Friday, 30 November 2012

అక్కడ ఒక పావుగంట నిలబడితే తెలుస్తుంది !!



భర్త శవం దుబాయిలో ఉంది. పీనుగు వచ్చే అవకాశం లేదు. ఏడ్చీ ఏడ్చీ భార్య కన్నీళ్లు ఇంకిపోయాయి. చేయని నేరానికి పెనిమిటిని నిష్కారణంగా జైల్లో పెట్టారు. విడిపించే దిక్కు లేదు. అమ్మ గుండె పగిలిపోయింది. అక్కడ ఎవరిని కదిలించినా తీరని వేదనలే. అందరి బతుకులూ ఎండమావులే.  
కరువు కాటేసింది. ఉన్న ఊరు తరిమి కొట్టింది. ఆకలి డొక్కలు చేతపట్టుకుని కాని దేశం వలసపోతే విధి దారుణంగా వంచించింది. కొందరు జైళ్లలో ఉంటే.. ఇంకొందరు ఫుట్‌పాత్‌ మీద శవాలై తేలారు. పొట్ట చేతపట్టుకుని కాని దేశం పోతే బతుకులు చితికిపోయాయి. ఎడారి ఇసుకలో మెతుకులు ఏరుకోలేక నిర్దాక్షిణ్యంగా తనువు చాలించిన వారు కొందరైతే.. చేయని తప్పుకు కటకటాల పాలై విడిపించే దిక్కు లేక దీనంగా బతుకుతున్న వాళ్లు మరికొందరు.
కరీంనగర్ బస్టాండు. ఫ్లాట్ ఫాం నెంబర్‌ త్రీ. శంషాబాద్ ఎయిర్ పోర్టు లగ్జరీ బస్సు. ఇక్కడ ఓ పావుగంట నిలబడితే తెలుస్తుంది. ఆకలి పేగులు కన్నీళ్లుగా మారి ఎలా బయటకొస్తాయో! అమ్మ కొంగునిండా కన్నీటి మూటలు బరువెక్కుతాయి. కొడుకు భుజం మీద చిరుగుల కండువా తడచి ముద్దవుతుంది. తమ్మీ అవ్వ పైలం! బిడ్డా.. పొయినకాడ జాగర్త! శీనయ్యా అమ్మను ఏడిపియ్యకు! నాయనా.. పొయినంక టిలిఫోన్‌ చేయి!! కొన్ని సముదాయింపులు. ఇంకొన్ని జాగర్తలు. కొంత ఓదార్పు. కొద్దిగా ధైర్యం. బాధ.. కష్టం.. దిగులు.. ఏడుపు.. ఆశ.. నిరాశ.. ఏకకాలంలో గుండెను తూట్లు తూట్లుగా పొడుస్తుంటే మనసంతా కలికలి అవుతంది. కళ్లలో వేడి చెమ్మ చిప్పిల్లుతుంది. జానెడు పొట్ట కోసం ఎన్ని పడరాని పాట్లు. కాలే కడుపుల్ని చల్లార్చడానికి ఎన్ని మైళ్ల దూర ప్రయాణం.
తీరా అక్కడికి పోయిన తర్వాత పని దొరకదు. ఏజెంట్ మోసం బయటపడుతుంది. ఉండటానికి నీడ ఉండదు. తినడానికి తిండి దొరకదు. పార్కుల్లో ఫుట్ పాత్‌లపైనా.. రోడ్డు పక్కన తలదాచుకోవాలి. రోగమొచ్చి నిలువునా కుప్పకూలినా పట్టించుకునే వాళ్లుండరు. ఇక్కడ ఎవడి గుండె బరువు వాడే దించుకోవాలి. దూరపు కొండలు ఎప్పుడూ నునుపుగానే కనిపిస్తాయి. దేశం కాని దేశంలో అడుగు పెట్టడం వరకే వీళ్ల చేతుల్లో. రావడం రాకపోవడమంతా విధి చేతుల్లో! బతికుండే వస్తారో.. శవమై తిరిగొస్తారో అంతా దేవుడికెరుక.  మెతుకుల వేటలో ఎడారి దేశాలకు వెళ్ళిన కరీంనగర్ జిల్లా వాసుల కష్టాలు వర్ణనాతీతం. కొందరు మృత్యువాత పడితే ఇంకొందరు చేయని నేరానికి జైళ్లలో మగ్గుతున్నారు. సరైన సమాచారం ఉండదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. గోడు వినే నాధుడుండడు. ఇలాంటి సమయంలో బాధితులకు బాసటగా నిలువాల్సిన ఎన్నారై సెల్ ఉలుకూ పలుకూ లేకుండా పడివుంది. సమాచారమిచ్చేందుకు ఒక మహిళా కానిస్టేబుల్ తప్ప అధికారులెవరూ అందుబాటులో ఉండటం లేదు.

2 comments: