గౌలిగూడ పరమేశ్వర డార్‌మెటరీ లాడ్జి
కిటికీలోంచి సారాయి స్వేచ్ఛాగానలహరి
జీరగొంతులో పోస్ట్ మాడ్రన్ అద్వైతం
*
ఫిలింనగర్ అద్దాల మేడలో ఒకానొక అందగత్తె
ఒలికిన మధుపాత్రను గతుకుతున్న శబ్దం
సిల్కు లాల్చీ చేతి కొసన
నలిగిపోయిన మల్లెదండ
లంగరుతో పడవ పెనుగులాట: కట్ అవే
**
ఉస్మానియా ఆసుపత్రి వరండాలో
ఉచ్చగత్తు వాసన
ముసిరిన ఈగల మధ్య మూర్ఛిల్లిన ముసల్ది
పక్కటెముకల్లో కట్టెలంటుకున్న వాసన
***
నాంపల్లి పబ్లిక్ గార్డెన్ చౌరస్తా
కరెంటు స్తంభం నీడలో
నెత్తురు చచ్చిన యువకుడు
ఎవడి చేతజిక్కి గంజాయి తాగెనో
****
పంజాగుట్ట ఫ్లయ్ ఓవర్ కింద
ఎండిపోయిన ఓ అమ్మ ఛాతీ
పురిటికందు నిద్దట్లోనే అన్వేషణ
బుక్కెడు పాలకోసం
తన్నుకులాడుతున్న పసికడుపు
*****
బిచ్చగాడిని నోటకరిచిన నిశిరాత్రిలో
నడిచినాకొద్దీ దారిపొడవునా
అవే నెత్తుటి గాట్లు
****** 22 రాత్రి 1.45
No comments:
Post a Comment