Wednesday, 1 August 2012

ఆ చేయి హిమాచలం !!

ఆయన బొమ్మ గీస్తే ఆ చిత్తరువు అచ్చెరువొందుతుంది. ఆయన వేళ్లనుంచి రూపరేఖ లావణ్య చిత్రం మరులుగొలుపుతుంది. సప్తవర్ణాల నడుమ ఆయన కుంచె మంత్ర దండంలా కనిపిస్తుంది. ప్రతీ చిత్రం మనసుని మార్దవంగా తడుముతుంది. ఆక్వా టెక్చర్‌ ఐనా ఆయిల్ పెయిటంగ్ ఐనా.. పోట్రెయిట్‌ కానీ  ఔట్‌ లైన్స్‌ కానీ! కొండపల్లి శేషగిరిరావు కుంచె విశ్వయవనిక మీద సప్తవర్ణ సొబగులు విరజిమ్మింది.
కొండపల్లి బొమ్మ గీస్తే కాన్వాసు మీద సౌందర్యం రాశులు పోసినట్టుగా ఉంటుంది. అరుణారుణ సూర్యబింబంలోంచి తారాడే మీగడ తరకల మేఘాల నడుమ ప్రకృతి వర్ణం ఆవర్ణవమై అంబారన్నంటుతుంది. స్త్రీ ఎంతటి సౌందర్య రసాధి దేవతో ఆయన కుంచె చెప్పకనే చెప్తుంది. అపురూప లావణ్య లహరులలో ఈదులాడే దేవకన్య జఘన గగన సొగసులను కాన్వాసు మీద పదిలపరిస్తే చూసే మనసు మందగమనంలో సాగుతుంది.
అడుగడుగునా అవరోధాలు. నిర్బంధ అనుభవాలు. ఆవేదనా తరంగాలు. అయినా మొక్కవోని కృషి. నిరంతర సాధన. అకుంఠిత దీక్ష. ఇవన్నీ కలబోస్తే చిత్రకళా రత్న డాక్టర్‌ కొండపల్లి శేషగిరిరావు. కొద్దిగా రంగు, ఒకచిన్న కాయితం ముక్క. ఇవి చాలు. అతని కుంచె మంత్రదండంగా మారడానికి! కొండపల్లి గీసిన ప్రతీ చిత్తరువు ఓ అపురూప కళాఖండం. ముగ్దమనోహరరంగా మనసుని రంజింప చేస్తుంది. రూపరుచిని ఆస్వాదించిన మేటి జాతీయ చిత్రకారుడు. చిత్రకళా రత్న!
వస్తువు, శిల్పం, అంతర్‌ బహిర్‌ అవగాహన. వీటికి చక్కటి ఊహను అనుసంధానం చేస్తే రూపుదిద్దుకునే చిత్రరాజం మనసు పొరల్లో గూడు కట్టుకుంటుంది. గుడికట్టి పూజలందుకుంటుంది. అలాంటి చిత్రకళకు పెట్టింది పేరు కొండపల్లి. అక్వా టెక్చర్‌, కుడ్య చిత్రాలు, పోట్రెయిట్‌, ఆయిల్ పెయింటింగ్, మ్యురల్ ఆర్ట్‌ వేయడంలో కొండపల్లి ప్రతిభ ఆసేతు హిమాచలం. తెలంగాణ తొలితరం చిత్రకారుడిగా తరిగిపోని చరిత్ర కొండపల్లి సొంతం. 
కొండపల్లి శేషగిరి రావు పుట్టింది1924లో. స్వస్థలం వరంగల్ జిల్లా మహబూబాబాద్‌. తండ్రి గోపాలరావు, తల్లి రామచుడమ్మ.చిన్నతనంలో దీనదయాల్ నాయుడు ప్రభావంతో చిత్రకళలో అభిరుచి పెరిగింది. హయగ్రీవాచారి సహాయంతో హన్మకొండలో కొంతకాలం చదువు. భూస్వామ్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కాలం కలిసి  రాక చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలు పడ్డారు. ఇటు స్టడీ, అటు పెయింటింగ్! ప్రోత్సాహం కోసం ఎందరినో ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ సమయంలో మెహ్ది నవాజ్ జంగ్ బహదూర్ దేవుడిలా సాయపడ్డారు. కొండపల్లి అభిరుచికి పట్టుకొమ్మై నిలిచారు. ఉండటానికి ఓ గది. కడుపునిండా భోజనం. చదువుకోడాని కాలేజీ సీటు ఇప్పించారు. తరువాత, బహదూర్‌ సిఫార్సుతో ఏడాది పాటు కోల్‌కతా విశ్వభారతి శాంతినికేతన్ లో సుప్రసిద్ధ చిత్రకారుడు నందాలాల్ బోస్ దగ్గర శిష్యరికం చేసి వాష్ పద్ధతి నేర్చుకున్నారు. అజంతా, ఎల్లోరా గుహాల చిత్రాలను అచ్చుగుద్దినట్టు పెయిటింగ్ వేసే మరో సుప్రసిద్ధ చిత్రకారుడు జలాలుద్దిన్  దగ్గరా  మెళకువలు నేర్చుకున్నారు. జైపూర్ బనస్థలి విద్యాపీఠ్‌ లో ఫ్రెస్కో పెయింటింగ్ పద్ధతిలో ఆరితేరారు. వృత్తి, ప్రవృత్తి చిత్రకళనే నమ్ముకునే చిత్రకళ మీదే ఆధార పడి సంసారం నెట్టుకు రావడమంటే మాటలు కాదు. జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ఇంట్లో తిండి గింజలు నిండుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఆర్టునే నమ్ముకుని సంసార బాధ్యతల్లో శేషగిరి రావు దారుణంగా వెనుక బడిపోయారు. ఎంతగా అంటే ఆయనకు ఎంత మంది సంతానమో కూడా తెలియదు. ఒకసందర్భంలో ఆయన సతీమణి గుర్తుచేసుకుని నవ్వుకున్నారు.  కళలను నమ్ముకుని, అందులోను వృత్తిధర్మంగా పెట్టుకుని జీవనం సాగించడం ఎంత కష్టమో ఆయనకి ప్రాక్టికల్‌గా తెలిసొచ్చింది. డబ్బుల కోసం నలుగురి దగ్గరా చేయి చాచాల్సి వచ్చింది. ఒక్కోసారి వారాలు చేసుకుని  బతికారు. అయినా తాను నమ్ముకున్న కళను విడువలేదు. తెలంగాణలో నిమ్న కులాల్లో ఉన్న నకాశి, పటం కథలపై పరిశోధన చేసి వాటిలో గొప్పతనాన్ని వెలుగులోకి తెచ్చిన పరిపూర్ణ జీవి. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా అరవై డెబ్బయ్‌ ఏళ్ల క్రితం సమాజంలో అంటరానితనంపై కళాసేవ చేసి నిండు జీవితం గడిపిన వాళ్లు చాలా అరుదుగా ఉంటారు.
కొండపల్లి శేషగిరి రావు. చిత్రకళలో ప్రయోగాలకు కేరాఫ్‌ అడ్రస్‌! పెయింటింగ్‌లో అక్వా టెక్చర్‌ అనే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టిన గొప్ప చిత్రకారుడు. ఆయన చిత్రాలు చూస్తుంటే నిలువెత్తు మనిషి మనతో మాట్లాడినట్టే ఉంటుంది. ఆయన సుదీర్ఘ కళా ప్రస్థానంలో దాటని మైలు రాయి లేదు. పెయింటింగ్‌లో కొండపల్లి చేయని ప్రయోగం లేదు. అక్వా టెక్క్చర్ అనే ఒక వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇవేకాక ఆయిల్ పెయింటింగ్, మ్యురల్స్ లాంటి అనేక ప్రయోగాలు చేసి సక్సెస్‌ అయ్యారు. కొండపల్లి బొమ్మల్లో ఎక్కువగా కనిపించేవి పక్షులు, వన్య మృగాలు. ఎందుకంటే ఆయన నివసించిదంతా ఆటవీ ప్రాంతం. ఆ ప్రభావం ఆయన  కాన్వాసుపై పడింది. 40వ దశకంలోనే శిల్ప చిత్రకళలో ప్రవేశం పొందారు. ఆ రోజుల్లోనే తెలంగాణ రచయితలకు సాహిత్యవేత్తలకు  అవసరమైన చిత్రాలు వేసి ఇచ్చేవారు. కొండపల్లికి చైనీస్‌ చిత్రకళలో కూడా ప్రవేశం ఉంది.
నన్నయ, పోతన, తిమ్మరసు, అక్కన్న, మాదన్న, దమయంతి, సీతారాముల చిత్రాలు కొండపల్లి సృజనకు అద్దంపడతాయి. హైదరాబాద్ అమీర్ పేటలోని మైత్రీవనంలో  టైల్స్ ఆధారంగా గీసిన అశ్వమేధం బొమ్మ కొండపల్లి సృష్టే. భారతీయ విద్యా భావన్ లో కనిపించే మ్యురల్ చిత్రాలు,  సాలార్జంగ్  మ్యూజియం లో మరొకొన్ని చిత్రాలు అన్నీ శేషగిరిరావు కుంచె నుంచి ప్రాణం పోసుకున్నవే. నిజానికి శేషగిరిరావు పెయిటింగ్స్‌ ఓ ఎడ్యుకేషన్‌. ఫైన్ ఆర్ట్స్ కాలేజీ లో ప్రొఫెసర్‌గా పనిచేసి 1984 లో రిటైర్‌ అయ్యారు. తరువాత కొంతకాలం ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కి ప్రిన్సిపాల్ గా పనిచేశారు. చిత్రకారునిగానే కాక శేషగిరిరావు ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా. ఆయన దగ్గర చిత్రకళలో శిక్షణ తీసుకున్న వాళ్ళు కూడా మేటి చిత్రకారులుగా ఎదిగారు.
1988 లో భారత ప్రభుత్వం జాతీయ చిత్రకారుడిగా  గుర్తించి ఎమిరిటస్ ఫెల్లోషిప్ ప్రదానం చేసింది. 1993 లో రాజీవ్ రత్న అవార్డు దక్కింది. 1996 లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఇప్పుడు కళారత్నగా చెప్పుకుంటున్న హంస అవార్డు 2003లోనే అందుకున్నారు.  ఆంధ్ర ప్రదేశ్ కళా అకాడమి అవార్డు కూడా పొందారు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్నప్పటికీ ప్రభుత్వం  2005 లోగానీ శేషగిరిరావుని ఫ్రీడం ఫైటర్‌గా గుర్తించలేకపోయింది. చిత్రకళకు సంబంధించిన దాని అనుబంధ కళలపై కొండపల్లి ఎన్నో గ్రంథాలు రాశారు. మాస్కో, లండన్, అమెరికా దేశాలలో శేషగిరిరావు చిత్రాల ఆర్ట్ ఎగ్జిబిషన్లు ఎన్నో జరిగాయి. లలిత కళా అకాడమీ ఫెలోషిప్‌ పొందిన శేషగిరిరావు తన జీవిత ధ్యేయం పౌరాణిక చిత్రాలను ఎంతో హృద్యంగా చిత్రీకరించడమే అంటారు. కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలానికి సంబంధించిన సుమనోహర చిత్రాలు శేషగిరిరావుకు ఎంతగానో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.
హన్మకొండ వేయిస్తంభాల గుడిలోని ప్రతిస్తంభం ఆయనకు రోజుకో పాఠం చెప్పింది. పాకాల ఒడిలో కుంచె పదునెక్కింది. రామప్ప గుడి ఆయన్ని తన హృదయాంతరాలలో నింపుకుంది. ఆ శిల్ప సౌందర్యం.. ఆ కళా సొగసులను సుదీర్ఘ, సునిశితంగా సొంతం చేసుకున్నారు. ఆయన చిత్రకళా నైపుణ్యానికి ముచ్చట పడని హృదయం లేదు. దాశరథి, సినారే లాంటి కవులు కొండపల్లి శేషగిరిరావు మీద కవిత్వం రాసేవాళ్లు. సరస కవితా విధేయ శేషగిరి రాయ అనేవారు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి.
ఆ మహాకళాకారుని మరణం తెలంగాణగడ్డకు కచ్చితంగా పూడ్చలేని లోటే.  రాతిగుట్టల మధ్య వెలసిన మొక్కలాంటి వాడు శేషగిరిరావు. సహజసిద్ధ చిత్రకారుడు తెలంగాణ తొలితరం చిత్రకారుడు లేకపోవడం విచారకరం. ఇప్పుడా మహా శిఖరం నేలకొరిగిపోయింది. చిత్రకళా మహా సముద్రం ఇగిరిపోయింది. తెలంగాణ సగర్వంగా తలెత్తుకునేలా కృషి సల్పిన మాణిక్యం మళ్లీ మట్టిలోనే కలిసిపోయింది. కొండపల్లి బొమ్మలు తరం వారికి కొత్తేమోగానీ, పాత తరం ఇళ్లలో, మనసుల్లో, గుండెల్లో, ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగా కొలువుతీరే ఉంటాయి. ఆ చిత్రకళా స్రష్టకు ససప్తవర్ణ నివాళి!!


No comments:

Post a Comment