Friday 19 October 2012

పూరీ జగన్నాథ్‌కి పైత్యం ముదిరిపోయింది..!!!!!


పూరీ జగన్నాథ్‌కి పైత్యం ముదిరిపోయింది. ఏం తీసినా చెల్లుబాటు అవుతుందన్న పొగరు. ఏం మాట్లాడిన జనం చప్పట్లు కొడతారన్న అహంకారం. పూరీ సినిమా అంటే జనం ఎగబడతారన్న ఓవర్‌ కాన్ఫిడెన్స్! సమాజం పట్ల పూరీ జగన్నాథ్‌ అనే పెద్దమనిషికి మంచి అవగాహన ఉందని ఇండస్ట్రీలో అందరూ అనుకుంటారు. కానీ అది ముమ్మాటికీ తప్పని తేలింది. సామాజిక సందేశం ఇస్తున్నామన్న ముసుగులో తెలంగాణ ఉద్యమంపై కక్కాల్సిన విషాన్నంతా కక్కాడు. నాలుగున్నర కోట్ల ప్రజల మనోభావాలను దారుణంగా గాయపరిచాడు. దశాబ్దాలుగా దగాపడుతున్న గుండె గొంతుకను వెండితెర మీద మొండిగా నరికాడు. 

నాలుగు వెకిలి డాన్సులు చేయించి.. హీరోయిన్ అంగాంగాల్ని చూపించి.. సినిమాని అమ్ముకునే పూరీ జగన్నాథ్‌కి తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసని వాగాడు. ఆయనకున్న తాత్విక చింతనకు అర్ధం ఇదేనా? ఆయనకు సమాజం పట్ల ఉన్న అవగాహ ఈపాటిదేనా? అసలు ఆయనకు ఉద్యమాన్ని అవహేళన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సిగ్గుచేటైన మరో విషయం ఏమిటంటే.. తెలంగాణ ఉద్యమాన్ని హృద్యంగా ఆవిష్కరించే ఆర్ నారాయణ మూర్తికి ఈ చిత్రాన్ని అంకితమివ్వడం!

సిల్లీగా.. పొలిటికల్‌గా సెటైర్లేసుకో! తప్పులేదు! సున్నితంగా కామెంట్ చేయి! ఎవరూ ఏమీ అనరు! కానీ దశాబ్దాలుగా ఆత్మగౌరవం కోసం పోరాడుతూ యావత్ ప్రంచంలోనే మహాగొప్ప ఉద్యమంగా పిలవబడుతున్న తెలంగాణ పోరాటంపై విషం చిమ్మే రైట్ పూరీకి లేదు. అసలు తెలంగాణ ఉద్యమం గురించి ఈ సోకాల్డ్‌ సినిమా దర్శకుడికి ఏం తెలుసని? ఇక్కడి ప్రజల కష్టం తెలుసా? ఇక్కడి వనరుల దోపిడీ గురించి తెలుసా? ఎనిమిది వందల మంది యువకుల ఆత్మబలిదానాల గురించి తెలుసా? కొడుకులను పోగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న తెలంగాణ బీద తల్లుల గురించి తెలుసా? 

మిస్టర్ పూరీ!! నెర్రెల బారిన ఈ బీళ్లమీద అడుగుపెట్టు.. గుండె కోత అంటే ఎలా వుంటుందో తెలుస్తుంది! నీళ్లు లేని బావుల వంక ఒకసారి చూడు.. తెలంగాణ బక్క రైతు ఎండిపోయిన ఎదురుబొచ్చె కనిపిస్తుంది.  ఒక్కసారి నల్లగొండకు రా! ఫ్లోరైడ్ విషాన్ని కంఠంలో ఒంపుకుని కాళ్లు ఒంకర్లు పోయి బోన్సాయి బతుకులు అనుభవిస్తున్న నా అక్కలూ చెల్లెళ్లూ అన్నలూ తమ్ముళ్లూ కనిపిస్తారు. 

అయినా తెలంగాణ పట్ల ఫిల్మ్ ఇండస్ట్రీ వివక్ష ఇప్పటిదేం కాదు. మద్రాస్ నుంచి హైదరాబాద్ కు వచ్చినప్పుడు..డెవలప్ మెంట్ కోసం అప్పటి ప్రభుత్వాలు వందలాది ఎకరాలు ఇలాంటి పెద్దలకు కట్టబెట్టాయి. ఇక్కడి భూములను అప్పణంగా పొందిన  బాబులంతా కోట్లకు పడగలెత్తారు. సినీ పరిశ్రమ అభివృద్ధి పేరుతో అక్రమ దందాలు నడిపారు. పైగా తెలంగాణ యాసను భాషను, సంస్కృతిని ఘోరంగా అవమానిస్తూ సినిమాలు తీశారు. విలన్లు, కమెడియన్లతో తెలంగాణ యాసలో డైలాగులు పలికించి అవమానించారు. అవన్నీ దశాబ్దాలుగా భరించాం. 

కానీ ఇప్పుడా ఓపిక లేదు. ఒక్కటి గుర్తుంచుకో పూరీ జగన్నాథ్‌. హైదరాబాద్‌ నీడన ఉంటున్నావు. గండిపేట నీళ్లు తాగుతున్నావు. తెలంగాణ కలెక్షన్లతో బిజినెస్‌లు చేసుకుంటున్నావు. కానీ తిన్నింటివాసాలు లెక్కబెడుతున్నావు. ఎలాగోలా సినిమా తీస్కో! తప్పులేదు. అదేదో సినిమాలో ఓ హీరో ముంబయిని ఏదో చేసేద్దామన్నట్టు నువ్వూ భ్రమపడితే.. ఇప్పుడు  ఫ్లెక్సీలు చిరిగినయి.. రేపు ఇంకోటి జరుగుతుంది! ఉద్యమంతో పెట్టుకున్న మహామహా నాయకులే మట్టికరిచారు. ఆత్మగౌరవ సునామీ ముందు నువ్వూ.. నీ వెనక ఉన్నవాళ్లంతా గడ్డిపోసలతో సమానం.

No comments:

Post a Comment