Monday 4 February 2013

//ఆత్మకు అయిడెంటిటీ క్రైసిస్‌//



సముద్రాల్ని చిలుకుతున్నాను
కవిత్వం వెన్నలా కురుస్తోంది
మానస సరోవరం ఒడ్డున
మెరీనా బీచ్‌ పలవరింత
లైట్ హౌజ్‌లోంచి
ప్రాతఃకాల సంగీతం
గ్రామ్‌ఫోన్‌లో కాంపాక్ట్ డిస్క్‌
జలకన్య ఒంటినిండా
నక్షత్రాల నఖక్షతాలు
గాయాల మీద
చిటికెడు వెన్నెల మలాం
పొగడమీద రాలిన మంచు
రుధిరంతో కలిసిపోయింది
కలువ వలువ లోపలి నగ్నత్వం
మగత నిద్రలోకి  
తూరుపు కొండ ప్రసవించింది
వేకువ జామున
నా మరణానుభూతి
శూన్యాకాశంలోకి  
బాధాతప్త కవిత్వం
పాబ్లో నెరుడా కలంలోకి
ఇంకై ఇంకెన్‌ 
ఇప్పుడున్న బాధల్లా ఒకటే
ఆత్మకు అయిడెంటిటీ క్రైసిస్‌
ఏం పర్లేదు టచ్‌లో ఉండు
అందాకా ఈ భగవద్గీత చదువుకో!
                                                                 

Sunday 3 February 2013

గుండె నిలువుకోత పటం కూడా కవిత్వమే..!


11
రాత్రి పదకొండున్నరకి
క్యాంపస్ టెర్రస్ మీద
సోమరిగాలి వీస్తోంది
మధ్యాహ్నం కెఫెటేరియాలో
ఆ అమ్మాయి కళ్లు
పోర్ట్రెయిట్‌ ఆఫ్‌ ఏంజిల్
కట్టేసి కొట్టినట్టుగా
మనసంతా అప్రకటిత కర్ఫ్యూ
భావధారలో అచంచల సౌందర్యం
విద్యుత్ వాహకంలో ప్రాచీన కవిత్వం
సిగ్మండ్‌ ఫ్రాయిడ్
అన్‌వాంటెడ్ ఇంటర్‌ప్రిటేషన్‌
12
చూడు చూడు
ప్రకృతి పోతపోసినట్టు
నదీ నీరవంలో
పాలరాయి తేలింది
గూటిపడవలో గంధపుచెక్క
సిరామిక్ ననుపులో మోనికా సెలెస్
హిమగిరుల మీదుగా పాదరసం  
జాలువారిన ఆమె శిరోజాలు 
వానలో తడిసి మెరుస్తున్న కొబ్బరాకులు
ముక్కుపుడక మీద ముద్దుపెట్టనా
ముజ్జెగములూ ఆగిపోతాయ్‌
తొక్కలో అలారం ఆపెహె..
విద్యానగర్ చౌరస్తా వెన్నెల్లో
తిలక్ ఆడుకుంటున్నాడు
కవిత్వమంటే.,
అరఠావు అక్షరాలే కాదన్నయా..
గుండె నిలువుకోత పటం కూడా!!!  

Friday 1 February 2013

నాకు అగరొత్తుల వాసన పడదు..}}




సన్నాయిలో కల్యాణి రాగం
సలలిత రాగ సుధారస సారం
దుఃఖం ఆపుకోలేక
జ్ఞాపకాల వాంతులు
ఒడ్డున కెరటం  
భళ్లుమంది
పొన్నచెట్టు మీద
సందె వాలింది
చీకటి మీద వెన్నెల
నిశ్శబ్దంగా పాకింది
నాలుగు స్లీపింగ్ పిల్స్
జోలపాటకు కోరస్‌
వెండి దారాల
యాంబియెన్స్‌ లో
రెల్లుపూల వనం
మల్లెపూల వాసనొచ్చినా
నిద్ర మాత్రం లేదు
అయ్ వాంట్ సమ్ విస్కీ
అట్లీస్ట్ నైన్టీ ఎంఎల్
కొండంత బరువు
గుండె మీదుంది సారూ..
డాక్టర్‌ గారేమో ఏడ్వద్దన్నారు..!!
దూరంగా టూరింగ్ టాకీస్‌ మైకులో
కాశ్మీరీ లోయలో...:
అప్పడు సమయం సెకండ్ షో
మూయని రెప్పల మీద
రిపీటెడ్‌ కట్ అవే షాట్స్#
ఒంటిచుట్టూ పొగరాని కుంపట్లు
కొంచెం అత్తరుంటే జల్లవా...
ప్లీజ్ నాకు అగరొత్తుల వాసన పడదు
అబే.. ఎవడ్రా అది!!
గోడపక్కన ఉచ్చ పోసేది....??

(ఇక్కడ కొంచెం కోపంగా అడగవలెను!)