Wednesday, 8 August 2012

అక్షర సేనాని


ఏడు భాషా ప్రవాహాలకు ఏతమెత్తిన వాడు!అలుపెరుగని అక్షర సైన్యాధ్యక్షుడు! సంగీత సాహిత్య సమలంకృతుడు!స్వరరాగ పదయోగ సమ భూషితుడు! సంగీత కళామాతల్లుల నిత్యార్చకుడు!   తెలంగాణ సాహితీ మాగాణంలో మేరునగధీరుడు!! సామల సదాశివుడు. ఇప్పుడా తెలంగాణ సాహితీ మొగురం కూలిపోయింది. సంగీత సాహిత్యరంగాలకు ఎనలేని కృషి చేసిన అక్షరయోధుడు తుదిశ్వాస విడిచాడు.

అతని కలం నుండి అక్షరాల నది ప్రవహిస్తుంది. అతని గళం నుండి భాష ఏడు వర్ణాల సింగిడై విరబూస్తుంది. అతని పాఠాల జడిలో జ్ఞానం వేయి రేకుల వసంతమై చిగురిస్తుంది. అడవి బిడ్డల అమ్మఒడి ఆదిలాబాద్‌ నుదుటన సిందూరమై వెలిగిన ధృవతార.  అరవయేండ్లకు పైగా సాహిత్యానికే ధారపోసిన అక్షర దళపతి. ఆదిలాబాద్‌కు రెండు సరస్వతులు. అందులో ఒకరు బాసర సరస్వతి అయితే, మరొకటి పురుషుడి రూపంలో ఉన్న సామల సదాశివుడు. తెలంగాణ మాగాణంలో నిరంతర సాహితీ సేద్యం చేసిన హలికుడు. ఆయన అక్షర కోవెల. సంగీతాన్ని సాహిత్యాన్ని కలిపి మంగళ ప్రదమైన స్థానానికి తీసికెళ్లిన స్వరకోకిల. పంచెకట్టు, లాల్చిలో మేరునగధీరుడిగా ఉండే సదాశివ మాస్టర్ సాహితీవనంలో పరిచయం అక్కరలేని ప్రతిభాశాలి.
తొలితరం తెలంగాణ సాహిత్యకారుల్లో సదాశివది శాశ్వత చిరునామా. కవిగా మొదలయి, అనువాదకునిగా మారి, విమర్శకునిగా సరికొత్త విషయాలకు ఊపిరిపోసి భాషల మధ్య సయోధ్య కోసం వారధిని నిర్మించిన మహాశిఖరం. అతని సాహిత్య సేవకు అరుదైన గౌరవాలు అందివచ్చాయి. యూనివర్సిటీల నుంచి ఢిల్లీ ఎర్రకోట దాకా అవార్డులు అతని సాహిత్య సేవకు సలాం చేస్తూ క్యూకట్టాయి. ఎల్లలు లేని సంగీతానికి, సరికొత్త సొబగులు అద్దిన సాహితీయోధుడు. ఒక్కమాటలో చెప్పలాంటే తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక నిలువెత్తు సంతకం సదాశివుడు.
ఆదిలాబాద్‌ జిల్లా తెనుగు పల్లెలో 1928లో జన్మించిన సదాశివ మాస్టారు తండ్రి నాగయ్య. తల్లి చిన్నమ్మ. జిల్లాలోనే విధ్యాబ్యాసం పూర్తి చేశారు. ఎంఎ.,బీఈడీ., డీలిట్ చదివాడు. కాగజ్ నగర్ లో ఉపాధ్యాయ వృత్తిలో చేరి భద్రాచాలంలో ప్రిన్సిపాల్ గా పదవీవిరమణ చేశారు. బోధించింది హిందీ సబ్జెక్టే అయిన తేనేలూరే తెలంగాణ భాష మీద ఆకాశమంత ప్రేమ. ఒక్క కవిత్వమే కాదు, చిత్రలేఖనంతో పాటు, సంగీత, సాహిత్య, సాంస్కృత రంగాల్లో సదాశివ గారిది అందెవేసిన చెయ్యి. ఈ విలక్షణమైన నేపథ్యమే సదాశివ గారి స్థానాన్ని ఇటు సాహిత్యంలోనూ, అటు సంగీతంలోనూ హిమాలయాలంత ఎత్తున నిలబెట్టాయి. సదాశివ గారి విద్యాభ్యాసం నిజాం ఏలిన తెలంగాణాలో జరిగింది. కాబట్టి చదివింది ఉర్దూ మాధ్యమం. ఇవి కాక మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వల్ల మరాఠీ భాష అబ్బింది. ఈ బహుభాషా ప్రావీణ్యమే సదాశివగారు రెండు వారధులు నిర్మించేందుకు కారణమయింది. ఒకటి రూమీ మస్నవీకి  తెలుగులో అంజద్ రుబాయీలకు. ఇంకొకటి సియాసత్ ఉర్దూ పాఠకులకు. కవిగా, రచయితగా పేరున్నా, సంగీతంలో అభినివేశం ఉన్నా.. చిత్రలేఖనం తెలిసినా తనను తాను బడిపంతులుగా గుర్తింపు పొందడానికే ఇష్టపడతారు. చదువు చెప్పడం నా స్వభావం. మిగిలినవన్నీ వ్యాపకాలేనంటారాయన.
కాంచనమాల అందగత్తె కాదు. మంచిగ పాడుతుండె అని శ్రీశ్రీని నిర్భయంగా విమర్శించిన వాడు. తెలుగు వారందరూ కేవలం కళ్లకు పని చెప్పిన వేళ చెవులకూ పని చెప్పిన కవి సదాశివ. ఆయన స్వగ్రామం తెనుగుపల్లె వింధ్యకు దక్షిణాన తొలి గ్రామం. తెలుగువారికి చివరి ఉత్తరగ్రామం. వినే చెవిని అన్వేషిస్తూ సంగీతం వాయు మార్గంలో ప్రయాణిస్తుందిట. అలా ఉత్తరం నుంచి హిందుస్తానీ, దక్షిణం నుంచి కర్ణాటక సంగీతం సదాశివలో సంగమించాయి. ఆ ఆనంద పారవశ్యాన్ని ఆయన అనుభవించి పలవరించకుండా ఉండలేకపోయారు. అందుకే భవిష్యత్ తరాలకు తరిగిపోని సంగీత సారస్వత సంపదను కానుకగా ఇచ్చారు.
సదాశివ మాస్టారు ఏడు భాషాప్రవాహాలకు ఏతమెత్తిన వాడు! తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, పార్సీ, మరాఠీ.  ప్రభాతము, నిరీక్షణము, మంచి మాటలు, ఆర్తి, సాంబశివ శతకము తదితర పద్యసాహిత్యాన్ని సృష్టించినా అవి మనకు దొరకవు. తర్వాత కాలంలో ఆయన పద్యాల జోలికి, కవిత్వం జోలికి పోలేదు. కారణం.. తెలుగునాట పద్యాలు, కవిత్వాలు రాసేవారు చాలామంది పుట్టుకొచ్చారు. మరాఠీ, పార్సీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్‌తోపాటు సంగీతమూ తెలిసిన ఒకే ఒక్కడు సదాశివ. వాటిని తెలుగు సాహిత్యానికి వాటిని పరిచయం చేయమని సురవరం ప్రతాపరెడ్డి సూచించారు. ఆయన ఆదేశాన్ని పాటించి అమ్జద్ రుబాయిలు, మౌలానా రూమీ మస్నవి, మీర్జా గాలిబ్ జీవితమూ - రచనలూ, ఉర్దూ కవుల కవితా సామగ్రి, పార్సీ కవుల ప్రసక్తి, ఉర్దూ భాషా కవితా సౌందర్యం తదితర అపూర్వ రచనలు ప్రసాదించారు. అలాగే విశ్వనాథ కవిత్వాన్ని ఉర్దూకు పరిచయం చేసిన సౌజన్యమూర్తి .
బతుకులో సంగీతం ఉండాలి! ఇదే సదాశివ మాస్టారు సూత్రం. తెనుగుపల్లెలో వేళ్లూనుకున్న సదాశివ జీవనవృక్షం అన్ని ప్రాంతాలకూ పచ్చదనాన్ని పంచింది. పండిత్ జస్రాజ్, గంగూబాయ్ హంగల్, భీమ్‌సేన్ జోషీ తదితర హిందూస్తానీ సంగీత శిఖరాల కచేరీలను నాగపూర్ వెళ్లి విని.. ఆ ఘరానాలను మనకి పరిచయం చేశారు. అందరూ సంగీతాభిలాషను పెంచుకోవాలని కోరుకునేవాడు. అందుకు సరిపడా సాహిత్యాన్ని సదాశివ అందించారు. ఉర్దూ వల్ల ప్రభావితమైనా, తెలంగాణ ప్రాంత జీవితంలో సంగీతం ఉందికానీ.. ఇంగ్లిష్ వల్ల ప్రభావితమయినా, ఆంధ్ర ప్రాంతంలో మాత్రం సంగీతం లోపిం చిందనేవారు. సాహితీ జగత్తుకే మణిదీపమైన డాక్టర్ సామల సదాశివ అవార్డుల సిగలో చేరని నగ అంటూ లేదు. 1963 నుంచి 1983 వరకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉర్దూ సలహా సంఘం సభ్యులుగా, 1991 నుంచి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులుగా పని చేశారు. ఆయన చేసిన అంజత్ రుబాయిలు అనువాదానికి 1964లో రాష్ర్ట ప్రభుత్వం ఉత్తమ అనువాద రచనగా గుర్తించింది. 1994లో తెలుగు యూనివర్శిటీ నుంచి ప్రతిభా పురస్కారం, 2002లో కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, 2006లో ప్రతిభా రాజీవ పురస్కారం దక్కాయి.  బహుభాషా సుమ పరిమళాలు, సుస్వరాలతో సంగీత కళామా తల్లులను అర్చించిన ఆలుపెరగని అక్షరసేనానికి 2011, డిసెంబర్ 21న అరుదైన కేంద్ర సాహితీ పురస్కారం లభించింది!
భాష ఏదైనా భావస్ఫూరకమే పరమావధిగా ప్రజ్ఞచూపి పరవశింపజేసిన మన సామల ఆదిలాబాద్ జిల్లాకే కాదు తెలంగాణ మాగాణానికి గర్వకారణం. ఉర్దూలో మూడు వందలకుపైగా , తెలుగులో 450 వరకు వ్యాసాలు రాసిన అయన కలం పత్రికా పాటకులకు సైతం సాహితీ పరిమళాలను పంచింది. ఆయన నిత్య విద్యార్ధే కాదు. నిత్య చైతన్యమూర్తి. పురస్కారాలతో పొంగిపోలేదు. రానిరోజు కుంగిపోలేదు. తెలంగాణా సాహితీ మాగాణంలో కాళోజికి సరిజోడు. యాది తో సాహితివనములో చెరగని సంతకం చేసిన ఆయన సంగీత ప్రజ్ఞుకు అవధులు లేవు. సదా గుర్తుండే సామల శివుడు. సంగీతం, చ్రిత్రలేఖనాల్లో సైతం తనదైన ముద్ర వేశారు.  సరస్వతిని సంగీత-సాహిత్య సమలంకృతిగా అభివర్ణిస్తారు. అలా సాధికారంగా ప్రకటించగల ఒకే ఒక్క ప్రతిభావంతుడు సదాశివ. తెలుగు, ఉర్దూ భాషలలో దాదాపు ఏడువందలకు పైగా వ్యాసాలు రాశారు. రెండు ఖండ కావ్యాలు, ఒక నవలిక రాశారు. మొదట్లో పద్యాలూ, కథానికలూ, నవలలూ రాసినారు. కానీ సురవరం ప్రతాపరెడ్డిగారి సలహాతో ఫారసీ, ఉర్దూ సాహిత్యాల గురించి తెలుగులో గ్రంథాలూ, వ్యాసాలూ రాశారు. దాంతోపాటు హిందుస్తానీ సంగీతం, సంగీత విద్వాంసుల గురించి కూడా. హిందీ, సంస్కృతాంధ్ర సాహిత్యాల మీద ఆయనకున్న పట్టు అనన్య సామాన్యమైనది. వందల పద్యాలు నాలుక మీదుంటాయి. సందర్భానుసారం ఓ పద్యాన్నో, ఉర్దూ షేర్‌నో తప్పనిసరిగా ఉదహరిస్తారు. చాలాకాలం పాటు సదాశివ లేకుండా ఒక్క సాహిత్య సభ కూడా జరగలేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ కవులంతా ఆయన్ని బాపు అని పిలిచేవారు.
ఎంత సంక్లిష్ట విషయాన్నైనా సుక సుకాన అర్ధమయేలా చెప్పే ఆ శైలిని అమాంతం మోహింప చేయాలనిపిస్తుంది. మాస్టారి ముచ్చట్లు చదువుతుంటే సంగీతం గురించి, అందునా హిందుస్తానీ గురించి ఇంత అందంగా చెప్పొచ్చా.. ఇంత సొంపుగా రాయొచ్చా అన్న నిషా కలుగుతుంది. ఒక తవాయఫ్ గోహర్జాన్ రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గుడ్డిగవ్వకు దిగజార్చిన వైనంతో మొదలుపెట్టి..  క్రమక్రమంగా చిన్నచిన్న ఘటనలు చెప్పుకుంటూ వచ్చి… హిందుస్తానీ కళాకారుల జీవితాల్లోని ఘట్టాలను మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తారు. అలా ఎందరో హిందుస్తానీ విద్వాంసుల జీవితాల్లోని అపురూప ఘట్టాలను జలతారు జరీ పనితనంతో అల్లుకుంటూ వచ్చిన సదాశివ మాస్టారు అక్కడితో ఆగిపోలేదు. హిందుస్తానీ సంగీతం ఆవిర్భవించిన క్రమం, హిందుస్తానీ – కర్ణాటకల భేద సామ్యాలు, సొగసరి గజళ్ళ రచనా విధానం, సూఫీ తత్వం వంటి మరెన్నో సంగతులనూ సందర్భానుసారం చెబుతారు. ఆదిలాబాదు అడవులంత సతతహరితమైన ఆయన వాక్ చిత్రాలు చదవుతుంటే మలయ మారుతాల్లో తేలినట్టు ఉంటుంది.


Tuesday, 7 August 2012

అలుపెరుగని అక్షర సేనాని.. సామల సదాశివ

ఏడు భాషా ప్రవాహాలకు ఏతమెత్తిన వాడు!
అలుపెరుగని అక్షర సైన్యాధ్యక్షుడు!
సంగీత సాహిత్య సమలంకృతుడు!
స్వరరాగ పదయోగ సమభూషితుడు!!
సంగీత కళామాతల్లుల నిత్యార్చకుడు
తెలంగాణ సాహితీ మాగాణంలో మేరునగధీరుడు !!
సదా మదిలో గుర్తుండే సామల శివుడు!!!
జయన్తి తే సుకృతినో |
రససిద్ధాః కవీశ్వరాః ||
నాస్తి తేషాం యశః కాయే |
జరామరణజం భయమ్ ||

Wednesday, 1 August 2012

ఆ చేయి హిమాచలం !!

ఆయన బొమ్మ గీస్తే ఆ చిత్తరువు అచ్చెరువొందుతుంది. ఆయన వేళ్లనుంచి రూపరేఖ లావణ్య చిత్రం మరులుగొలుపుతుంది. సప్తవర్ణాల నడుమ ఆయన కుంచె మంత్ర దండంలా కనిపిస్తుంది. ప్రతీ చిత్రం మనసుని మార్దవంగా తడుముతుంది. ఆక్వా టెక్చర్‌ ఐనా ఆయిల్ పెయిటంగ్ ఐనా.. పోట్రెయిట్‌ కానీ  ఔట్‌ లైన్స్‌ కానీ! కొండపల్లి శేషగిరిరావు కుంచె విశ్వయవనిక మీద సప్తవర్ణ సొబగులు విరజిమ్మింది.
కొండపల్లి బొమ్మ గీస్తే కాన్వాసు మీద సౌందర్యం రాశులు పోసినట్టుగా ఉంటుంది. అరుణారుణ సూర్యబింబంలోంచి తారాడే మీగడ తరకల మేఘాల నడుమ ప్రకృతి వర్ణం ఆవర్ణవమై అంబారన్నంటుతుంది. స్త్రీ ఎంతటి సౌందర్య రసాధి దేవతో ఆయన కుంచె చెప్పకనే చెప్తుంది. అపురూప లావణ్య లహరులలో ఈదులాడే దేవకన్య జఘన గగన సొగసులను కాన్వాసు మీద పదిలపరిస్తే చూసే మనసు మందగమనంలో సాగుతుంది.
అడుగడుగునా అవరోధాలు. నిర్బంధ అనుభవాలు. ఆవేదనా తరంగాలు. అయినా మొక్కవోని కృషి. నిరంతర సాధన. అకుంఠిత దీక్ష. ఇవన్నీ కలబోస్తే చిత్రకళా రత్న డాక్టర్‌ కొండపల్లి శేషగిరిరావు. కొద్దిగా రంగు, ఒకచిన్న కాయితం ముక్క. ఇవి చాలు. అతని కుంచె మంత్రదండంగా మారడానికి! కొండపల్లి గీసిన ప్రతీ చిత్తరువు ఓ అపురూప కళాఖండం. ముగ్దమనోహరరంగా మనసుని రంజింప చేస్తుంది. రూపరుచిని ఆస్వాదించిన మేటి జాతీయ చిత్రకారుడు. చిత్రకళా రత్న!
వస్తువు, శిల్పం, అంతర్‌ బహిర్‌ అవగాహన. వీటికి చక్కటి ఊహను అనుసంధానం చేస్తే రూపుదిద్దుకునే చిత్రరాజం మనసు పొరల్లో గూడు కట్టుకుంటుంది. గుడికట్టి పూజలందుకుంటుంది. అలాంటి చిత్రకళకు పెట్టింది పేరు కొండపల్లి. అక్వా టెక్చర్‌, కుడ్య చిత్రాలు, పోట్రెయిట్‌, ఆయిల్ పెయింటింగ్, మ్యురల్ ఆర్ట్‌ వేయడంలో కొండపల్లి ప్రతిభ ఆసేతు హిమాచలం. తెలంగాణ తొలితరం చిత్రకారుడిగా తరిగిపోని చరిత్ర కొండపల్లి సొంతం. 
కొండపల్లి శేషగిరి రావు పుట్టింది1924లో. స్వస్థలం వరంగల్ జిల్లా మహబూబాబాద్‌. తండ్రి గోపాలరావు, తల్లి రామచుడమ్మ.చిన్నతనంలో దీనదయాల్ నాయుడు ప్రభావంతో చిత్రకళలో అభిరుచి పెరిగింది. హయగ్రీవాచారి సహాయంతో హన్మకొండలో కొంతకాలం చదువు. భూస్వామ్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కాలం కలిసి  రాక చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలు పడ్డారు. ఇటు స్టడీ, అటు పెయింటింగ్! ప్రోత్సాహం కోసం ఎందరినో ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ సమయంలో మెహ్ది నవాజ్ జంగ్ బహదూర్ దేవుడిలా సాయపడ్డారు. కొండపల్లి అభిరుచికి పట్టుకొమ్మై నిలిచారు. ఉండటానికి ఓ గది. కడుపునిండా భోజనం. చదువుకోడాని కాలేజీ సీటు ఇప్పించారు. తరువాత, బహదూర్‌ సిఫార్సుతో ఏడాది పాటు కోల్‌కతా విశ్వభారతి శాంతినికేతన్ లో సుప్రసిద్ధ చిత్రకారుడు నందాలాల్ బోస్ దగ్గర శిష్యరికం చేసి వాష్ పద్ధతి నేర్చుకున్నారు. అజంతా, ఎల్లోరా గుహాల చిత్రాలను అచ్చుగుద్దినట్టు పెయిటింగ్ వేసే మరో సుప్రసిద్ధ చిత్రకారుడు జలాలుద్దిన్  దగ్గరా  మెళకువలు నేర్చుకున్నారు. జైపూర్ బనస్థలి విద్యాపీఠ్‌ లో ఫ్రెస్కో పెయింటింగ్ పద్ధతిలో ఆరితేరారు. వృత్తి, ప్రవృత్తి చిత్రకళనే నమ్ముకునే చిత్రకళ మీదే ఆధార పడి సంసారం నెట్టుకు రావడమంటే మాటలు కాదు. జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ఇంట్లో తిండి గింజలు నిండుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఆర్టునే నమ్ముకుని సంసార బాధ్యతల్లో శేషగిరి రావు దారుణంగా వెనుక బడిపోయారు. ఎంతగా అంటే ఆయనకు ఎంత మంది సంతానమో కూడా తెలియదు. ఒకసందర్భంలో ఆయన సతీమణి గుర్తుచేసుకుని నవ్వుకున్నారు.  కళలను నమ్ముకుని, అందులోను వృత్తిధర్మంగా పెట్టుకుని జీవనం సాగించడం ఎంత కష్టమో ఆయనకి ప్రాక్టికల్‌గా తెలిసొచ్చింది. డబ్బుల కోసం నలుగురి దగ్గరా చేయి చాచాల్సి వచ్చింది. ఒక్కోసారి వారాలు చేసుకుని  బతికారు. అయినా తాను నమ్ముకున్న కళను విడువలేదు. తెలంగాణలో నిమ్న కులాల్లో ఉన్న నకాశి, పటం కథలపై పరిశోధన చేసి వాటిలో గొప్పతనాన్ని వెలుగులోకి తెచ్చిన పరిపూర్ణ జీవి. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా అరవై డెబ్బయ్‌ ఏళ్ల క్రితం సమాజంలో అంటరానితనంపై కళాసేవ చేసి నిండు జీవితం గడిపిన వాళ్లు చాలా అరుదుగా ఉంటారు.
కొండపల్లి శేషగిరి రావు. చిత్రకళలో ప్రయోగాలకు కేరాఫ్‌ అడ్రస్‌! పెయింటింగ్‌లో అక్వా టెక్చర్‌ అనే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టిన గొప్ప చిత్రకారుడు. ఆయన చిత్రాలు చూస్తుంటే నిలువెత్తు మనిషి మనతో మాట్లాడినట్టే ఉంటుంది. ఆయన సుదీర్ఘ కళా ప్రస్థానంలో దాటని మైలు రాయి లేదు. పెయింటింగ్‌లో కొండపల్లి చేయని ప్రయోగం లేదు. అక్వా టెక్క్చర్ అనే ఒక వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇవేకాక ఆయిల్ పెయింటింగ్, మ్యురల్స్ లాంటి అనేక ప్రయోగాలు చేసి సక్సెస్‌ అయ్యారు. కొండపల్లి బొమ్మల్లో ఎక్కువగా కనిపించేవి పక్షులు, వన్య మృగాలు. ఎందుకంటే ఆయన నివసించిదంతా ఆటవీ ప్రాంతం. ఆ ప్రభావం ఆయన  కాన్వాసుపై పడింది. 40వ దశకంలోనే శిల్ప చిత్రకళలో ప్రవేశం పొందారు. ఆ రోజుల్లోనే తెలంగాణ రచయితలకు సాహిత్యవేత్తలకు  అవసరమైన చిత్రాలు వేసి ఇచ్చేవారు. కొండపల్లికి చైనీస్‌ చిత్రకళలో కూడా ప్రవేశం ఉంది.
నన్నయ, పోతన, తిమ్మరసు, అక్కన్న, మాదన్న, దమయంతి, సీతారాముల చిత్రాలు కొండపల్లి సృజనకు అద్దంపడతాయి. హైదరాబాద్ అమీర్ పేటలోని మైత్రీవనంలో  టైల్స్ ఆధారంగా గీసిన అశ్వమేధం బొమ్మ కొండపల్లి సృష్టే. భారతీయ విద్యా భావన్ లో కనిపించే మ్యురల్ చిత్రాలు,  సాలార్జంగ్  మ్యూజియం లో మరొకొన్ని చిత్రాలు అన్నీ శేషగిరిరావు కుంచె నుంచి ప్రాణం పోసుకున్నవే. నిజానికి శేషగిరిరావు పెయిటింగ్స్‌ ఓ ఎడ్యుకేషన్‌. ఫైన్ ఆర్ట్స్ కాలేజీ లో ప్రొఫెసర్‌గా పనిచేసి 1984 లో రిటైర్‌ అయ్యారు. తరువాత కొంతకాలం ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కి ప్రిన్సిపాల్ గా పనిచేశారు. చిత్రకారునిగానే కాక శేషగిరిరావు ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా. ఆయన దగ్గర చిత్రకళలో శిక్షణ తీసుకున్న వాళ్ళు కూడా మేటి చిత్రకారులుగా ఎదిగారు.
1988 లో భారత ప్రభుత్వం జాతీయ చిత్రకారుడిగా  గుర్తించి ఎమిరిటస్ ఫెల్లోషిప్ ప్రదానం చేసింది. 1993 లో రాజీవ్ రత్న అవార్డు దక్కింది. 1996 లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఇప్పుడు కళారత్నగా చెప్పుకుంటున్న హంస అవార్డు 2003లోనే అందుకున్నారు.  ఆంధ్ర ప్రదేశ్ కళా అకాడమి అవార్డు కూడా పొందారు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్నప్పటికీ ప్రభుత్వం  2005 లోగానీ శేషగిరిరావుని ఫ్రీడం ఫైటర్‌గా గుర్తించలేకపోయింది. చిత్రకళకు సంబంధించిన దాని అనుబంధ కళలపై కొండపల్లి ఎన్నో గ్రంథాలు రాశారు. మాస్కో, లండన్, అమెరికా దేశాలలో శేషగిరిరావు చిత్రాల ఆర్ట్ ఎగ్జిబిషన్లు ఎన్నో జరిగాయి. లలిత కళా అకాడమీ ఫెలోషిప్‌ పొందిన శేషగిరిరావు తన జీవిత ధ్యేయం పౌరాణిక చిత్రాలను ఎంతో హృద్యంగా చిత్రీకరించడమే అంటారు. కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలానికి సంబంధించిన సుమనోహర చిత్రాలు శేషగిరిరావుకు ఎంతగానో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.
హన్మకొండ వేయిస్తంభాల గుడిలోని ప్రతిస్తంభం ఆయనకు రోజుకో పాఠం చెప్పింది. పాకాల ఒడిలో కుంచె పదునెక్కింది. రామప్ప గుడి ఆయన్ని తన హృదయాంతరాలలో నింపుకుంది. ఆ శిల్ప సౌందర్యం.. ఆ కళా సొగసులను సుదీర్ఘ, సునిశితంగా సొంతం చేసుకున్నారు. ఆయన చిత్రకళా నైపుణ్యానికి ముచ్చట పడని హృదయం లేదు. దాశరథి, సినారే లాంటి కవులు కొండపల్లి శేషగిరిరావు మీద కవిత్వం రాసేవాళ్లు. సరస కవితా విధేయ శేషగిరి రాయ అనేవారు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి.
ఆ మహాకళాకారుని మరణం తెలంగాణగడ్డకు కచ్చితంగా పూడ్చలేని లోటే.  రాతిగుట్టల మధ్య వెలసిన మొక్కలాంటి వాడు శేషగిరిరావు. సహజసిద్ధ చిత్రకారుడు తెలంగాణ తొలితరం చిత్రకారుడు లేకపోవడం విచారకరం. ఇప్పుడా మహా శిఖరం నేలకొరిగిపోయింది. చిత్రకళా మహా సముద్రం ఇగిరిపోయింది. తెలంగాణ సగర్వంగా తలెత్తుకునేలా కృషి సల్పిన మాణిక్యం మళ్లీ మట్టిలోనే కలిసిపోయింది. కొండపల్లి బొమ్మలు ఈ తరం వారికి కొత్తేమోగానీ, పాత తరం ఇళ్లలో, మనసుల్లో, గుండెల్లో, ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగా కొలువుతీరే ఉంటాయి. ఆ చిత్రకళా స్రష్టకు ససప్తవర్ణ నివాళి!!