Friday, 13 July 2012

స్నేహమేరా జీవితం!!


                              
మనిషి ఒంటరిగానే పుడుతాడు. కానీ లోకంలోకి వెళ్లేకొద్దీ ప్రపంచాన్నే కటుంబ సభ్యలుగా చేసుకుంటూ పోతాడు! మనం గొప్పగొప్పవారికి స్నేహితులం కావొచ్చు! అది గొప్పేం కాదు! కానీ ఆ స్నేహాన్ని నిలుపుకున్నామే.. అదీ గొప్ప! స్నేహితుల గురించి ఆలోచిస్తే చాలు.. మన గుండె ర్యాక్‌లోంచి తెరలుతెరలుగా కదిలేది మొదటగా బాల్య స్నేహితులే!!
ఒక్కసారి గతాన్ని డీకోడ్‌ చేసుకుంటే- పిట్టగోడ మీద సొల్లుకబుర్లు.. వన్‌బై ఫోర్‌ ఎంగిలి సిగరెట్లు.. వోణీ వేసుకున్న అమ్మాయిపై చిలిపి కామెంట్లు! అలా గురుతులన్నీ దొంతరదొంతరలుగా దొర్లిపోతుంటాయి! ఇప్పుడా ఖాళీని పూరించడానికి టైం సరిపోదు కాదు కదా..  జీవితమే సరిపోదు! ఒక్క కాలాన్ని వెనక్కి లాగితే తప్ప!!
కాలాన్ని బంధించడం ఒక్క స్నేహానికి మాత్రమే తెలుసు. మనకు దూరమైన స్నేహితులంతా పక్షలులై తిరిగొస్తే..?? మనసు కలత చెందినప్పుడల్లా ఓ స్నేహితురాలొచ్చి కరచాలనం చేస్తే..?? మోడు బారిన చెట్టు చిగురించినంత అందంగా ఉంటుంది కదా!! మండు వేసవిలో ఓ వర్షపు జల్లు కురిసినంత హాయిగా ఉంటుంది కదా!!
కానీ మనమిప్పుడు చాలా బిజీ. ఇప్పుడా స్నేహితుడు ఫుట్‌పాత్‌పై నడుస్తూనో థియేటర్‌ దగ్గరో.. చౌరస్తాలోనో కనిపిస్తాడు! ఎదురుపడ్డా పలకరించుకోని మనమధ్య స్కేలుకందని దూరమో.. చూపుడు వేలకందని దూరమో!!
ఇప్పుడు ఎవరి జీవితంలోకి తొంగిచూసినా మనం- మనపిల్లలు- కొంచెం పేరు ప్రతిష్టలు -కొందరు వ్యతిరేకులు- కొన్ని సంజాయిషీలూ- ఇంకొన్ని సర్దుబాట్లు!! స్నేహితులను పోగు చేసుకోడానికి మనకెంత అలసట? ఏమండీ..!! మనకంటూ ఎవరూ స్నేహితులే లేనప్పుడు- మన బాధలూ సంతోషాలూ షేర్‌ చేసుకునేవారే కరువైనప్పుడు- మనం ఎన్ని డాలర్లు సంపాదించి కాలర్లెగరేసినా.. లెక్కల్లో ఏదో తేడా! దోస్తులంటూ ఎవరూ లేనప్పడు మనం కింగ్‌ అయితే ఏంటి..? క్వీన్‌ విక్టోరియా అయితే ఏంటి..?!
సో, మీకీ కాన్సెప్టులో ఏ పాటా వినిపించకపోవచ్చు! మీరనుకన్న సాహిత్యమూ కనిపించకపోవచ్చు!! బట్‌.. మీ పాత ట్రంకు పెట్టెను ఒకసారి తెరచి చూడండి! అందులోంచి మీరు పోగొట్టుకున్న స్నేహితుడి ఉత్తరమేదో అంతర్మథనం చెందుతున్న రాగాలు వినపడొచ్చు! ఒక్కసారి మీ పాతడైరీని తిప్పి చూడండి! మేబీ.. మీకర్ధమయ్యే భాష వెనుక అనంత సాహిత్యమేదో కనపడొచ్చు!
స్నేహాన్ని వినడానికి భాషతో పనిలేదు! స్నేహాన్ని ధరించడానికి ఆడామగా తేడా లేదు!! ఖాళీ జీవితాన్ని ముందేసుకుని డీలా పడొద్దు!! దాన్ని స్పేహపు పాయసంతో కలిపి జుర్రేయండి! ఎంజాయ్‌ చేయండి! పండుగ చేసుకోండి!!

మా వూరంటే..



                     
బతుకమ్మ పండుగనాడు

పూల జడేసుకున్న చెరువుకట్ట

బోనాల పండుగకు

సున్నం జాజుతో పుదిచ్చిన

ముత్యాలమ్మగుడి

మా వూరంటే..

ఎత్తరగుల నాగీరయ్య దుకానం

మొండిచింత కాడ బొబ్బయ్యగారి బడి

పడావుబడ్డ రంగనాయకుల గుడి

వూరు మొత్తాన్ని తల్లిలెక్క సాదిన

కట్టకింద మంచినీల్ల బోరింగు

మా వూరంటే

కర్నపోల్ల గంగరేగు పండ్లు

గడీల శింతపలక్కాయ చెట్లు

దొరోల్ల చెట్టుకు ఇరగ్గాసిన వొనగాయలు

మా వూరంటే..

పంచాయితీ ఆఫీసుకాడ ఆలెంకీలెంక

మూడు బజాట్లకాడ గద్దొచ్చె కోడిపిల్ల

పెద్దబల్లె జిల్లగోనె

దేవుని గుల్లె పైసలాట

మావూరంటే..

తెల్లంగదెల్లార్లు సిందోల్ల బాగోతం

గొల్లొల్ల దొడ్లె పగటీలి ఆడే పటమోల్ల కత

ఎండకు రగడీలుతూ

సావటి గద్దెకాడ సాధనాసూరులాట

మా వూరంటే..

వానాకాలం రాంగనే వచ్చే బాతులోల్లు

ఎండ్లబండి మీద కందగడ్డలమ్మే లంబడోల్లు

శిక్కెంట్కెలకు బఠానీలమ్మే దొమ్మరోల్లు

ఇప్పుడు-

తెల్వదు:

ఎందుకో.. నా వూరే నాకు పరాయిదైంది

నా సోపతిగాండ్లకు కూడా చేదెక్కింది

పట్నం పొగ మొకానికి కమ్మి

వూరుకు వూరే కాన్రాకుంటైంది!!

Friday, 6 July 2012

ద రివైండ్‌: యాదికొస్తున్నయ్‌!!

                           
చెట్టు మీదనే పండిన చింతపలక్కాయల్ని
చితికిపోకుండా  పైలంగ తెంపి
ఒరం గట్టుమీద కూసొసి
ఒక్కొక్క గింజ ఒలుసుక తిన్న జ్ఞాపకం
ఇప్పటికీ నా నాల్కెకు 
తియ్యగ సప్పగ తాకుతనే ఉంటది
పగటేల ..
చిక్కటి పెరుగ్గలిపిన పజ్జొన్న గట్క జుర్రుకుంట
మజ్జె మజ్జెలో ఉల్లిపాయ పచ్చిమిరగ్గాయ
కర్రకర్ర నముల్తాంటె
కంట్లె నీల్లు తిరిగిన అనుభూతి 
యాదికొచ్చినప్పుడల్లా
నాకు పొరబోతాంటది
అప్పుడే దుస్సిన శెనిక్కాయల్ని
ఒరిగడ్డికింద కాల్చి
అవురావురని తింటాంటె
పంటికి పరుక్కున తాకిన మట్టిపెల్ల
ఇంకా నా మతిల్నే ఉంది
పొద్దుగుంకంగనె 
నాయన వాడిక కల్లు తేవడానికి              
సైకిల్‌కి లొట్టి కట్టుకుని
కాంచి తొక్కుకుంట
యాదయ్య మావ చెట్ల కాడికి పోతే
పోరడు లావటోడె అని సంబురపడి
మావ పోసిన వడగల్లు గురుతొచ్చినప్పుడల్లా
కడుపుల తియ్యటి పుల్లటి బేగులు వస్తనే ఉంటయ్‌
పీరీల పండుగనాడు
పిల్లపీరి మదార్‌గాడు ఎత్తుకుని
తల్లిపీరి నేనెత్తుకుని
మాన్కోట్‌ బీస్కోట్‌ అనుకుంట
కుడుక దండలతో బరువెక్కిపోయిన పీరీల్ని
మోసుకుంట తిరిగిన రోజులు
యాదికొచ్చినప్పుడల్లా
అస్సై దూలా పాటలు
చెవుల్లో రింగుమంటయి

Tuesday, 3 July 2012

ఏ షహర్‌ హమారా!



హైదరాబాద్ కల్చర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లందరికో చిన్న విన్నపం!! ఒక్కసారి మీమీ చెప్పులొదిలేసి నిలబడ్డ చోట కళ్లు మూసుకుని నిర్మల మనసుతో ఆలకించండి! భాగ్యనగరం మెరిసిపోతున్న ఓ పాలరాతి శిల్పంలా కనిపిస్తుంది! నయాపూల్ మీద నిలబడి చూడు ఆకాశానికి ప్రేమ బాహువులు చాపిన చార్మినార్ కనిపిస్తుంది! కళ్లల్లో బరాత్ వెన్నెల వెలుగుల లార్డ్‌ బజార్ కనిపిస్తుంది! ఆ గాజుల చప్పుడు విను! సెలయేటి అలల్లా చెవికెంత ఇంపుగా ఉంటయో!! కొంచెం పాదాలెత్తి చూడు! అరబ్బీ అప్సరసలా ఫలక్‌నూమా కనిపిస్తుంది! గర్వంగా నిలబడ్డ గోలకొండను చూడు! అంబారీ ఎనుగునెక్కినంత సంబరపడుతావ్‌! ఒక్కసారి నీ చుట్టూ నువు తిరిగి చూడు! పూలకొంగు మొఖాన కప్పుకున్న ఆకాశం నీమీద పరుచుకుంటుంది! ఆ సౌందర్యానికి దండంపెట్టు! ఆ చక్కదనానికి ముచ్చటపడు! వన్నెతరగని సంస్కృతి ముందు సాష్టాంగపడు! టైం దొరికితే షహనాయ్ రాగంలో కరిగిపో! వెన్నెల రాత్రుల ముషాయిరాలో తడిసిపో! బతుకుపో!!

Monday, 2 July 2012

రెడ్‌ లైట్‌ ఏరియా


ఇక్కడ స్త్రీ ఆకాశంలో సగంకాదు! పురుషుడి కన్నా కొంచెం తక్కువ సమానమూ కాదు!   జస్ట్‌.. ఫీమేల్‌ జెండర్‌! కాసుల ప్రేమిక! సౌందర్య నాయిక! అంతిమంగా ఒక సెక్స్‌ స్కాండల్! మాతృస్వామ్యం ఏనాడైతే కూలిపోయిందో.. బహుశా! ఇలాంటి సంఘనీతి అప్పుడే అవతరించి ఉంటుంది! పవిత్రతా  స్వచ్ఛతా  శీలమూ- ఈ మూడు ఎలిమెంట్స్‌ స్త్రీ మర్మాంగాల చుట్టూ ఇనుప కవచాలవలె ఆనాడే పురుడు పోసుకున్నాయి. మరి మహిళకు పుస్తె మెట్టెలు ఐదోతనంతో కలిపి ప్యాకేజీగా ప్రసాదించిన మగసమాజం- ఆమె శీలాన్ని మాత్రం ఎందుకు సార్వజనీనం చేసింది? దాన్నొక సామాజిక నీతిగా ఎందుకు చిత్రీకరించింది?
పతివ్రతలైన మహిళలు నాలుగ్గోడల మధ్య ఉత్తమోత్తమ జీవితాన్ని అనుభవించారనీ- మనీ కోసం మర్మాంగాల్ని అంగట్లో పెట్టిన అభాగినులు కడుహీనజీవితం గడిపారనీ- ఎవరైనా క్లాసిఫికేషన్‌ చేయగలరా? ఈ ప్రశ్న అడిగితే- ఇనుపతెర చాటున ఎర్రబారిన కళ్లతో ఉన్న మధురవాణి పగలబడి నవ్వుతుంది! ఏమగాడికైనా దమ్ముంటే ఆ నవ్వుకు అర్ధం చెప్పమను?! 
అందానికో అమ్మతనానికో అగ్గిపెట్టెల్లాంటి ఇరుకు గదుల్లో ఒరుసుకుని పడుకోలేదు! ఒత్తుగా లిప్‌స్టిక్‌ పూసుకుని- లూజ్‌ నైటీ వేసుకుని -ఆరుమూరల మల్లెపూలు జడలో తురుముకుని -వయ్యారానికో విలాసానికో రెడ్‌ లైట్‌ ఏరియా వీధుల్లో మసకమసక చీకట్లో నిలబడలేదు! బంగారంలాగే, ఎకరం భూమిలాగే, ఇక్కడ స్త్రీ కూడా ఒక సంపద! ధ్వంసం చేయకుండా ఖజానాలో కలుపుకునే రాజనీతికి ఇక్కడ చోటులేదు. ఇక్కడి స్త్రీలు తమను తాము వెలిగించుకోలేరు. తమను తాము పలికించుకోలేరు. తమను తాము పెళ్లగించుకోనూ లేరు. గీసిన గిరుల మధ్యనే- ఇచ్చిన డ్రస్సుల మధ్యనే విటులను రంజించేయాలి. మగతనాన్ని ఆవాహనం చేసుకుని నిత్య సలపరాన్ని భరించాలి! ప్రజాస్వామిక పరిభాషలో చెప్పాలంటే ఇక్కడ ఆడది శృంగార కార్మికురాలు! వేశ్యావాటికలో రాత్రీపగలూ తేడా లేకుండా నలిగిపోయే బానిసరాలు. ఎంత అన్యాయం అంటే- రుతువు వెక్కిరించి కడుపొస్తే కనీసం ప్రసవానికి ఒకరోజు మెటర్నిటీ సెలవూ ఉండదు.
ఉంటారు!! ఆ దయనీయస్థితిలో ఆడవాళ్లను బలవంతంగా కట్టేసి దోచుకునే దుర్మార్గులూ ఉంటారు. తోటిస్త్రీల శరీరాలతో వ్యాపారం చేసేవాళ్లూ కామటిపురాలోనో సోనాగచ్చిలోనో ఖారాకిళ్లీ నములుతూ అజమాయిషీ చేస్తూ సీరియళ్లలో కనిపించే ఆడవిలన్లలా కుప్పలు తెప్పలుగా కనిపిస్తారు.
అవును! వ్యభిచారాలు చేసేవాళ్లను సమాజం పరిహసిస్తుంది. వారంతా బాధితులని తెలిసినా లోకం వారినే తప్పుపడుతుంది! మీడియా కూడా అంతే!! లేడీస్‌ ఎలిమెంట్ ఉందంటే చాలు ఎక్కడలేని ఆసక్తి.  స్క్రీన్‌ మీద అదొక మానవీయ విషాద దృశ్యకావ్యం. ఇలాంటి వార్తలు వస్తున్నంత సేపు కొందరి కళ్లలో ఆకలి కొట్టుకులాడుతుంది. ఇంకొందరి కళ్లలో కన్నీరు చిప్పిల్లుతుంది.