంటిపక్కనామె. అత్తా అని పిలుస్తాను. రోజూ రెండు కిలోమీటర్లు నడిచి స్కూల్‌కి వెళ్తాను. దారిలో ఎక్కడైనా కళ్లు తిరిగి పడిపోతే దిక్కులేదు. డైలీ ఇన్సులిన్‌ వేసుకోవాలి. అది లేకుంటే ఒళ్లంతా తిమ్మిర్లెక్కుతుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. నీరసంగా ఉంటుంది. బాగా చదువుకుని డాక్టర్ కావాలనుంది. స్కూళ్లో టీచర్లు చాలా మంచివాళ్లు. ఏడ్చిన ప్రతీసారి ధైర్యం చెప్తుంటారు. కానీ, నా బాధల్లా ఒక్కటే. అక్క ఒక్కతే నాకోసం కష్టపడుతోంది. అది చూడలేకపోతున్నా! ఒక్కోసారి అనిపిస్తుంది.. ఆడపిల్లగా పుడితే ఇన్ని కష్టాలుంటాయా అని! అన్న.. వాడి దారి వాడు చూసుకున్నాడు. కనీసం వంద రూపాయలు కూడా పంపివ్వడు. అసలు ఇద్దరు చెల్లెళ్లున్నారన్న సంగతే వాడు మరిచిపోయాడు. ఇన్సులిన్‌ కోసం నెలకు ఎంతలేదన్నా రెండువేలకు పైనే కావాలి. రెక్కలు ముక్కలు చేసుకుంటే గానీ పూట గడవని పరిస్థితి. అక్క ఆ రోజు కూలికి పోతేనే ఆ రాత్రి ఇన్ని మెతుకులు. నేను పెద్ద చదువులు చదవాలి. అక్క పెళ్లి చేయాలి. బతుకడానికే ఇన్ని కష్టాలు పడుతుంటే ఇక కలలేం కంటాం.

అయ్యలారా! అమ్మలారా! ఇద్దరు ఆడపిల్లలు. బతుకుని ఎదురీదుతున్నారు. అన్న.. వాడి స్వార్ధం వాడు చూసుకున్నాడు. ఇరుగూ పొరుగూ ఎంతకాలం పట్టించుకుంటారు. కూలికి వెళ్తే వచ్చే నాలుగు పైసలతో బియ్యమూ ఉప్పూ పప్పూ కొనడానికే సరిపోతున్నాయి. తల్లిదండ్రీ లేని పిల్లలు. 12ఏళ్ల వయసులో శిరీష పెద్ద జబ్బు మోసుకుంటూ తిరుగుతోంది. కిలో నూకలే కొనలేని పరిస్థితి. నెలకు రెండువేలకు పైనే ఆసుపత్రి ఖర్చులంటే ఎక్కడ నుంచి వస్తాయి. ఈరోజుల్లో మాటసాయం తప్ప ఆర్థికసాయం చేసేవాళ్లెవరు? శిరీషకు చదువుకోవాలని ఉంది. కానీ మాయదారి చక్కెర వ్యాధి చిన్నారి గోస పుచ్చుకుంటున్నది. ఆదుకునే మానవతా మూర్తుల కోసం ఇద్దరు ఆడకూతుళ్లు మౌనంగా దిక్కులు చూస్తున్నరు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి  కాపాడాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఈ పేద చిట్టితల్లికి ఆర్ధిక సాయంచేస్తే అంతకంటే పుణ్యం మరొకటి ఉండదు. మీ కూతురనుకోండి! ఈ తోడబుట్టిందే అనుకోండి! మీకు తోచిన సాయం చేయండి! ఈ నిరుపేద పిల్ల మీకు జీవితాంతం రుణపడి ఉంటుంది. సాయం చేయాలనుకున్నవారు సంప్రదించాల్సిన అకౌంట్‌ నంబర్‌...
శిరీష, ఆంధ్రాబ్యాంక్‌, 033410100039957, కొత్తకోట బ్రాంచి, మహబూబ్‌నగర్‌ జిల్లా!

No comments:

Post a Comment