Wednesday, 2 January 2013

సీత.. చదువుల తల్లి!!


ఆడపిల్ల అందునా  అవిటితనం ఉంటే సమాజంలో నెగ్గుకురావడం కష్టం. కానీ అవేవే అవరోధాలు కాదని నిరూపించింది. రెండు కాళ్లు, రెండు చేతులు లేకున్నా డిఎస్సీలో టీచర్  గా సెలెక్ట్ అయి భావితరాలకు పాఠాలు చెప్పబోతున్నది!

బతకాలంటే ఎలాగోలా బతకొచ్చు. కానీ ఒకలా బతకాలంటే గట్స్ ఉండాలి. అందునా అవిటితనం ఉంటే జీవితం ఇంకా ఛాలెంజింగ్‌ ఉంటుంది. అలాంటి ఆటుపోట్లను సీత ఎన్నో ఎదుర్కొంది. సీత అని  పేరున్నందుకే కావొచ్చు అన్ని కష్టాలు. అయినా అవన్నీ ఒంటిచేత్తో తీసేసింది. కాళ్లు సహకరించవు. చేతులకు పట్టుదొరకదు. పట్టుమని ఐదు నిమిషాలు నిలబడలేని అసహాయత. అయితేనేం.. అవన్నీ సీత సంకల్పం ముందు బలాదూర్! పేరుకే సీత. చదువులో సరస్వతి. పుట్టుకతోనే రెండు పాదాలు, రెండు హస్తాలు దేవుడీయలేదు. అయిన సరే ఈ పోటీ ప్రపంచంతో పాటు పరుగులు తీసింది.   వేళ్లు లేని చేతులతో పోటీ పరీక్షలు రాసి శెభాష్ అనిపించుకుంది. సొంతూరు వరంగల్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం! తండ్రి లక్ష్మీనర్సయ్య వ్యవసాయ కూలీ!  ఒక్కగానొక్క బిడ్డ. అదీ ఆడబిడ్డ. పైగా అవిటితనం. భవిష్యత్ అంతా శూన్యం అనుకుంటూనే పెంచి పెద్ద చేశాడు. 
కానీ సీత తండ్రిలా అధైర్యపడలేదు. అవిటితనం ఆమె దృష్టికి కూడా రాలేదు. అయ్యో పాపం అనే జాలి మాటలతో కాలం వెళ్లదీయలేదు. అవే మాటలతో ఆత్మస్థయిర్యాన్ని కూడదీసుకుంది. నేలపై నిలవలేని కాళ్లకు నడకనేర్పింది. పెన్నునే ఆయుధంగా మణికట్టుతో ఒడిసిపట్టింది. చదువుల తల్లిని నమ్ముకుని అక్షర సేద్యం చేసింది. చదువే బతుకు నిలబెడుతుందని ఆశ పెట్టుకుంది. చదువే జీవితానికి వెలుగునిస్తుందని నిర్ణయించుకుంది. బరిగీసి పుస్తకాలతో కొట్లాడింది. పెన్నుతో యుద్ధం చేసింది. అక్షరాలను లొంగదీసుకుంది. 
తండ్రికి ఆర్ధిక స్థోమత లేకపోయినా కూతురు పట్టుదలను చూసి ముచ్చటపడ్డాడు. ప్రైవేటు బడికి పంపివ్వలేకపోయానే అని బాధపడ్డాడు. కానీ సీతకు మాత్రం బడి ప్రైవేటుదా సర్కారుదా అని ఆలోచించలేదు. చదవాలన్న సంకల్పం ఉంటే ఏ బడైనా ఒకటే అనుకుంది. పదో తరగతిలో మంచి మార్కులు సాధించింది. ప్రైవేటు కాలేజీలు పిలిచి ఇంటర్‌లో సీటిచ్చారు.  అక్కడ కూడా డిస్టింక్షన్ కొట్టింది. డిగ్రీలో కూడా ఫ్రీ అడ్మిషన్ దొరికింది. అక్కడా డిస్టింక్షన్. ఇక సీతకు ఎదురు లేకుండా పోయింది. డీఎడ్ కోసం మొదటిసారి పరీక్ష రాసింది. ట్రైనింగ్‌లోనూ సత్తా చూపించి డిస్టింక్షన్ సాధించింది. తర్వాత 2012 డిఎస్సీ కి ఎంపికైంది. 300 ర్యాంకు సాధించి టీచరమ్మ అయింది. పిడికిలి బిగించి చేతి గీతలు మార్చుకున్న సీతమ్మకు హాట్సాఫ్!!    

2 comments:

  1. Hats off to her courage.
    Really she deserves more than that.

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు పిడక గారూ..
      సీత లాంటి అమ్మాయిలు అందరికీ ఆదర్శం కావాలి

      Delete