మిసిసిపి నది వొడ్డున
ఇసుక తిన్నెల్లో
ఒరుసుక్కూర్చుని
వెన్నెల రాత్రి
నక్షత్రాలన్నీ గంపకెత్తుదామా
ఎరేజర్ పట్రావా
చందమామలో మచ్చని డిలీట్ చేద్దాం
మబ్బుల్ని కోసివ్వనా
తలగడలాగా పెట్టుకుంటావా
దాహమేస్తోంది
కళ్లతో నిను తాగేయనా
వద్దులేః
రుషులు వాయుభక్షణ చేసినట్టు
నేనూ అలా కృషి చేస్తా
ఈ ఈదురుగాలిలో
కాసిని చితుకులు రాజేయనా
నీ సోమరి చూపుల మీద
ఒడ్డుకు కొట్టుకొచ్చిన నురగ అద్దనా
ఏరుకున్న శంఖాలతో
నీ మెడ అలంకరించనా
కాపీరైట్స్ కోసం
స్వర్గం సీఈవోకి టెలీగ్రాం పంపిద్దామా
క్షీరసాగరమథనమా..
నన్నడిగితే అదో రిస్కీ ఫీట్
ప్రియురాలి అధరాల్ని క్రషించి చూడు
కురిసేదంతా అమృతధారే కదా!
ఔనూ..
మీకు శరత్కాలాల్నీ శిశిర రుతువుల్నీ
కలిపి కుట్టడం వచ్చునా
వెన్నెల జలపాతాల్నీ సెలయేటి పాయల్నీ
కలిపి పుక్కిలించి ఉమ్మేయడం తెలుసునా
కొండగాలికి నగ్న దేహాల్ని
ఆరబెట్టుకోవడం వచ్చా
అంతఃపురంలో సుఖపడని రాణుల
ఆత్మల్ని వెంటేసుకు తిరగడం తెలుసా
సిపాయి సిక్స్ ప్యాక్ మడతల్ని చూసి
మెహించిన రాచకన్య విరహవేదనని
తీర్చడం వచ్చా
మరి ఏకాంత మందిరంలో
యువరాణితో రహస్యాలింగనం
అరెస్ట్రా కలిగ్యులా
అన్‌సెన్సార్డ్ ఫిలింలా మారిపోవాలనుందా
ఏథేను వనం
ఒక ఆడం ఒక ఈవ్
ఒక రాజేశ్వరి ఒక అమీర్
ఒక నేను ఒక ఆమె
నమస్కారం చలంగారూ
దయచేసి మా లవ్ స్టోరీని
మైదానం సీక్వెల్‌గా రాస్తారా
No comments:
Post a Comment