Monday, 16 July 2012

జలతరంగిణీ పరిమళం !!


ఝళజళంఝళ రాగాల ప్రణయ నృత్యం
గుండెల్లో ఉద్రేకాల సవ్వడికి తరంగాల రూపం
డాల్చె గబ్బానాపై క్వీన్షెబా
దేహమంతా పరుచుకున్న సౌగంధం
లహరీ సమీర భువన మోహన రాగం
అప్నే  ధున్మే రహతా హూ!
గులాం అలీ లతాజీ జుగల్బందీ
నీటి పరదాల వెనుక సంగీత కచేరీ
పియానో మెట్ల గమకాలతో
గతి తప్పని జలధారలు
బద్దకంగా వొళ్లువిరుచుకున్న
వందల కొద్దీ అమృత కలశాలు
ముఘాల్ని కత్తిరించారా..
చినుకుల్ని అతికించారా..
నిశ్శబ్ద మైదానంలో
విచ్చుకున్న ఫౌంటెయిన్తో
పార్కు గాలి స్వేచ్ఛా సంభోగం
పబ్లిగ్గా.. వేయి వాయులీనాల సాక్షిగా
ఏవేవో స్మృతులు
వందల కొద్దీ  సారంగులు
గుండెల నిండా తుఫాను వలె
నిలువెల్లా ఆవహించిన గమకాల్లో
ఘనీభవించీ ద్రవీభవించీ
క్షణక్షణాలుగా రాలిపోతూ
సరిగమల్లో కరిగిపోతూ
బాధల్లోంచి భయాల్లోంచి
కష్టాల్లోంచి ఏడుపుల్లోంచి
దూరంగా పారిపోవాలనుంది:
కళ్లు మూసుకోకున్నా కలలొస్తాయా
ఏమో దృశ్యం అలాగే ఉంది
ఎన్నెన్ని అందాల్ని కళ్లునింపుకుంటున్నాయనీ..
చెరువులో చేపపిల్లగా ఈదులాడుతున్నట్టుగా..
వెన్నెల రాత్రిలో ఇసుక తిన్నెలపై పొర్లాడుతున్నట్టుగా
మంచు కురుస్తున్న వేళ రాలుతున్న పొగడపూలని
ఏరుకున్నట్టుగా..
కనపడని కుంచే ఏదో నీటి కాన్వాసు మీద
క్షణానికో బొమ్మ గీస్తుంటే
బాల్యంలోకి జారిపోవాలనుంది
చినుకు గువ్వల్ని పట్టుకుని
సప్తసముద్రాలకావల దాచిపెట్టాలనుంది
ఎంత సౌందర్య పిపాస నీటికి
పూల గంపలోంచి వచ్చిందీ జలతరంగిణి పరిమళం
ఇంకా ఎంత దూరం లాక్కెడుతుందో కదా..
ఎవరీ ఆర్కిటెక్చర్
కనిపిస్తే పాదాభివందనం చేయాలి
సాష్టాంగ నమస్కారం చేయాలి
పవిత్ర గంగా జలంతో అభిషేకం చేయాలి
ఎలాగైనా వెతికిపట్టి సన్మానం చేయాలి

No comments:

Post a Comment