Sunday 26 August 2012

కొంత కవిత్వం.. ఇంకొంత పైత్యం!


 జలం గలగలలు ప్రకృతి సహజ శిలాశిల్పకళ కుంభవృష్టిగా కురిసిన వడగళ్ల వానలు.  అందమైన అరణ్య గర్భ సీమలోకి మలచిన ఒక రహస్య సొరంగ మార్గాలు. శిలా జలాశయాల్లో మునిగిపోయిన గంధర్వ లోకాలు చర్మ చక్షువులకు అందని యక్షుల స్వగ్రామాలు. రస హృదయులకు మాత్రమే దర్శనమిచ్చే అప్సరసల అంతఃకోణాలు! అజ్ఞాత శిలా యజ్ఞలోకంలా అగుపించే  పెనుశిలలన్నీ ఆరిపోయిన హోమాగ్ని గుండాలు! మేఘాలు నివురుగప్పుకున్న ధూమాలు!  హరితభరిత శిఖర శిలావిలాసం ప్రకృతి రమణీయతకు దర్పణాలు. ఇది కోనా లేక రెండుగా చీలిన తుంబురుని వీణా! ఆ లోయల్లో గండశిలల గుండెలు కరిగినీరై ప్రవహిస్తుంటే నీటిఊట నోటమాట రానీయదు. ఆకాశ రహస్య రాజ మార్గమేమో అనిపించేలా భావావేశం కలుగుతుంది. అనుభవేకవేద్యమైతేగానీ సెలయేటి జలప్రవాహ రాతి వీణాతంత్రుల నాదాల్ని వర్ణించలేం. భూగర్భం నుంచి యుగయుగాల యుగళ గీతలు వినిపిస్తుంటాయి. పచ్చని శిఖరాల కలయిక ఆకాశానికి ఓ కుండలీకరణంలా ఉంటుంది. ఉలికీ శిలకూ జరిగిన ప్రణయ పరిశ్రమలో రూపొందిన వసంతుని కోటలా వనదేవతల పేటలా అలరారుతుంటుంది. శిఖర శిలా నిలయాలలో సహజ మార్మిక శిల్పాలుగా దర్శనమిస్తాయి. వనమాహినుల్లో మోహినీ అవతారం దాగిఉంది. జలదండోరా అనిపించేలా ఉంటుందీ జలపాత ఘోష. నీటి లోతుల్లో చిరుచేపల కనుపాపల కదలికలు కనిపిస్తాయి. అరణ్య మర్మ సౌందర్యాన్ని ప్రతిబింబించే ఈ జలాశయాలు కరకు శిలల్లోంచి చెరకు రసాలు స్రవించినట్టుగా ఉంటాయి. కళను శిలను కలిపి శిల్పించిన పర్వత కుడ్య చిత్రాలు ఈ అస్పష్ట కళా సృష్టి.  రాతి దోసిలి విప్పి బాలభానుడికి సమర్పించే శిలా జలాంజలి. ఏ వన కన్య స్నానం కోసమో తరలిపోతున్నట్టుగా జిలిబిలి నడకలోతో నెమ్మదిగా కదలిపోయే ఈ జలధార  నిండు సొగసుల దారి వెంబడి పసిపాపలై దారి చూపే గజ ఈతగాళ్లలా చేపలు ముందుకు పోతుంటాయి. సెలయేటి నెమలి విప్పిన నీలి పింఛంలా గగనలోక అతిథుల్లా అడుగుపెట్టే వెండి వెలుగులు శిలా ప్రపంచంలో కిరణాలు తిరునాళ్లు జరుపుకుంటాయి. జల దేవతల సమావేశ మందిరానికి నిర్మించిన శిలా సోపానాలేమో అన్నట్టుగా ఈ రాతి మలుపులు. వినిపిస్తున్న ఈ జల సవ్వడి సామవేదానిదో లేక ప్రేమ వేదానిదో తెలిస్తే ఎంత బావుంటుందో కదా!

2 comments:

  1. అద్భుతం! మాటల్లేవండీ!

    ReplyDelete
  2. థాంక్స్‌ రసజ్ఞ గారూ...

    ReplyDelete