Thursday 6 December 2012

వయసు 22 ఏళ్లు! జీతం 80లక్షలు!!




కలలు అందరూ కంటారు! కానీ ఆ కలల్ని కొందరే సాకారం చేసుకుంటారు!! అలాంటి వారిలో శ్రీరామ్‌ భార్గవ్‌ ఒకడు! 22 ఏళ్లు. చదవింది ఐఐటీ. అయితే ఏంటి. దేశంలో చాలామంది శ్రీరామ్‌ లాంటి ఐఐటీ కుర్రాళ్లున్నారు. ఇతని ప్రత్యేకత ఏంటనేగా మీ సందేహం. స్పెషాలిటీ కాదు. పెను సంచలనం. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లో 80లక్షల జీతం. మాటలు కాదు. గట్స్ ఉండాలి. గోల్‌ రీచ్‌ అవ్వాలన్న కసి ఉండాలి. కల నిజం చేసుకోవాలన్న తపన ఉండాలి. బతకాలంటే ఎలాగోలా బతికేయొచ్చు. అలా అందరూ బతికేస్తారు. కానీ తన గురించి గొప్పగా చెప్పుకోవాలి. నలుగురూ శభాష్ అని మెచ్చుకోవాలి. కన్నందుకు తల్లిదండ్రులు గర్వపడాలి. ఫలానా పిల్లాడిలా ఉండాలని ఆదర్శంగా తీసుకోవాలి. ఇవన్నీ కావాలంటే ముందు కమిట్‌మెంట్ కావాలి. దానికి తగ్గట్టుగా ఎఫర్ట్‌ కావాలి. ఆ విషయంలో శ్రీరామ్‌ భార్గవ్‌ కాంప్రమైజ్‌ అయ్యేరకం కాదు. 

 శ్రీరామ్‌ తండ్రి విజయ్‌ కుమార్‌ ట్రెజరరీ ఉద్యోగి. అమ్మ అరుణ గృహిణి. మధ్యతరగతి కుటుంబం. చదువులన్నీ నోట్ల కట్టలతో ముడిపడి ఉన్న ఈ రోజుల్లో.. ఓ సాదాసీదా కుటుంబంలో పుట్టి ఐఐటీలాంటి పెద్ద చదువులు చదవాలంటే తలకు మించిన భారమే. అయినా విజయ్‌ కుమార్‌ భయపడలేదు. కొడుకును చదివించాలి. కలెక్టర్‌ని చేయాలి. అమ్మ ఆశ కూడా అదే. కానీ శ్రీరామ్‌ భార్గవ్‌ ఆలోచనంతా సాఫ్ట్‌ వేర్‌వైపే. అయినా తండ్రి వద్దని వారించలేదు. ఫలానా మాత్రమే చదవాలని ప్రెజర్‌ పెట్టలేదు. కొడుకు ఆంబిషన్‌ కాదనలేదు. 2009లో ఆలిండియా ఒపెన్  క్యాటగిరి ఐఐటీలో భార్గవ్‌కి 55వ ర్యాంక్‌ వచ్చింది. ముంబయి ఐఐటీలో సీటు! ఈ మాత్రం దానికే అదే పెద్ద విజయమని మురిసిపోయేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ భార్గవ్ అలా ఆలోచించలేదు. ఐఐటీలో జాయిన్‌ అయిన తర్వాత అందరూ కెరీర్‌ని అశ్రద్ధ చేస్తారు. ప్లేస్‌ మెంట్ అదే వస్తుందిలే అని నిర్లక్ష్యం చేస్తారు. చదివామా.. ఏదో ఒక జాబ్ కొట్టేశామా అన్నది లక్ష్యం కాదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అదీ గోల్ అంటే!! జరిగింది కూడా అదే. 
మొన్న జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్లో శాంసంగ్ మొబైల్ కంపెనీ వాళ్లు ఏడాదికి 80 లక్షల జీతం ఇస్తామని శ్రీరామ్ తో ఒప్పుందం చేసుకున్నారు. రోబోటెక్  కాం, చాట్ బాక్స్ తదితర ప్రాజెక్టులను  వినూత్నంగా చేసి  కంపెనీని ఆకర్షించాడు. ఏడాదికి 80లక్షలు. అమెరికాలో కొలువు. ఐదంకెలకే ఆకాశానికి ఎగిరిపోయే రోజులు. మరి ఇంత జీతమంటే మాటలా. అదీ 22ఏళ్లకే. అయినా శ్రీరామ్‌ తాను సాధించిన దాంతో హండ్రెడ్‌ పర్సెంట్ శాటిస్‌ఫైగా లేడు. ఇంకా ఏదో సాధించేది మిగిలే ఉందనే ఆలోచనలోనే ఉన్నాడు. ఈ విజయానికి కారణం ఎప్పటికప్పుడు గోల్స్ సెట్ చేసుకుంటూ హార్డ్‌ వర్క్‌ చేయడమే అంటాడు. ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే పెద్ద పెద్ద స్కూళ్లలోనే చదవాల్సిన అవసరం లేదనేది శ్రీరామ్‌ భార్గవ్ అభిప్రాయం. అయినా చదువొక్కటే సరిపోదు.. తల్లిదండ్రుల నుంచి మోరల్ సపోర్ట్‌ కూడా కావాలంటాడు. భార్గవ్ జీవితాశయమల్లా ఒక్కటే... తనలా పేద పిల్లల్లోనూ టాలెంట్ ఉన్నోళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లకు ఐఐటీ లాంటి చదువులు అందుబాటులోకి తేవాలి. ఇదే భార్గవ్ జీవిత లక్ష్యం!   

వాస్తవానికి భార్గవ్ చదివింది గొప్ప గొప్ప ఇంటర్నేషనల్ స్కూళ్లలో కాదు. సాధారణ బడుల్లోనే చదివాడు. ఎల్‌కేజీ నుంచి నుంచి  5వ తరగతి వరకు నల్లగొండ శ్రీకృష్ణదేవరాయ స్కూల్లో!  6,7 తరగతులు వైష్ణవీ స్కూల్లో!!ఎయిత్ క్లాస్‌ ఎస్పీఆర్ స్కూల్లో! ఆ తర్వాత 9, 10 తరగతులు గుడివాడలో చదివాడు. ఇంటర్ విజయవాడలో చేశాడు. 2009లో ఐఐటీ 55 ర్యాంక్ కొట్టాడు. ముంబాయి ఐఐటీలో చదువుతున్న 73 మంది విద్యార్దుల్లో 65 మందికి ప్లేస్ మెంట్ దొరికింది. కానీ అందులో భార్గవ్ ఒక్కడికే అత్యుత్తమ  ప్లేస్మెంట్! కొడుకు సాధించిన విజయంతో తండ్రికి సంతోషంతో మాటలు రావడం లేదు. జిల్లా గర్వించేలా విజయం సాధించినందుకు నాన్న తెగ మురిసిపోతున్నాడు. అసలు ఇది కలా నిజమా అని ఇప్పటికీ తేరుకోలేదు. కృషీ, పట్టుదల ముందు ఏదైనా బలాదూర్‌ అని మావోడు రుజువు చేశాడని విజయ్‌ కుమార్‌ గర్వంతో చెప్పుకుంటున్నాడు. కొడుకు కష్టపడే తీరు నచ్చిందని తండ్రి గుండె ఉప్పొంగిపోతోంది. కాకపోతే మావాడు కలెక్టర్‌ అని చెప్పుకోవాలనేది విజయ్‌కుమార్‌ కల!  అయినా కొడుకు ఆకాంక్షను కాదనలేదు.  

ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి ఏడాదికి 80లక్షలు ప్యాకేజీ అంటే మాటలు కాదు. తల్లి అరుణకైతే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. భార్గవ్ గోల్ ఎంచుకునే తీరు.. దాన్ని రీచ్ అయ్యే అప్రోచ్‌ ఎంతో నచ్చిందంటోంది. అవును.. ఇంతకంటే పేరెంట్స్ కి ఇంకేం కావాలి. అమ్మ కల కూడా భార్గవ్ కలెక్టర్‌ కావాలనే. అయినా ఆమె అభిప్రాయం భార్గవ్ మీద రుద్దలేదు. సాఫ్ట్‌ వేర్‌ అవుతానంటే కాదనలేదు. పిల్లలకు ఏ రంగంలో ఇష్టముందో ఆ రంగంలోనే వెళ్లనీయాలనేది అరుణ అభిప్రాయం.

భార్గవ్ అందరిలాంటి కుర్రాడు కాదు. చదివామంటే చదివాం అన్నట్టు ఉండడు. ఎంత డిస్ట్రబెన్స్ ఉన్నా పట్టించుకోడు. సబ్జెక్ట్‌ అంతుచూసేవాడు.  చిన్నప్పట్నుంచి అలవడిన క్రమశిక్షణ భార్గవ్‌ని అంతెత్తున నిలబెట్టింది.  తండ్రి సహోద్యోగులంతా భార్గవ్‌ మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఈ తెలంగాణ ఆణిముత్యాన్ని మనసారా కౌగలించుకుని అభినందించారు. ఇక స్నేహితులు.. చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్ల ఆనందం అంతా ఇంతా కాదు.



8 comments:

  1. అచ్చం ఈనాడు పేపర్ చదివినట్టు వుంది శైలి బాగా పొగిడారు.

    ReplyDelete
  2. ధన్యవాదాలు.........

    ReplyDelete
  3. Hard work, dedication, passion will take anyone to great heights. Thank you for sharing this news. Your posts are very informative, almost all of them.

    ReplyDelete
  4. థాంక్యూ వెరీమచ్‌!!! అవును. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు!!!

    ReplyDelete
  5. బాగా వ్రాశారు. మీ బ్లాగ్ చాలా వైవిధ్యంగా వుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు.. జ్యోతిర్మయి గారూ......

      Delete
  6. Replies
    1. అవును మరి! స్పందించినందుకు ధన్యవాదాలు పద్మార్పిత గారూ....!!!

      Delete