Friday, 4 January 2013

నేనూ.. మా ఆవిడ.. ఓ కాసుల పేరు !!!!



రోజూ రాత్రి పదకొండున్నరకు ఇద్దరం కూచుని భోం చేశాక.. సింకులో సాయంత్రానికి పోగైన వంటపాత్రలు గట్రా శుబ్బరంగా తోమి, ఎక్కడివక్కడ నీట్‌గా సర్ది, బయట లైట్ ఆఫ్ చేసి, డోర్‌ కర్టెన్‌ లాగుతూ మెల్లగా మొదలెడుతుంది. ఏవండీ ఒక రవ్వల నెక్లెస్! ఏవండీ ఒక పచ్చల హారం! ఓనర్‌ ఆంటీవాళ్లు ఇవాళ కెంపుల హారం కొన్నారట తెలుసా? కళ్యాణ్‌ జివెల్రీస్‌లో మేకింగ్ చార్జీలు లేవట! మలబార్‌ గోల్డ్‌ వాళ్లు ఇస్తున్న యాడ్ ఈసారి డిఫరెంట్ గా ఉంది కదా! మధ్యలో ఈ మలబార్‌ గోల్డ్‌ ఎందుకొచ్చిందో అర్ధంకాదు.జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టయిల్ మార్చాడు దరిద్రంగా ఉంది! దానికో ఎదవ ఫీడ్‌ బ్యాక్‌ ఒకటి! ఎంతైనా ఖజానా జివెల్రీ గోల్డే గోల్డ్‌ కదాండి! చిన్నదాని చెవిదిద్దులు కొని మూడేళ్లయినా అదే మెరుపు. అన్నట్టు ఇవాళ పేపర్లో చదవాను.. చిదంబరం బంగారం మీద ఏదో కుట్ర చేస్తున్నట్టున్నాడు. వన్ బై వన్‌ నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఒకేసారి ఎత్తేసినట్టు.. ఇలా ఒకదానికొకటి ఎన్ని లింకుల్లేని సంగతులు చెప్పినా అందులో లీడ్ మాత్రం ఒకటే. ఐ వాంట్ నెక్లెస్. ఎక్కువ అడగటం లేదు. ఒక రెండు లకారాలివ్వండి ! నేనేమైనా తక్కువా? ఈ సోది రోజూ ఉండేదే! అని పట్టించుకోకుండా పొద్దున మిగిలిన పేపర్‌ తాలుకు మధ్య పేజీల్లో అర్ధం కాని బిజినెస్ పదాలు చదువుతూ భార్యామణి మాటలు ఈ చెవిలో వేసుకుని ఆ చెవి నుంచి తీసేస్తుంటాను..

అయినా ఈ తీర్మానం ఇప్పటిది కాదు. మూడేళ్లుగా ఏకాభిప్రాయం లేదు. ఒకసారి ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టింది. వాళ్ల వాళ్లు- మా వాళ్లు. నెక్లెస్ కోసం నెక్లెస్‌ రోడ్డులో పెద్ద ఉద్యమమే నడిపింది. నేను మాత్రం తెలంగాణపై చంద్రబాబులా తప్పించుకుని ఆఫీస్ యాత్ర చేస్తునే ఉన్నాను. గతంలో నేను మీ ఇంటికి లేఖ కూడా రాశాను. ఇప్పుడూ అదే చెప్తున్నాను అంటూ ఏ పూటకి ఆ పూట వాయిదా వేసుకుంటూ వచ్చాను.
చివరికి సమయం రానే వచ్చింది. షిండే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత నెల రోజుల గడువులా నేనూ ఓ డెడ్‌ లైన్‌ బ్యాంగ్ వేశాను. 30రోజుల కౌంట్ డౌన్‌ మొదలైంది. నాలో గుండెదడ మొదలైంది. హామీ అయితే ఇచ్చాను... డిసెంబర్ 9లాంటి ప్రకటన చేశాను. మరి పైసలెట్టా? పదా ఇరవయ్యా? రెండులక్షల వరహాలు కావాలట! నేనేమైనా తానీషా రాజ్యంలో రామదాసులా తహశీల్దారునా? సాయంత్రాలు ఫణంగా పెట్టి ఉద్యోగం వెలగబెడుతున్న జర్నలిస్టుని. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇంకా గుర్తింపు రాని (ఇంకా మందుకొట్టని) విలేకరిని! 

మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే ఆ రోజు నేను లీవ్ కూడా పెట్టాలట! ముందురోజు రాత్రి నాకు నిద్ర లేదు. డబ్బులు పోతున్నాయని ఒకటే కలత నిద్ర! మా ఆవిడకీ నిద్ర లేదు. ఎప్పుడెప్పుడు కొందామా.. ఎప్పుడెప్పుడు మెడలో వేసుకుందామా.. పిన్ని వాళ్ల ముందు సంక్రాంతికి బడాయి పోవాలా అని! మొత్తానికి వెళ్లాం. ముందు ఖజానాకి. అక్కడ నాలుగైదు డిజైన్లు చూశారు. నచ్చలేదు!! ఒకదానికి రాళ్లెక్కువున్నాయట! ఒకదానికి మువ్వలు లేవట!! ఒకదానికి కటింగ్ కరెక్టుగా లేదట!!! అన్నీ బావున్న దానికి బ్యాక్ చైన్‌ లేదట! బాప్‌రే.. ఆ గంటలో నాకు ఎంత జ్ఞానం సమకూరిందో!! 
ఇక లాభం లేదనుకుని కాళ్లీడ్చుకుంటూ కల్యాణ్‌లోకి అడుగుపెట్టాం. నన్ను చూడగానే వాడు గుర్తుపట్టాడు. ఎందుకంటే అప్పుడెప్పుడో ఓ దిక్కుమాలిన స్కీం పేరుతో వాడు నెలకు వెయ్యి రూపాయల టోపీ పెట్టాడు. ఇక ఆ రోజునుంచి నేను రెగ్యులర్‌గా  నెలకోసారి కౌంటర్ దగ్గరికి వెళ్లడం.. స్కీంలో డబ్బులు కట్టడం!!  అలా గుర్తుపట్టాడన్నమాట నన్ను వాడు. నిర్వేదపు నవ్వు వాడి మొహాన విసిరేసి.. హారాలు కొలువుదీరిన చోటికి వెళ్లి కూలబడ్డాం. మళ్లీ ఖజానా కథే రిపీటవుతోంది. ఈసారి నాకు తిక్కరేగింది. కొంటే కొనండి లేదంటే నేను జంప్ అని అల్టిమేటం జారీ చేశాను. ఎట్టకేలకు ఓ కాసులపేరు దగ్గర మా ఆవిడ ఫిక్సయింది. దాని ఎస్టిమేషన్ వేయడం మొదలెట్టాడు సేల్స్ మేన్. తరుగు.. మేకింగ్ చార్జీలు.. ఇన్షూరెన్స్, వ్యాట్, ఆ రోజు రేట్.. షాప్‌ ఖర్చులు, సిబ్బంది జీతాలు, కరెంటు, ఏసీ బిల్లు, హౌజ్ కీపింగ్, సెక్యూరిటీ, పార్కింగ్, తొక్కా తోలు అన్నీ కలిపి లక్షా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల చిల్లర దగ్గర వచ్చి ఆగాడు. నాకు గుండె ఆగినంత పనైంది.. బాటా చెప్పుతో నాకు నేను కొట్టుకోవాలనిపించింది...
 
అప్పటికే నా రెండు క్రెడిట్ కార్డులకు గజ్జిలేచింది! (ఐ మీన్‌ గీకీగీకీ..) ఉన్నది ఒకే ఒక డెబిట్ కార్డు. దానికీ ఆల్రెడీ ఒళ్లంతా పచ్చిపుండులా ఉంది. ఎందుకంటే నెలలో పదిహేను రోజులు ఏ ఏటీఎంలో పడితే ఆ ఏటీఎంలో గోకుడే గోకుడాయె! మళ్లీ వాటికి పనిపడింది. బిల్‌ రెడీ అయింది. భారంగా కౌంటర్ దగ్గరికి నడిచాను. మూడు కార్డులు వాడిచేతిలో పెట్టాను. కాసుల పేరు మా ఆవిడ చేతిలో పెట్టాను.  ఆమెను, వాళ్ల నాన్నను ఆటో మాట్లాడి ఇంటికి పంపించాను. 
ఐదు గంటల హడావిడి తర్వాత, తల పట్టేసినట్టయింది. కళ్లు బైర్లు కమ్మాయి. మైకం వచ్చినట్టుగా ఉంది. ఒళ్లంతా తిమ్మిరి పట్టింది. నాలుక పిడుచగట్టుకు పోయింది. కడుపులో దేవేసినట్టు.. రకరకాల ఫీలింగ్స్. తూలుతూ తూలుతూ నడిచాను. గుండెల నిండా సిగరెట్  తాగాలనుకుని పాన్ షాప్ ముందుకు వెళ్లాను. జేబులు తడుముకుని చూద్దునుగదా.. ఆరు రూపాయలకి ఒక రూపాయి తక్కువుంది! థూ.. నా బతుకు చెడా!! అని తిట్టుకుంటూ పంజాగుట్ట చౌరస్తాలో దిక్కుతోచని బాటసారిలా సిగ్నల్‌ వంక పిచ్చిపిచ్చిగా చూస్తూ ఉండిపోయాను.

Wednesday, 2 January 2013

సీత.. చదువుల తల్లి!!


ఆడపిల్ల అందునా  అవిటితనం ఉంటే సమాజంలో నెగ్గుకురావడం కష్టం. కానీ అవేవే అవరోధాలు కాదని నిరూపించింది. రెండు కాళ్లు, రెండు చేతులు లేకున్నా డిఎస్సీలో టీచర్  గా సెలెక్ట్ అయి భావితరాలకు పాఠాలు చెప్పబోతున్నది!

బతకాలంటే ఎలాగోలా బతకొచ్చు. కానీ ఒకలా బతకాలంటే గట్స్ ఉండాలి. అందునా అవిటితనం ఉంటే జీవితం ఇంకా ఛాలెంజింగ్‌ ఉంటుంది. అలాంటి ఆటుపోట్లను సీత ఎన్నో ఎదుర్కొంది. సీత అని  పేరున్నందుకే కావొచ్చు అన్ని కష్టాలు. అయినా అవన్నీ ఒంటిచేత్తో తీసేసింది. కాళ్లు సహకరించవు. చేతులకు పట్టుదొరకదు. పట్టుమని ఐదు నిమిషాలు నిలబడలేని అసహాయత. అయితేనేం.. అవన్నీ సీత సంకల్పం ముందు బలాదూర్! పేరుకే సీత. చదువులో సరస్వతి. పుట్టుకతోనే రెండు పాదాలు, రెండు హస్తాలు దేవుడీయలేదు. అయిన సరే ఈ పోటీ ప్రపంచంతో పాటు పరుగులు తీసింది.   వేళ్లు లేని చేతులతో పోటీ పరీక్షలు రాసి శెభాష్ అనిపించుకుంది. సొంతూరు వరంగల్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం! తండ్రి లక్ష్మీనర్సయ్య వ్యవసాయ కూలీ!  ఒక్కగానొక్క బిడ్డ. అదీ ఆడబిడ్డ. పైగా అవిటితనం. భవిష్యత్ అంతా శూన్యం అనుకుంటూనే పెంచి పెద్ద చేశాడు. 
కానీ సీత తండ్రిలా అధైర్యపడలేదు. అవిటితనం ఆమె దృష్టికి కూడా రాలేదు. అయ్యో పాపం అనే జాలి మాటలతో కాలం వెళ్లదీయలేదు. అవే మాటలతో ఆత్మస్థయిర్యాన్ని కూడదీసుకుంది. నేలపై నిలవలేని కాళ్లకు నడకనేర్పింది. పెన్నునే ఆయుధంగా మణికట్టుతో ఒడిసిపట్టింది. చదువుల తల్లిని నమ్ముకుని అక్షర సేద్యం చేసింది. చదువే బతుకు నిలబెడుతుందని ఆశ పెట్టుకుంది. చదువే జీవితానికి వెలుగునిస్తుందని నిర్ణయించుకుంది. బరిగీసి పుస్తకాలతో కొట్లాడింది. పెన్నుతో యుద్ధం చేసింది. అక్షరాలను లొంగదీసుకుంది. 
తండ్రికి ఆర్ధిక స్థోమత లేకపోయినా కూతురు పట్టుదలను చూసి ముచ్చటపడ్డాడు. ప్రైవేటు బడికి పంపివ్వలేకపోయానే అని బాధపడ్డాడు. కానీ సీతకు మాత్రం బడి ప్రైవేటుదా సర్కారుదా అని ఆలోచించలేదు. చదవాలన్న సంకల్పం ఉంటే ఏ బడైనా ఒకటే అనుకుంది. పదో తరగతిలో మంచి మార్కులు సాధించింది. ప్రైవేటు కాలేజీలు పిలిచి ఇంటర్‌లో సీటిచ్చారు.  అక్కడ కూడా డిస్టింక్షన్ కొట్టింది. డిగ్రీలో కూడా ఫ్రీ అడ్మిషన్ దొరికింది. అక్కడా డిస్టింక్షన్. ఇక సీతకు ఎదురు లేకుండా పోయింది. డీఎడ్ కోసం మొదటిసారి పరీక్ష రాసింది. ట్రైనింగ్‌లోనూ సత్తా చూపించి డిస్టింక్షన్ సాధించింది. తర్వాత 2012 డిఎస్సీ కి ఎంపికైంది. 300 ర్యాంకు సాధించి టీచరమ్మ అయింది. పిడికిలి బిగించి చేతి గీతలు మార్చుకున్న సీతమ్మకు హాట్సాఫ్!!