బుగ్గన
సౌగంథిక తాంబూలం.. భుజం మీద చెయ్యేసి పక్కనే ఓ సౌందర రూపం. ఈ రెండూ లేనిదే కలం
కవనాన్ని చిలకదు. చిలికినా చిక్కగా పలకదు. అని శృంగార నైషధంలో శ్రీనాథ
కవిసార్వభౌముడంటాడు. పోకమ్రాకుల మహిమ కప్పురపు కేళి అని చేమకూర వేంకట కవి తాంబూలం
ప్రాముఖ్యతను తేటతెల్లం చేశాడు. రమణీ ప్రియ దూతిక తెచ్చి ఇచ్చె కప్పురపు విడెము
అని అల్లసాని పెద్దన ఆనాడే తాంబూలం మీద నోరు పారేసుకున్నాడు. నాలుకను పండించినా..
నోరును మండించినా కిళ్లీకే చెల్లింది. కొంచెం కారంగా.. కొంచెం గారంగా ఊరిస్తూ
ఉమ్మేస్తూ తినే ఆకూ వక్కల్ని మనమూ కాసేపు నమిలేద్దామా...
నవనవలాడే
లేత తమలపాకులు.. నవనీతంలా మెరిసే గవ్వసున్నం..జాజికాయ జాపత్రి.. చిటికెడు కాసు..
నాలుగు పచ్చివక్కలు.. చిటికెన వేలంత మలిచి బుగ్గన పెట్టుకుని కొంచెం కొంచెంగా
నములుతూ.. తియ్యగా తగిలినప్పుడల్లా
మింగేస్తూ.. కారంగా అనిపించినప్పుడల్లా ఉమ్మేస్తూ ఉంటే.. ఓహ్ ఆ అనుభూతే
వేరు కదా. అప్పుడనిపిస్తుంది.. తాంబూలం సేవించు జిహ్వ జిహ్వ అని!
నిజానికి
కిళ్లీకున్న చరిత్ర ఈనాటిది కాదు. చిలకలు..సరసానికి మధుర గుళికలు అని కవులు
తాంబూలానికి ఆనాడే అగ్రతాంబూలమిచ్చారు. వాత్సాయనుడు కూడా శృంగారానికి కావాల్సిన
పదహారు అంశాల్లో తాంబూల సేవనాన్ని ప్రస్తావించాడు. షడ్రుచులతో భోం చేసి.. ఓ లేత
తమలపాకు మీద గవ్వ సున్నాన్ని అంటీ అంటనట్టు రాసి.. అందులో రెండు వక్కలేసుకుని..
పంటికింద పెట్టుకుని తూగుటూయల మీద కూర్చుని మత్తేభానికి ముకుతాడు వేసేవారట ప్రాచీన
కవులు. ఆనాటి కిళ్లీ సాంప్రదాయపు ఘుమఘుమలు ఇంకా మన ముక్కు పుటాలను
తాకుతున్నాయంటే.. అది కచ్చితంగా ఆకూ వక్కల మహిమేనని అర్ధం చేసుకోవచ్చు.
రేయి నల్లవక్కలు.. లేత పచ్చ ఆకులూ..
వెన్నెలలాంటి సున్నమూ ఈ మూడూ కలిసి మెలిసినప్పుడే అరుణమందారం అంటూ సినీ కవులు
ఎప్పుడో మనసు పారేసుకున్నారు. పెరట్లో కొబ్బరి చెట్టు.. దానికింద నవారు మంచం.. లేత
కొబ్బరాకుల సందుల్లోంచి వెండి వెన్నెలలు కురుస్తుంటే.. తామర తూళ్లలాంటి వేళ్లకు
చుట్టిన చిలకల్ని నోటికందించే తెలుగింటి మగువలూ మనకు పరిచయమే.
ఒక పాన్
షాపుకు వెబ్‌సైట్ ఉండటం మీరెప్పుడైనా విన్నారా? పోనీ పేపర్లో టెన్ బై త్రీ యాడ్‌గానీ
చూశారా? వీలైతే కొన్ని లోకల్ మేగజైన్లు తిరగేయండి. అందులో సౌతిండియాలో మొట్టమొదటి
ఎయిర్ కండీషన్డ్ పాన్ షాప్ గురించి అద్భుతమైన ఫీచర్ ఒకటి కనిపిస్తుంది.
దానిపేరే పివిఎస్ పాన్ మహల్.
సికింద్రాబాద్
ప్యారడైజ్ ఎదురు గల్లీలో ఓ చోట కార్లన్నీ బారులు తీరి కనిపిస్తయ్. వాటిని
తప్పించుకుంటూ లోపలికి పోతుంటే.. సుగంధ పరిమళాలేవో రారమ్మని మన ముక్కుపుటాల్ని కమ్మగా
తాకుతుంటాయి. ఆ వాసన ఎక్కడిదో కాదు. పీవీఎస్ పాన్ మహల్‌ది. ఫస్ట్ టైమ్
దీంట్లోకి పోయినవాళ్లెవరైనా ఈ పాన్లని చూసి కన్ఫ్యూజ్ కావాల్సిందే. మీఠా పాన్,
చందన్ చట్నీ, గోల్డెన్, కేసర్, ఖుష్, కస్తూరి, ఖిమామ్, లాల్‌ప్యారీ,
రాంప్యారీ, మీనాక్షి.. ఇలా ఒకేసారి మన కళ్లకి 50 రకాల పాన్లు దర్శనమిస్తాయి.
అప్పుడనిపిస్తుంది. మైగాడ్.. ఏ పాన్ తినాలబ్బా అని. ఇక షాప్‌లోకి అడుగుపెట్టగానే
హోటల్లోలాగా మన ముందుకు మెనూ వచ్చి పడుతుంది. 23 రకాల చట్నీస్ స్పెషల్ పాన్లు, 8
రకాల జర్దా బేస్డ్ కిళ్లీలు ఇలా చెప్పుకుంటూ పోతే అనంతం. అన్నట్టు అక్కడ ఫస్ట్
నైట్ పాన్ కూడా దొరుకుతుంది. దాని రేటు వెయ్యికి పైగా ఉంటుంది! ఈసారి మీరెప్పుడైనా సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గరికి పోతే.. ఈ పాన్‌మహల్‌ని సందర్శించండి! అంతే.. మీ దవడల్లోకి ఇంతలావు పాన్ అట్టే దూరిపోతుంది!
No comments:
Post a Comment