Thursday 13 December 2012

క్రిస్ గేల్ విషాద గాథ !!!

 ఆ పేరొక పడిలేచిన కెరటం. ఆకలి, అవమానం, పేదరికం వెక్కిరిస్తే వాటన్నిటినీ ధిక్కరించి అంతెత్తున ఎగసిపడ్డ జమైకా జ్వాలాకణం. అంతర్జాతీయ క్రికెట్ యవనిక మీద సరికొత్త కరేబియన్‌ ముఖచిత్రం. అవమానాల పాలుచేసినా.. ఆర్ధికంగా కోలకోలేని దెబ్బతీసినా.. వెన్నువిరువని ధీరత్వం. దెబ్బతిన్న ప్రతిసారీ బెబ్బులిలా గర్జించిన తెంపరితనం. ఇవన్నీ కలబోస్తే క్రిస్‌  గేల్.  

ఎవరన్నారు ఫ్రంట్‌  ఫుట్‌  వస్తేగానీ సిక్సర్‌  బాదలేరని. ఎవరు చెప్పారు బాడీ లెంగ్త్‌   బాల్‌  ని కీపర్‌  కే వదిలేయాలని. అవన్నీ పాతచింతకాయ పచ్చడి టైపు. క్రిస్  గేల్‌ ని చూడు. సరికొత్త క్రికెట్‌  డిక్షన్‌. ఏ పుస్తకాల్లో లేని షాట్లు. మహామహా దిగ్గజాలే వారేవా అనిపించేటట్టు. నాటు కొట్టుడు. వీర కొట్టుడు. దంచికొట్టుడు. గ్రౌండ్‌  దద్దరిల్లాలి. బాల్  ఆకాశమార్గం పట్టాలి. విమానం  టేకాఫ్‌  తీసుకున్నట్టుగా! విల్లు నుంచి బాణం దూసుకెళ్లినట్టుగా! గన్‌  లోంచి బుల్లెట్‌  రిలీజ్ అయినట్టుగా! బౌలర్లకు పీడకలై వెంటాడాలి! ఫీల్డర్లు పట్టపగలే చుక్కలు చూడాలి!! జన్రల్‌  గా బ్యాట్స్  మెన్‌ ఎప్పుడు సిక్స్‌  కొడతాడో ఊహించలేం! కానీ గేల్  క్రిజ్‌  లో ఉంటే బంతిబంతికీ ఊహించొచ్చు. దటీజ్‌  ఇన్‌  స్టింక్ట్‌   ఆఫ్‌   క్రిస్   గేల్! 

మొహంలో ప్రశాంతత. ఉండీలేనట్టు నవ్వు. భారీ రూపం. చేతిలో బ్యాటు ఉందాలేదా! భీముడి చేతిలో గద టైపు! సిక్స్‌  కొట్టినా ఫోర్‌  కొట్టినా ఎక్స్‌  ప్రెషన్‌  మారదు. సెంచరీ చేస్తే ఒక చిన్న అభివాదం. ఆపై సన్నటి నవ్వు. అంతకు మించి గేల్  ఫేస్‌  ఎంటర్‌టైన్‌  చేయదు. అతని ఆటను మాత్రం జుర్రుకోవచ్చు. ఎంత తాగితే అంత. ఫుల్  బాటిల్ ఎత్తికొట్టినట్టు. గాల్లో తేలియాడినట్టు.

బౌండరీల మెరుపులు. సిక్సర్ల పిడుగులు. సింగిల్  నక్కో బాస్‌!  డబుల్‌  రిస్కొద్దు. అయితే గియితే ఫోర్‌.  మాగ్జిమం సిక్స్‌.  ఉన్నచోట ఉండి స్కోర్‌  బోర్డుకు రెక్కలు తొడగాలి. క్రిజ్‌  లో కదలకుండానే జట్టు మెడలో విజయమాల వేయాలి. ఇలాంటి ఆల్‌   రౌండర్‌  ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే అది క్రిస్‌   గేల్ ఒక్కడే. అరివీర భయంకరమైన బ్యాటింగ్.  తుఫాన్‌.  సునామీ.  బీభత్సం. విధ్వంసం. వినాశనం. ఎన్ని పర్యాయపదాలు చెప్పినా గేల్  విశ్వరూపం ముందు తక్కువే.

19వ ఏట ఫస్ట్‌   క్లాస్   క్రికెట్. ఏ డాది తర్వాత వన్డేలోకి అరంగేట్రం. సంవత్సరం తిరగకుండానే టెస్టు క్రికెట్.  ఒక క్రికెటర్‌  ఇంటర్నేషనల్‌  స్థాయికి ఎదిగాడూ అంటే.. అతడి జీవితం వడ్డించిన విస్తరి అవుతుంది. కానీ గేల్‌   విషయంలో అలా కాలేదు. ఎన్నో ఒడిదొడుకులు. నిలదొక్కుకోడానికి సమయం పట్టింది. జింబాబ్వేతో జరిగిన టెస్టులో డారెన్‌  గంగాతో కలిసి రికార్డు భాగస్వామ్యం. 157 పరుగులు. ఒక్కసారిగా గేల్   కెరీర్‌ గ్రాఫ్‌   ఎక్కడికో పోయింది. విండీస్   జట్టులో తిరుగులేని ఆటగాడిగా మారిపోయాడు. టెస్టు. వన్డే.. టీ-ట్వంటీ. ఫార్మాట్   ఏదైనా గేల్   క్రిజ్‌లో   పరిగెత్తడు. ఒకటీ రెండు పరుగులు అసలే తీయడు. తప్పదనిపిస్తే తప్ప. ఎందుకు? గేల్‌  కి ఉరకడం చేతకాదా? లేక బద్దకమా? ఫోర్లు, సిక్సర్ల మీదే ఆధారపడతాడా? ఈ ప్రశ్న వెనుక గుండె జారిపోయే సమాధానముంది. క్షణకాలం దిగ్భ్రాంతి చెందే కఠోర వాస్తవం ఉంది. 

జమైకా ఇసుక తిన్నెల్లో మెరిసిన ఈ నల్లజాతి రత్నానిది సముద్రమంత కష్టం. దాన్ని పిడికెడంత గుండెలో ఇముడ్చుకుని బతుకుతున్నాడు. పేదరికంతోపాటు మృత్యువును క్రికెట్‌   కిట్‌  లో వేసుకుని తిరుగుతున్నాడు. అవును. మీరు విన్నది నిజం. గేల్‌  కి గుండె జబ్బుంది. ఎక్కువ పరిగెత్తితే దాని వేగం ఎక్కువవుతుంది. ఒక్కోసారి ఆగిపోయినా ఆగిపోద్ది. తరచూ కామెంటేటర్స్    గేల్‌   హార్ట్   పరిస్థితి గురించి అడుగుతుంటారు. దానికి జమైకన్   వీరుడు ఇచ్చిన సమాధానం ఒక్కటే. ఎక్కువ పని చేసినప్పుడు గుండె స్పీడ్  గా కొట్టుకోవడం దానికి అలవాటు! అది నాకూ అలవాటైంది అని. అయినా తనకి హార్ట్   డిసీజ్   ఉందని ఎవరికీ స్పెసిఫిక్‌  గా చెప్పుకోలేదు. అలా వచ్చిన జాలీ సానుభూతీ తనకు అక్కర్లేదు. కావాల్సింది చికిత్స. దానికి కావల్సింది పైసలు జమ చేయడం. డబ్బు పిచ్చి ఉందని కామెంట్   చేసినా డోంట్‌ కేర్‌. జబ్బు నయం కావాలి. బతకాలి. ఎప్పటిలాగే మైదానంలో బ్యాట్ పట్టి ఆడాలి. అభిమానులను అలరించాలి.

2005. ఆస్ట్రేలియాతో సెకండ్  టెస్ట్  మ్యాచ్. ఓపెనింగ్  బ్యాట్స్  మెన్ గా బరిలో దిగిన  గేల్... ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు. పరిమితికి మించి గుండె వేగంగా కొట్టుకోవడంతో టెన్షన్  కు గురై కనీసం నిలబడలేకపోయాడు. వెంటనే అప్రమత్తమైన గ్రౌండ్  సిబ్బంది హాస్పిటల్  లో చేర్చించారు. బై లక్కీ! చికిత్స అనంతరం మళ్లీ గ్రౌండ్   లోకి వచ్చి ఆటను కంటిన్యూ చేశాడు. ఏడేళ్లుగా గుండె ఇలా సతాయిస్తునే ఉంది. అతనలా లైట్‌   తీసుకుంటునే ఉన్నాడు. అప్పుడప్పుడూ ఈ బాధ తప్పదని చిరునవ్వుతో తీసి పారేస్తాడు. 

2008లో టెక్సాస్‌ లో ఓ బిలియనీర్ స్టాన్ ఫోర్డ్ టీ ట్వంటీ సూపర్ సిరీస్ నిర్వహించాడు. అందులో ప్రైజ్ మనీ 100 కోట్ల రూపాయలు. కేవలం రెండే జట్లు తలపడ్డాయి. గేల్ ఓ టీమ్ కు సారథ్యం. మరో జట్టుకు కెవిన్ పీటర్సన్ నాయకత్వం. ఆ మ్యాచ్ లో గేల్ వీర విహారం చేసి భారీ మొత్తం అందుకున్నడు. మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్ లో పీటర్సన్ మాట్లాడుతూ డబ్బు అంత ఇంపార్టెంట్ కాదని...తనకు మ్యాచే ముఖ్యమని అన్నడు. కానీ క్రిస్ గేల్ మాత్రం తనకు మనీయే  మోస్ట్‌ ఇంపార్టెంట్ అన్నాడు. డబ్బు విలువ తనకు మాత్రమే తెలుసన్నాడు. అప్పుడందరూ గేల్ ను అపార్థం చేసుకున్నరు. కానీ ఆ మాటల వెనుక అవసరాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. డబ్బు పిచ్చోడని ముద్ర వేశారు. అయినా గేల్ పట్టించుకోలేదు.

తర్వాత ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లో కోల్ కత నైట్ రైడర్స్ తరపున ఎంపికైనా...బిజీ షెడ్యూల్ కారణంగా బరిలో దిగలేకపోయాడు. ఆ తర్వాత సీజన్ లోనూ కొన్ని మ్యాచులు మాత్రమే ఆడాడు. అయితే ఏళ్ల తరపడి జట్టుకు ఆడినా... విండీస్ క్రికెట్ బోర్డ్ గేల్ ను సరిగా గుర్తించలేదు. ఆర్థికంగా  ఇబ్బందుల పాలు చేసింది. అన్నింటినీ మౌనంగా భరించిండు. జట్టుకు ఆడటమే గొప్పగా భావించాడు. అయితే అనేక దేశాల సమాహారమైన విండీస్ బోర్డ్... జమైకన్ క్రికెట్ పై కత్తి కట్టింది. గేల్ ను ఇబ్బందులకు గురిచేసి అతని సహనాన్ని పరీక్షించింది. బోర్డ్ కు వ్యతిరేకంగా మాట్లాడేలా రెచ్చగొట్టింది. కేవలం బోర్డ్ పై మాట్లాడాడనే నెపంతో జట్టు నుంచి తప్పించింది. వరుస టోర్నీలకు ఎంపిక చేయకుండా కత్తి గట్టింది.  

సరిగ్గా ఇదే సమయంలో అటు ఆర్థికంగా...ఇటు మానసికంగా కుంగిపోయిండు. ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి జారిపోయాడు. సరిగ్గా ఇదే సమయంలో మరో షాక్‌. ఐపీఎల్ ఫోర్త్ సీజన్ కు జరిగిన ఆక్షన్‌లో ఏ జట్టూ గేల్ ను తీసుకోలేదు. బోర్డ్ తో గొడవలు...దేశవాళీ లో ఆడకపోవడం...తీసుకున్న తర్వాత జట్టులో ఆడతాడో లేదో తెలీని సిచ్యుయేషన్. అన్ని ఫ్రాంచైజీలూ గేల్ ను పక్కనపెట్టినయ్. తర్వాత ఐపీఎల్ ఫోర్త్‌ సీజన్. బెంగళూర్ వరుస పరాజయాల బాటలో ఉంది. అప్పుడే ఫారెన్ ప్లేయర్ మెక్ డొనాల్డ్ గాయపడ్డాడు. అతని ప్లేస్ లో మరొకరిని భర్తీ చేసుకోవాలి. అప్పుడు విజయ్‌ మాల్యాకు గేల్ గుర్తొచ్చాడు. ఆ సమయంలో విజయ్‌ మాల్యా కంటే గేల్‌కే అవసరం ఎక్కువ. కాబట్టి నామమాత్ర ఫీజుతో కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్‌. మెక్ డొనాల్డ్ కు ఎంత ఇచ్చారో....అంతే మొత్తం గేల్ కు ఇచ్చి తీసుకున్నారు.  అప్పటివరకు గేల్‌ని అందరూ తక్కువ అంచనా వేశారు. తప్పదు భరించాలి అన్నట్టుగా ఫీలయ్యారు. సరిగ్గా అప్పుడే తనంటే ఏంటో నిరూపించుకోవాలనుకున్నాడు. విండీస్ బోర్డ్ తనను ఇంటికి పంపిదన్న కసి ఒకపక్క..  గుండె రంపపు కోత ఇంకోపక్క. కట్‌ చేస్తే ప్రారంభ మ్యాచ్ లోనే కోల్‌కతాపై 55 బంతుల్లో సెంచరీ. తర్వాత పంజాబ్ పై 49 బంతుల్లో 107. కొచ్చిపై కేవలం ఒక్క ఓవర్ లో 37 పరుగులు. గేల్ పుణ్యమాని పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న బెంగళూర్ టీమ్ ను ఏకంగా ఫైనల్‌ పోయిది. కాకపోతే టైటిల్ అందివ్వలేక పోయాననే బాధ ఒక్కటే మిగిలింది.

ఆ సీజన్ ముగిసాక తన విశ్వరూపం వెనుక ఉన్న కారణాన్ని గేల్ బయటపెట్టాడు.  ఆట వెనుక అసలు రహస్యాన్ని అభిమానుల ముందుంచాడు. సాధారణ స్థితి కన్నా వేగంగా కొట్టుకునే గుండె....ఎక్కువ సింగిల్స్ తీయనీయదని చెప్పాడు. సింగిల్స్, టూస్ కన్నా బౌండరీలు, సిక్సులు ఎక్కువ కొట్టడం వెనుక అదే అసలు కారణమన్నాడు. అందరూ జాలిపడటమే కానీ ఆర్థికంగా ఆదుకున్నది లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న ఓనర్‌ విజయ్ మాల్యా...గేల్ ను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. పారితోషికం పెంచడంతోపాటు తన బ్రాండ్లను ప్రచారం చేసేందుకూ ఎంచుకున్నడు. దాదాపు పది కోట్ల వరకూ గేల్ కు ఇచ్చాడు. ఇతర ఫ్రాంచైజీలకు మారితే అంతకు మించి పారితోషికం లభించే ఛాన్సున్నా గేల్ బెంగళూర్ ను వీడలేదు. కష్టాల్లో ఉన్న తనను ఆదుకున్న మాల్యా వెన్నంటే ఉన్నడు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న గేల్ ను చూసి విండీస్ బోర్డ్ కాళ్ల బేరానికొచ్చింది తర్వాత సిరీస్ కు గేల్ ను తీసుకుంటామని భరోసా ఇచ్చింది. ప్రస్తుతం గేల్ ఆనందానికి అవధుల్లేవ్. అన్నింటికీ ఐపీఎలే కారణమని గేల్ గొప్పగా చెప్పుకంటున్న ఈ జమైకా జాతిరత్నం నిండు నూరేళ్లు బతకాలని కోరుకుందాం.   

3 comments:

  1. he is really an incomparable entertainer in t-20's.i njoyed his smashing

    ReplyDelete
    Replies
    1. exactly..... thnooj garu. and i warm welcoming to my blog

      Delete
  2. nijangaa singles teeyadu enduko anukunna.sorry chris gale
    mee kathanam masthu vundi

    ReplyDelete