Tuesday, 25 September 2012

మీకు రక్తపు వజ్రాల గురించి తెలుసా??




ఆ దేశంలో వజ్రాలు గులకరాళ్లు దొరికినంత విరివిగా దొరకుతాయి. అడుగుకో క్వారీ ఉంటుంది. జనమంతా నిత్యం వజ్రాల వేటలోనే ఉంటారు. కానీ ఆ దేశం ఆర్ధిక స్థితి మాత్రం అడుక్కుతినే స్థాయిలో ఉంది. నిత్య దరిద్రం. నిత్యం రక్తపాతం. నిత్యం ఆకలి చావులు. అనుక్షణం భయం భయం. తవ్వినా కొద్దీ రక్తపు వజ్రాలు బయటపడుతుంటాయి.
వాయిస్
భూమిలోలోపల పొరల్లో అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర ఘనీభవించిన కార్బన్‌ అణువుల నుంచి పుట్టిందే వజ్రం. సృష్టిలో అత్యంత కఠినమైన పదార్థాల్లో ఇదొకటి. కర్బన పరమాణువుల మిశ్రమం వల్ల వజ్రానికంత కాఠిన్యం వచ్చింది. చరిత్ర ప్రసిద్ధి గాంచిన డైమండ్స్ అన్నీ ఇండియాకు చెందినవే అయినా,1867 తర్వాత దక్షిణాఫ్రికా, బోత్స్వానా, నమీబియా, కెనాడా దేశాలు ఉత్పత్తిలో ముందున్నాయి.

మిగితా దేశాల సంగతి పక్కన పెడితే.. దక్షిణాఫ్రికా గురించి కొంచెం విషాదంగా మాట్లాడుకోవాలి. అక్కడి నేలనిండా అపార నిక్షేపాలున్నాయి. బంగారం, ప్లాటినం, వజ్రాలు పుష్కలంగా దొరుకుతాయి. అలాంటప్పుడు దేశ ఆర్ధిక ప్రగతి ప్రపంచాన్నే శాసించే విధంగా ఉండాలి. కానీ లభిస్తున్న వనరులకూ ఆ దేశ ఎకానమీకి జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌ ఉంది.

1867 నుంచి ఇప్పటిదాకా వజ్రాల మూలంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొంపాగోడు వదులకుని కాందీశీకుల్లా తరలిపోయారు. వేలమంది ఆడాళ్లు అత్యాచారానికి గురయ్యాయి. ఊచకోత. రక్తపాతం. యుద్ధం. బీభత్సం. భయానకం. అనుక్షణం భయంభయం. ఎందుకు? వజ్రాలకూ రక్తపాతానికి లింకేంటి? జాతిసంపద అస్థిత్వానికి ప్రశ్నార్ధకంగా ఎందుకు మారింది? తవ్వుతుంటే రక్తం అంటిన వజ్రాలెన్నో బయటకొస్తాయి! కొద్దిగా కాలాన్ని వెనక్కితిప్పితే.. వజ్రాల మాటున దాగిన యథార్థ గాధలు కళ్లముందు  కదలాడుతాయి!
స్పాట్..
వాయిస్
దక్షిణాఫ్రికా అపార సంపద చూసిన చూసిన అగ్రరాజ్యాలకు కన్ను కుట్టింది. సరిగ్గా అక్కడే ఆధిపత్య పోరు మొదలైంది. వలస పాలనకు బీజం పడింది.  రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వజ్రాల పోరాటం ప్రారంభమైంది. బ్రిటిష్‌ సైన్యంలో పనిచేస్తున్న సియెర్రా లియోన్‌ వాసులు తమ దేశానికి తిరిగి వచ్చాక అసలు కథ ఆరంభమైంది. ఇతర ఆఫ్రికా దేశాలకు భిన్నంగా సియోర్రా భూమిలో అన్ని జోన్లలో వజ్రాలు లభిస్తాయి. అందుకే అక్కడ దోపిడీ తేలికైంది. యుద్ధం నుంచి వచ్చిన స్థానికులు ఐదు, ఆరు దశకాలలో అక్రమ మైనింగ్‌ను ఆరంభించారు. స్థానిక మార్కెట్లలో వాటిని విక్రయించటం మొదలుపెట్టారు. అవి ఓపెన్‌ ఫీల్డ్స్‌ కావటం వల్ల భద్రత, రక్షణా అసాధ్యమైపోయాయి.

స్థానికులు అక్రమంగా వజ్రాల అన్వేషణ చేయకుండా బ్రిటిష్‌ పాలకులు పోలీసులను నియమించారు గానీ లాభంలేకపోయింది. యుద్ధం నుంచి తిరిగొచ్చిన సైనికుల పుణ్యాన అక్రమ మైనింగ్‌ వ్యాపారులు యుద్ధ తంత్రాలనూ వంటబట్టించుకున్నారు. అలా అక్రమ మైనింగ్‌ మూడు పువ్వులు ఆరుకాయలుగా విలసిల్లింది. ఈ క్రమంలో సియెర్రా లియోన్‌కు కావలసిన మార్కెట్‌ను లెబనాన్‌ సమకూర్చింది. వజ్రాల వాణిజ్యాన్ని, మార్కెట్‌ సౌకర్యాన్ని కల్పించటంతో పాటు సియెర్రా స్థానికులకు మందుపాతరలకు కావలసిన సామాగ్రిని సమకూర్చి పెట్టింది.

మొత్తానికి ఈ వజ్రాలు లైబీరియా బాటపట్టాయి. అక్కడ్నుంచి మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో ఊపందుకుంది.  అదే సమయంలో ఆధిపత్యం కోసం డి బీర్స్‌ సంస్థ నడుం బిగించింది. అంగోలా, సియెర్రా లియెన్‌ తదితర పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి ఆ సంస్థ వజ్రాలను భారీగా కొనుగోలు చేసింది. సరఫరా తక్కువగా, ధరలు ఎక్కువగా ఉండేలా మార్కెట్‌ వ్యూహం పన్ని వజ్రాలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి దాచిపెట్టేది. అదే కంపెనీ డైమెండ్‌ ఈజ్‌ ఫర్‌ ఎవర్‌ అనే నినాదాన్ని ప్రచారం చేసి డిమాండ్‌ను విపరీతంగా పెంచింది. దీనివల్ల యావత్‌ ఆఫ్రికాలో వజ్రాల డిమాండ్‌ భయంకరంగా ఊపందుకుంది.
  
పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే - వజ్రాల మైనింగ్‌ కోసం వివిధ దేశాల అధిపతులు, నియంతలు ఎంతటి కిరాతకానికైనా తెగించారు.  వజ్రాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల దరిచూపులకు రాకుండా ఉండేందుకు స్థానికులను మట్టుబెట్టేవారు. కాళ్లూ చేతులు తెగనరికేవారు. వజ్రాలు తవ్వకానికి, ఏరటానికి మహిళలను, చిన్న ప్లిలలతో వెట్టి చాకిరీ చేయించారు. అలా మొదలైన డిక్టేటర్‌ షిప్‌.. ఆయుధాలు సమకూర్చుకునేదాకా పోయింది. ఆధిపత్యం కోసం అస్థిరత సృష్టించటానికి తిరుగుబాట్లు, ప్రచ్ఛన్న యుద్ధాలు మొదలయ్యాయి.

సియెర్రా లియోన్‌లో తిరుగుబాటు సంస్థ రెవల్యూషనరీ యునైటెడ్‌ ఫ్రంట్‌.. రఫ్‌ ప్రజలను దారుణంగా హతమార్చింది. కాళ్ల్లూ చేతులూ తెగనరికింది. గ్రామాలకు గ్రామాలను ఖాళీ చేయించి అధీనంలోకి తెచ్చుకుంది. ఈ క్రమంలో లక్ష మందికి పైగా అమాయక ప్రజలు హతమయ్యారు. మరో 20 లక్షల మంది సియెర్రా లియోన్‌ను వదిలి పరారయ్యారు. గత కొన్నేళ్లుగా ఆఫ్రికాలో 40 లక్షల మంది మరణించారని అనధికారిక లెక్కలు చెప్తున్నాయి.

ఒక్క సియెర్రా లియోన్‌ మాత్రమే కాదు. మొత్తం పశ్చిమ, మధ్య ఆఫ్రికా వజ్రాల మైనింగ్‌ రక్తసిక్తమైంది. సియెర్రా లియోన్‌ నుంచి ఈ విష బీజాలు లైబీరియాకు, అక్కడి నుంచి అంగోలా, కాంగోలాకు పాకాయి. భౌగోళిక రీత్యా అంగోలా ఒక హాట్‌స్పాట్‌గా మారింది. రక్తపాత వజ్రపు తవ్వకాల వల్ల అది దారుణంగా దెబ్బతిన్నది. అవినీతితో కూరుకుపోయిన ఆఫ్రికా దేశాల అసమర్థ మరింత దిగజార్చింది. అంగోలా డైమండ్‌ మైనింగ్‌లో పనిచేసే కార్మికులు ఇప్పటకీ దోపిడీకి గురువుతున్నారు. బానిసల్లా బతుకుతున్నారు. ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో  పనిచేస్తున్నారు.    
   
డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోదీ అలాంటి కథే. ఇతర అనేక ఆఫ్రికన్‌ దేశాల మాదిరిగానే రెబెల్స్‌ వల్ల ఆ దేశం గుల్లయింది. అధిపత్యం కోసం నిరంతరం ప్రభుత్వంతో ఘర్షణ జరిగేది. దీనివల్ల జింబాబ్వే, సూడాన్‌లకు మించిన సంక్షోభం నెలకొంది. వజ్రపు క్షేత్రాలను హస్తగతం చేసుకోవటం, అడ్డొస్తే ఊచకోత షరా మామూలైంది. 1998 నుంచి కాంగోలో యుద్ధం వల్ల 17 లక్షల మంది మృత్యువాత పడ్డారు.  మొత్తం ఆరోగ్య వ్యవస్థ ధ్వంసం జరిగింది. పేదలు ఆకలికి అలమటించి చనిపోయారు. 1999-2000 సంవత్సరంలో రోజుకు సుమారు 2,600 మంది అసువులు బాసారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు! ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే- కాంగో దేశంలో ప్రపంచంలోని మొత్తం వజ్రాల్లో 26 శాతం అక్కడే దొరుకుతాయి . కానీ అది ప్రపంచంలోకెల్లా అత్యంత నిరుపేద, రుణభార దేశాల్లో ఒకటి. కాంగోలో 1.5 కోట్ల మంది పౌష్ఠికాహార లోపంతో బాధ పడుతున్నారు. 80 శాతం మంది సురక్షిత తాగునీరు లేదు. 70 శాతం మందికి తినేందుకు నాలుగు మెతుకులు లేవు. ఆఫ్రికాలోకెల్లా అత్యంత ఎక్కువ శిశు మరణాల రేటు అక్కడే ఉంది. వీటన్నికంటే విషాదమేంటంటే.. కాంగో ప్రపంచంలోనే ఏ వన్‌ రేప్‌ కాపిటల్. ఇప్పటిదాకా అక్కడ కొన్ని లక్షల మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు.    

ఈ అక్రమ వజ్రాల వ్యాపారాన్ని అదుపు చేయకుంటే ఈ జాఢ్యం ప్రపంచవ్యాప్తంగా  వేళ్లూనుకుంటుంది. అందుకే బడా సంపన్నవర్గాలు తక్షణం వజ్రాలపై తమ మోజును తగ్గించుకోవాలి. లేదంటే ధరను, కృత్రిమ కొరతను నివారించాలి. లేదంటే ఈ డిమాండ్ సప్లయ్‌ తేడా ప్రపంచాన్నే కూలదోస్తుంది. అమానుష దారుణకాండ మొత్తం ప్రజాస్వామిక వ్యవస్థనే అపహాస్యం చేస్తుంది. అంతిమంగా నియంతలదే రాజ్యమతుంది. వారిదే భోజ్యం అవుతుంది.


3 comments:

  1. టైటిల్ చూసి ఆసక్తికరంగా చదవటం మొదలు పెట్టాను కానీ, ఇంత బాధాకరమా? ఎంత దారుణం? అక్కడి ప్రజలు ఎదురు తిరిగి, ఇలా దోచుకునే వాళ్ళని ఏమీ చేయలేరా? చాలా బాధగా ఉందండీ!

    ReplyDelete
  2. అంతేకదండీ.. బలం బలగం ఉన్నోడిదే రాజ్యం. వాళ్ల పదఘట్టనల కింద బక్కోడు నలిగిపోవాల్సిందే! అది వజ్రాలైనా .. వరి గింజలైనా!!

    ReplyDelete
  3. బ్లడ్ డైమండ్స్ గురించికొంతవిన్నాను కాని వాటివెనుక ఇంత విషాదం దాగివుండటం ఘోరం.

    ReplyDelete