Thursday, 30 August 2012

నేనొక దిక్కుమాలిన.....


ఒకప్పుడు ఐదేళ్లకు గానీ పిల్లల్ని బడికి పంపేవాళ్లు కాదు. ఇప్పుడా సంప్రదాయం కనుమరుగైంది. రెండున్నరేళ్లకే బరబరా ఈడ్చుకెళ్లి బడిలో దిగబెట్టి వస్తున్నారు. దానికి పెట్టిన ముద్దుపేరు ప్రీ స్కూల్. ప్లే స్కూల్. అక్కడ పిల్లలకి అక్షరాలు దిద్దించరు. పుస్తకాలు ముందేసి బట్టీల్లాంటివి పట్టించరు. పిల్లలకి స్కూల్ వాతావరణం అలవాటు కావడానికి రకరకాల గారడీలు చేయిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. డీజే లాంటిది పెట్టి గంతులేయిస్తారు. వాళ్లు నవ్వితే ఫోటోలు తీస్తారు. ఏడిస్తే నోట్లో లాలీపాప్ కుక్కుతారు. ఉచ్చపోస్తే కడిగేస్తారు. మూడు నాలుగు గంటల హైరానా తర్వాత జాగ్రత్తగా ఇంటిదగ్గర దిగబెడతారు. ఈ సీన్‌ ఇక్కడ కట్ చేస్తే..
మా బుడ్డిదానికి రెండేళ్లమీద రెండు నెలలు. గొప్పలు చెప్పుకోవద్దుకానీ కొంచెం హైపర్ యాక్టివ్. గబ్బర్‌సింగ్ సినిమాలో అన్ని పాటలు తెలుసు. జులాయిలో ఓ మధూ ఓ మధూ అని హమ్మింగ్ చేస్తుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. రాత్రి ఏడింటికి ఓ దిక్కుమాలిన సీరియల్ వస్తుంది. దాని పేరు చిన్న కోడలట. అందులో ఓ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్‌ని చంపేస్తుందట. నేను ఆఫీస్‌ నుంచి రాగానే మా పాప అర్జెంటుగా  ఆ విషయాన్ని ఎక్స్‌ ప్లయిన్ చేయడానికి నానా తంటాలు పడుతుంటే మా ఆవిడ మధ్యలో అడ్డుకుని పాప చెప్పాలనుకున్న మేటర్‌ని ట్రాన్స్ లేట్ చేసి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి షాకింగ్ న్యూస్‌ రాత్రి పదిన్నరకు మా పాప బోలెడన్ని చెప్తుంది. బుడ్డిదాని టాలెంట్ చూసి ఇరుగుపొరుగు అంతా ప్రీ స్కూల్లో వేయండి మీ పాపని అని సలహాలిచ్చారు. దాంతో మా ఆవిడ యుద్ధప్రాతిపదికన ప్రీ స్కూల్ వెతకండి అని ఆర్డరేసింది. ఇక్కడ సీన్‌ కట్ చేస్తే..
ఏదో దిక్కుమాలిన పేరు. చిత్ర విచిత్రంగా ఉంది. లోపలికెళ్లాను. యూనిఫాంలో   పిప్పళ్ల బస్తాలా ఉన్న ఓ వ్యక్తి సాబ్ బోలియే అన్నాడు. బోల్తానుగానీ ముందు రిసెప్షన్‌ ఎక్కడుందో చెప్పరా బాబూ అన్నాను. ఈసారి వాడు ఇంగ్లిష్‌లో రిగార్డింగ్ అన్నాడు. వీడు వదిలేలా లేడని విషయం చెప్పాను. సోఫా చూపించి కూచో అన్నాడు. ఐదు నిమిషాలు అటూ ఇటూ చూశాను. ఇంతలో ఒకావిడ చెవుల్దాకా నవ్వుతూ విష్‌ చేసింది. నేనూ చెంపలదాకా నవ్వి హాయ్‌ అన్నాను. విషయం అడిగింది. పాపను జాయిన్‌ చేయించాలి అని నాకున్న కొద్దిపాటి ఇంగ్లిష్‌ పరిజ్ఞానంలో కన్వే చేయబోయాను. ఆవిడకి అర్ధమైంది నా బాధ. ముందు ఒక ఫాం ఇచ్చి నింపమంది. నింపాను. తర్వాత ఫీజు డిటెయిల్స్ వివరించింది. ముందుగా 12వేలు నాన్‌ రిఫండబుల్!అంతే.. అదొక్క మాటే వినిపించింది. తర్వాత ఆవిడ అంకెలు చెప్తూ పోతునే ఉంది. నేను అప్పటికే కోమాలోకి వెళ్లాను. నాకున్న రెండు ప్లాట్లకు రెక్కలొచ్చినట్టుగా.. నేను మా ఆవిడ చెరో కిడ్నీ  అమ్ముకున్నట్టుగా.. సగం లివర్‌ అమ్మడానికి బ్రోకర్‌ని మాట్లాడుకున్నట్టుగా ఏవేవో పిచ్చి కలలు. ఐదు నిమిషాల తర్వాత ఆమె వాక్‌ధాటి ఆగిపోయింది. నావైపు చూస్తూ కృతకంగా నవ్వింది. నేను ఈసారి విరేచానాలతో బాధపడుతున్నట్టుగా మొహం పెట్టి ఆముదం తాగినట్టుగా ఎక్స్‌ ప్రెషన్‌ ఇచ్చి.. ఓకే మేడం ఆలోచించి మళ్లీ కలుస్తా! అని సుప్తచేతనావస్థలోకి జారుకుని గేటు తెరిచి బయట పడ్డాను. మూర్ఛనలు పోతూ దిక్కుమాలిన ప్లే స్కూల్ బోర్డువైపు చూస్తే గుండె స్టంట్ మార్చినట్టుగా మళ్లీ ఈసారి పీడకల వచ్చింది. వెంటనే ఒక సిగరెట్ వెలిగించి ఒక కొబ్బరి బోండాం తాగి.. బండి ఫ్లై ఓవర్‌ మీదికి ఎక్కించాను.   
   

3 comments:

  1. Hmmmm....Em raayalo kooda artham kavatledhu. Paristhithulu ila maari poyayi.

    ReplyDelete
  2. మా పాప కి రెండున్నర వచ్చేసరికీ 'స్కూలూ', 'స్కూలూ' అని బంధు, మిత్ర, స్నేహ, పరివారగణం అంతా పోరు పెట్టి చంపింది. సరే అని ఓ స్కూల్లో వేసాం. అక్కడ రక రకాల కంప్లైంట్లతో ఇంకో స్కూలు వెతుక్కుని వేసాం. అలా ఫైనల్ నిర్ణయానికొచ్చేలోపు చాలా ప్రీ స్కూళ్ళు చూసాం. ఆ భయంకర అనుభవాలు గుర్తొచాయి ఇవి చదివితే.

    ReplyDelete
  3. అందుకే.. మాపాప మూడేళ్లకే పీజీ చదువుతోంది అని గర్వంగా చెప్పుకుంటూ తిరుగుతున్నాను.. ఆశ్చర్యపోకండి.. పీజీ అంటే ప్రి గార్డెన్‌!!!

    ReplyDelete