ఆయన చేయి డప్పు
మీద పడిందంటే చాలు మనసు రెక్కలు విప్పి నాట్యం చేస్తుంది. కాళ్లు వాటంత అవే చిందులేస్తాయ్.
హార్ట్ బీట్ డ్రమ్ బీట్‌తో జుగల్ బందీ చేస్తుంది. బిగబట్టిన శ్వాస ఆడిటోరియం నిండా
వేడి ఆవిర్లు చిమ్ముతుంది. ఆ సంగీత మాంత్రికుడెవరో వేరే చెప్పక్కర్లేదు. ద వన్
అండ్ వోన్లీ ద గ్రేట్ శివమణి. ఏమాటకామాటే
చెప్పుకోవాలి! మనిషి నల్లగా ఉన్నా స్ఫురద్రూపి. కళ్లలో అంతులేని ఆత్మవిశ్వాసం. మణికట్టుతో
కనికట్టు ప్రదర్శన. పంచభూతాల ఆవిష్కరణ. రెగ్యులర్ మ్యూజిక్ షోస్ ఎన్నో చూస్తుంటాం. అవన్నీ ఆ సమయానికే
ఎంటర్‌టైన్. బట్..శివమణి షో అట్లా కాదు. ప్రతీ సెకన్ గుండెలో నిక్షిప్తమైపోద్ది.
ప్రతీ బీట్ తనువూ మనసునీ ఏకం చేస్తుంది. వింటున్నంత సేపూ హృదయం కంజీర నాదాలు
మోగిస్తుంది. డ్రమ్మర్ అంటే శివమణి.
శివమణి అంటే డ్రమ్మర్. ప్రతీ ప్రదర్శన వెనుక కఠోర శ్రమ. ప్రతీ వాయిద్యం వెనుక
అంతర్లీనంగా ఏదో సందేశం. చెంబూ తపాళా సూట్‌కేసూ కాదేదీ శబ్దానికి అనర్హం. ధ్వని
తరంగాల్ని ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులు తిప్పగల ఏకైక మాయగాడు శివమణి. నిశ్చల
తటాకంలో పక్షి నీళ్లు తాగుతున్న చప్పుడు మీకెవరికైనా తెలుసా? అగ్నిపర్వతం
బద్దలయ్యే ముందు లావా కుతకుత ఉడుకుతున్న శబ్దం మీరు ఎప్పుడైనా విన్నారా? అర్ధరాత్రి
సముద్ర ఘోషను ఆడిటోరియంలో వింటే ఎలా వుంటుందో ఊహించగలరా? తబలా కొడుతుంటే కాంగో
వాయిస్తున్నట్టు మీరెప్పుడైనా భ్రమపడ్డారా? అలాంటివన్నీ ఒక్క శివమణి మ్యూజిక్‌లో
మాత్రమే సాధ్యం! తబలా మాస్ట్రో ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ అండ్ డ్రమ్మర్ శివమణి. ఈ కాంబినేషన్ ఎలా వుంటుందో
ఒక్కసారి ఊహించండి. చూసిన వాళ్లెవరూ ఆ జుగల్ బందీని జన్మలో మరిచిపోలేరు. ఒకపక్క
తబలా.. ఇంకో పక్క డ్రమ్స్. ఇద్దరూ
ఉద్ధండులే. ఎవరికి ఎవరూ తీసిపోరు. అలుపూ సొలుపూ లేకుండా ఇద్దరూ వాయిస్తుంటే.. చూసే ప్రేక్షకులు శ్వాస తీసుకోవడం
కూడా మరిచిపోయారంటే అతిశయోక్తి కాదు.
బాగా చెప్పారు! ఆయన టాలెంట్ అనిర్వచనీయం. పడమటి సంధ్యారాగం సినిమాలో చూసినప్పుడు ఏమో అనుకున్నా కానీ అందరిచేతా వావ్ అనిపించుకున్నాడు. కొన్ని శబ్దాలని వాటర్ టాప్ తిప్పి ఆ వచ్చే నీటిని చెంచాలతో తట్టి మరీ సృష్టిస్తారట! హ్యాట్స్ ఆఫ్ టు శివమణి!
ReplyDeleteధన్యావాలు రసజ్ఞ
ReplyDelete